- బడ్జెట్ లో కేటాయించిన కేంద్రం
- రెండు డబ్లింగ్ ప్రాజెక్టులు సాంక్షన్
- జీఎం అరుణ్ కుమార్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు : మధ్యంతర బడ్జెట్ లో దక్షిణ మధ్య రైల్వే కు కేంద్రం రూ.14,232.84 కోట్లు కేటాయించిందని జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. నిరుడితో పోలిస్తే ఈ ఏడాది 446.65 కోట్లు అదనంగా కేటాయించారని ఆయన తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో ప్రాజెక్టుల వారీగా కేటాయించిన నిధుల వివరాలను ఆయన వివరించారు. కొత్తగా రెండు డబ్లింగ్ ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసిందన్నారు. భద్రాచలం రోడ్డు –- డోర్నకల్ మధ్య 54.65 కిలోమీటర్ల మేర డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ. 770.12 కోట్లు, ఔరంగాబాద్– అంకై మధ్య రూ.960.64 కోట్లతో 98.25 కిలోమీటర్ల మేర డబ్లింగ్ ప్రాజెక్ట్, రూ.46.95 కోట్లతో లాతూర్ రోడ్ వద్ద బైపాస్ లైన్ మంజూరు చేసిందని జీఎం తెలిపారు.
తాజాగా కేటాయించిన నిధులతో ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతాయని ఆయన అన్నారు. ఎంఎంటీఎస్ ఫేజ్ 2కు రూ.50 కోట్లు, యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ విస్తరణకు రూ.10 కోట్లు కేటాయించిందని చెప్పారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ విస్తరించేందుకు రాష్ర్ట ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తే ముందుకు వెళతామన్నారు. సికింద్రాబాద్ స్టేషన్ పై రద్దీ తగ్గించేందుకు చర్లపల్లి టెర్మినల్ పనులు చివరి దశకు చేరుకున్నాయని, రైళ్లు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని 39 రైల్వే స్టేషన్లలో రెనొవేషన్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. రైలు ప్రమాదాలు జరగకుండా చేపడుతున్న కవచ్ ప్రాజెక్టును దశల వారీగా విస్తరిస్తున్నామని జైన్ తెలిపారు.
