విమోచన దినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు

విమోచన దినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు

సెప్టెంబర్ 17న నిర్వహించబోయే వేడుకులకు కేంద్ర సాంస్కృతిక శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ఈ సభకు పెద్దఎత్తున జనసమీకరణ చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చీఫ్ గెస్ట్ గా. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేర్లను ప్రస్తావిస్తూ ఇన్విటేషన్ వీడియోను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి రిలీజ్ చేశారు. 

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలను కేంద్రం నిర్వహిస్తోంది. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే సభకు సంబంధించిన ఇన్విటేషన్ వీడియోను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి రిలీజ్ చేశారు. ‘హైదరాబాద్ విమోచన పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరులను స్మరించుకుందాం రండి’ అంటూ వీడియో రిలీజ్ చేశారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్న ఈ వేడుకలకు సంబంధించి.. తెలంగాణ సీఎం కేసీఆర్, కర్నాటక సీఎం బస్వరాజు బొమ్మై, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే పేర్లను ప్రస్తావిస్తూ ఇన్విటేషన్ వీడియో ఉంది. ఈనెల 17వ తేదీన ఉదయం 8 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను అమిత్ షా ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత పారా మిలటరీ బలగాల ప్రత్యేక పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాఖండాల ప్రదర్శన, నృత్య రూపకాలు, దేశభక్తిని పెంపొందించే ప్రదర్శనలు ఉంటాయని కిషన్ రెడ్డి తెలిపారు. 

ఎవరో అడ్డుకుంటారని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుండా ఉండొద్దని గవర్నర్ తమిళి సై అన్నారు. నిజాం నుంచి విముక్తి పొందిన విధానం గురించి భవిష్యత్తు తరాలు తెలుసుకోవాలని సూచించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళి సై పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. పరేడ్ గ్రౌండ్స్ లో ఫోటో ఎగ్జిబిషన్ ఈ నెల 17వరకు కొనసాగనుంది.