
- భూసారంపై సెంట్రల్ సర్వే
- తెలంగాణ వ్యాప్తంగా రంగంలోకి టీమ్‌లు
నిర్మల్, వెలుగు : తెలంగాణ వ్యాప్తంగా తగ్గిపోతున్న భూసారంపై కేంద్రం సమగ్రంగా సర్వే చేస్తోంది. రసాయన ఎరువులు, పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడడంవల్ల రాష్టంలో భూసారం క్రమంగా తగ్గిపోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఎక్కడెక్కడ భూసారం ఏ మేరకు తగ్గిందన్న అంశాన్ని తెలుసుకునేందుకు అన్ని జిల్లాల్లో ఎంపిక చేసిన మండలాల్లో శాటిలైట్ ఆధారంగా సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా 15 రోజులుగా నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిటైల్డ్సాయిల్ సర్వే (డీఎస్ఎస్) నిర్వహిస్తున్నారు.
సాయిల్, ల్యాండ్ యూజ్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ల్యాండ్ ఫెర్టిలిటీ ఎక్స్‌పర్ట్‌లతో టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌లు డీటెయిల్ సాయిల్ సర్వే, సాయిల్ ఫెర్టిలిటీని పరీక్షించనున్నాయి. ఒక్కో చోట 1.5 ×1.5 కిలోమీటర్ల పరిధిని ఒక గ్రిడ్‌గా గుర్తిస్తారు. ఈ గ్రిడ్‌లో లోతుగా తవ్వకాలు జరిపి.. మట్టి నమూనాలు తీసుకుంటారు. ఇంటర్ ప్రిటేషన్ కీ మానిటరీ పద్దతిలో మట్టిని పరీక్షిస్తున్నట్టు నిపుణులు చెప్తున్నారు. ఎక్కడెక్కడ నమూనాలు సేకరించారన్న సమాచారాన్ని జియోలాజికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా కేంద్ర వ్యవసాయ శాఖకు పంపుతారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో రెండు చొప్పున, మంచిర్యాల, అసిఫాబాద్ జిల్లాలకు ఒక్కో టీమ్‌ను ఏర్పాటు చేశారు.
నిర్మల్ జిల్లాలో 2. 23 లక్షల హెక్టార్లు, ఆదిలాబాద్ జిల్లాలో 2.28 లక్షల హెక్టార్లు, మంచిర్యాల జిల్లాలో 1.23లక్షల హెక్టార్ల పంట పొలాలు సర్వే పరిధిలోకి రానున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్వే సీరియస్ గా సాగుతోంది. సర్వే టీమ్‌లు ఉదయం నుంచి సాయంత్రం వరకు శాటిలైట్ మ్యాప్ ఆధారంగా పంట చేలల్లో మట్టి సేకరించి పరీక్షిస్తున్నారు. డిసెంబర్ 15 లోగా ఉమ్మడి జిల్లాలో సర్వేను పూర్తి చేయనున్నట్లు చెప్తున్నారు.
వేసిన పంటలే వేయడం వల్ల నష్టం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఎక్కువగా పత్తి, వరి సాగవుతున్నాయి. పంట దిగుబడి పెంచుకోవాలన్న ఆశతో రైతులు రసాయనిక ఎరువులు, పురుగులమందులు పెద్ద ఎత్తున వాడుతున్నారు. దీంతో భూసారం క్రమంగా తగ్గుతోంది. ప్రతిఏటా వరి, పత్తి మాత్రమే సాగు చేస్తుండడం వల్ల సారం తగ్గుతుందని, దాని ప్రభావం దిగుబడుల మీద కూడా పడుతుందని కేంద్ర సర్వే నిపుణులు చెప్తున్నారు. భూసారం తగ్గడానికి కారణాలను తెలుసుకోవడంతో పాటు సారాన్ని పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో స్టడీ చేసేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని అంటున్నారు. ప్రతి సారీ వరి, పత్తి మాత్రమే వేయకుండా ప్రత్యామ్నాయాలపై రైతులు దృష్టి పెట్టేలా చూడాలని కేంద్రం భావిస్తోంది. ఈ సర్వే అనంతరం భూసారం బాగా తగ్గిపోయిన ప్రాంతాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి, ఆయా జిల్లాల అధికారులకు సమాచారాన్ని ఇస్తుంది. అక్కడ భూసారాన్ని కాపాడడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచిస్తుంది. ప్రత్యామ్నాయ పంటల సాగు, సేంద్రియ ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమాలను చేపడుతుంది.
పకడ్బందీగా సర్వే
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భూసారంపై పకడ్బందీగా సర్వే చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సాయిల్, ల్యాండ్ యూజ్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా సర్వే జరుగుతోంది. మితిమీరిన ఎరువులు, పురుగుమందుల వాడకం వల్ల దేశవ్యాప్తంగా భూసారం తగ్గిపోతోంది. ఇలాంటి ప్రాంతాలను గుర్తించిన కేంద్ర వ్యవసాయ శాఖ శాటిలైట్ ఆధారంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో సర్వే చేపడుతోంది. ఏయే ప్రాంతంలో భూసారం ఏ మేరకు తగ్గిందన్న వివరాలు ఈ సర్వే ద్వారా తెలుస్తాయి. - డాక్టర్ సందీప్ కె.ఆర్ త్రిపాఠి, ఏ ఎఫ్ ఓ, సాయిల్, ల్యాండ్ యూజ్ సర్వ్ ఆఫ్ ఇండియా