నీట్ పీజీ అడ్మిషన్లకు కటాఫ్ మార్కులు తగ్గింపు

నీట్ పీజీ అడ్మిషన్లకు కటాఫ్ మార్కులు తగ్గింపు

న్యూఢిల్లీ: నీట్ పీజీ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు కటాఫ్ మార్కులను తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అన్ని కేటగిరీల కటాఫ్ మార్కులను 25 శాతం చొప్పున తగ్గించినట్లు వెల్లడించింది. జనరల్ కేటగిరి అభ్యర్థులకు 25 శాతం, జనరల్ కేటగిరిలోని దివ్యాంగులకు 20 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు, ఆయా విభాగాల్లోని దివ్యాంగులకు 15 శాతం మేర కటాఫ్ మార్కులను తగ్గించినట్లు వివరించింది.

తగ్గించిన కటాఫ్ మార్కుల ప్రకారం.. నీట్ పీజీ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ కోసం అర్హత సాధించేందుకు జనరల్ కేటగిరీ అభ్యర్థులు 24.28 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 14.29 శాతం, దివ్యాంగులు 19.29 శాతం చొప్పున మార్కులు పొందితే సరిపోతుంది. ఈ నేపథ్యంలో కటాఫ్ మార్కుల తగ్గింపు అనంతరం అడ్మిషన్లకు అర్హత సాధించిన అభ్యర్థులు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేయించుకొని, మాప్ అప్ రౌండ్ కౌన్సెలింగ్​లో పాల్గొనాలని కేంద్ర ఆరోగ్యశాఖ కోరింది. గత  సెషన్​లో జరిగిన పీజీ మెడికల్ కోర్సుల కౌన్సెలింగ్​లో 1,400 సీట్లు మిగిలిపోయాయి. ఆ సీట్లను భర్తీ చేసే ఉద్దేశంతోనే కటాఫ్ మార్కులను తగ్గించినట్లు తెలుస్తోంది.