ఏపీకి కరెంట్ బకాయిలు చెల్లించాలని తెలంగాణకు కేంద్రం ఆదేశం

ఏపీకి కరెంట్ బకాయిలు చెల్లించాలని తెలంగాణకు కేంద్రం ఆదేశం

హైదరాబాద్‌‌, వెలుగు: ఏపీకి కరెంట్ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర సర్కార్ ను కేంద్రం ఆదేశించింది. 2014 నుంచి -2017 వరకు తెలంగాణకు ఏపీ డిస్కంలు కరెంట్ సరఫరా చేశాయని పేర్కొంది. దీనికి సంబంధించి రూ.3,441.78 కోట్ల బకాయిలు, 2022 జులై 31 వరకు లేట్ పేమెంట్ చార్జీల కింద మరో రూ.3,315.14 కోట్లు కలిపి మొత్తం రూ.6,756.92 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఏపీ విభజన చట్టం ప్రకారం ఈ మొత్తాన్ని నెల రోజుల్లోగా చెల్లించాలని సెంట్రల్ పవర్‌‌ మినిస్ట్రీ డిప్యూటీ సెక్రటరీ అనూప్‌‌ సింగ్‌‌ బిస్త్‌‌ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. కాగా, రెండు రాష్ట్రాల మధ్య ఎప్పటి నుంచో విద్యుత్ బకాయిల వివాదం నడుస్తోంది. ఏపీనే తమకు బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలంగాణ అంటోంది. ‘‘ఏపీ మాకు మొత్తం రూ.17,828 కోట్లు బాకీ ఉంది. మేము ఏపీకి చెల్లించాల్సిన రూ.3,442 కోట్ల బకాయిలు, మరో రూ.1,446 కోట్ల వడ్డీ కలిపి మొత్తం రూ.4,887 కోట్లు ఇవ్వాల్సి ఉంది. మాకు రావాల్సిన వాటిలో వీటిని తీసేస్తే, ఇంకా మాకే ఏపీ రూ.12,940 కోట్లు ఇవ్వాల్సి ఉంది” అని తెలంగాణ అంటోంది. 

రాష్ట్రంపై కేంద్రం కక్ష: జగదీశ్ రెడ్డి 
రాష్ట్రంపై కేంద్రం కక్ష కట్టిందని మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ నుంచి తమకు రూ.12,900 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, అవి ఇప్పించాలని ఎన్నిసార్లు లేఖలు రాసిన స్పందించలేదని ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, బకాయిలు నెల రోజుల్లో చెల్లించాలనడం దుర్మార్గమన్నారు. తెలంగాణలో కోతల్లేకుండా కరెంట్ ఇస్తున్నామని, ఇది జీర్ణించుకోలేని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు.