
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో చేసిన చట్టంపై కేంద్రం వెంటనే స్పందించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలన్న ప్రధాన డిమాండ్ తో గత 20 రోజులుగా బీసీ హిందూ మహాసభ అధ్యక్షుడు బత్తుల సిద్దేశ్వర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని, ఆయన దీక్షను విరమింపజేయాలని ఆదివారం ఓ ప్రకటనలో జాజుల కోరారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును గవర్నర్ కూడా ఆమోదించి రాష్ట్రపతికి పంపి వారం రోజులు గడుస్తున్నదని గుర్తుచేశారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు.
అసెంబ్లీలో చేసిన బిల్లుకు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు తెలిపారని, కానీ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర బీజేపీ నిర్ణయానికి విరుద్ధంగా బీసీ బిల్లును ఆమోదించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు . బీజేపీకి ఒకే పార్టీ, ఒకే విధానం ఉన్నట్లయితే ఇప్పటికైనా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు . బీసీల డిమాండ్ల సాధన కోసం గత 20 రోజులుగా ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న బత్తులపైనా కేంద్రం వెంటనే స్పందించాలన్నారు. ఇప్పటికే సిద్దేశ్వర ఆరోగ్యం క్షీణించిందని, తక్షణమే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆయనతో మాట్లాడి దీక్ష విరమింపజేసేలా చర్యలు తీసుకోవాలని జాజుల డిమాండ్ చేశారు. సిద్దేశ్వర్కు ఏమైనా జరిగితే కేంద్రానిదే బాధ్యత అని పేర్కొన్నారు.