కేంద్రం కులగణన నిర్ణయం.. రాహుల్ పోరాట ఫలితం!

కేంద్రం కులగణన నిర్ణయం.. రాహుల్ పోరాట ఫలితం!

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గత కొంతకాలంగా కులగణన (caste census) కోసం చేస్తున్న పోరాటం భారత రాజకీయాలకు కొత్త ఎజెండాను ఇచ్చింది. కులగణనకు ఒక ఉద్యమ రూపు ఇచ్చిన ఘనత మాత్రం రాహుల్ గాంధీకి దక్కుతుంది. ఆయన ఈ అంశాన్ని సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ రక్షణకు కీలకమైనదిగా పరిగణిస్తూ,  దీనిని తన జీవితలక్ష్యంగా అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. కులగణనను ఒక సాధారణ జనాభా లెక్కలాగ కాకుండా, సామాజిక, ఆర్థిక అసమానతలను బయటపెట్టే ‘సామాజిక ఎక్స్ రే’గా అభివర్ణించారు.  

కులగణన అంటే కేవలం జనాభా లెక్క కాదని అది సామాజిక న్యాయం అత్యున్నత దశ అని రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా గట్టిగా వాదించారు. కులగణన ఆచరణలో పెడితే ఆర్థికస్థితి, వివిధ రంగాల్లో పరిపాలన, న్యాయవ్యవస్థలో వారి భాగస్వామ్యం ఎంత అన్నది బహిర్గతం అవుతుంది. విధాన రూపకల్పనలో కులగణన ఒక గణాంక సేకరణ మాత్రమే కాదు, సమాజంలో సంపద విభజన, విద్య, ఉద్యోగ అవకాశాలను సమన్యాయంగా అందించడానికి విధానాలు రూపొందించడానికి పునాదిగా ఉపయోగపడుతుందన్నది రాహుల్ గాంధీ నమ్మిన ఫిలాసఫీ. 

50% రిజర్వేషన్ పరిమితి తొలగించాలని రాహుల్ గాంధీ  అభిప్రాయపడుతున్నారు. 2024 కులగణనపై జరిగిన సర్వేలో 70% మంది రాహుల్ గాంధీ అభిప్రాయంతో ఏకీభవించారు. కులగణన ద్వారా అసమానతలను బయటపెట్టి, బలహీన వర్గాలకు పరిపాలన, విద్య, వనరులలో సమాన వాటా కల్పించిన్నప్పుడు మాత్రమే కులగణన సిద్ధాంతం విజయవంతం అయినట్టు అన్నది రాహుల్ గాంధీ విజన్. 

రాహుల్ గాంధీ పార్ల మెంట్​లో  కులగణన ప్రస్తావ తెచ్చినప్పుడల్లా బీజేపీ నాయకులు రాహుల్ గాంధీపై దాడి చేసినంత స్థాయిలో తీవ్రంగా  స్పందించారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న అనురాగ్ ఠాకూర్ లాంటి నేతలు నిండు  పార్లమెంట్​లో రాహుల్ కుల,  మత ప్రస్తావన తీసుకొచ్చి వ్యక్తిగత విమర్శలు చేసే స్థాయికి దిగజారారన్నారు.  అలాంటి అవమానాన్ని కూడా  రాహుల్ గాంధీ స్వయంగా అనుభవించారు. విభజన రాజకీయాలు చేస్తున్నారని,  దేశాన్ని కులాల ఆధారంగా విభజిస్తున్నారని, బీజేపీ నేతలు పదే పదే ప్రస్తావిస్తూ ఎదురు దాడులు చేసిన సందర్బాలని దేశ ప్రజలు మరువగలరా?  

రాహుల్ గాంధీ కులగణన సిద్ధాంతాన్ని  ప్రతిపాదించిన నాటి నుంచి విపక్షమే కాకుకుండా స్వపక్షమైన కాంగ్రెస్ నుంచి కూడా కొందరి విమర్శలను ఎదుర్కొన్నారు.  కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ,  శశిథరూర్, కపిల్ సిబల్ లాంటి నేతలు రాహుల్​ కులగణన వాదాన్ని సమర్థించలేకపోయారు.  ఇది కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ విధానాలకు విరుద్ధమని అన్నవాళ్లూ ఉన్నారు. 

తాజాగా మోదీప్రభుత్వ కులగణనకు అనుకూలంగా కేబినెట్​లో నిర్ణయం  తీసుకోవడం మరోమారు ఈ అంశం చర్చలోకి వచ్చింది. 2026 జనాభా గణనతో  పాటు కులగణనకు కేంద్రం ఆమోదించడంతో దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఇది రాహుల్ గాంధీ ఎన్నికల అజెండాను బీజేపీ సొంతం చేసుకునే ప్రయత్నం అనడంలో సందేహంలేదు.  ముఖ్యంగా బిహార్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓబీసీ ఓట్లను ఆకర్షించేందుకు కేంద్రం పన్నిన వ్యూహంగా భావిస్తున్న వారూ ఉన్నారు. ఏదీ ఏమైనా మనం లేవనెత్తిన అంశంలో ధర్మం ఉంటే పాలకులు ఎవరైనా పరిష్కారం తప్పదని మరోసారి రుజువు అవుతుంది.

సామ్యవాది రాహుల్ ​గెలిచాడు

రాహుల్​గాంధీలో ఒక బలమైన సామ్యవాది ఉన్నాడు. ఎలాంటి ఫలితం ఆశించకుండా 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి భారత ప్రజల కష్టసుఖాలు తెలుకున్నాడు. కాంగ్రెస్​ నేతల ధోరణి ఎలా ఉన్నా, ఆయన నమ్మిన పంథాలో పయనిస్తూ బడుగులకు న్యాయం కోసం నడుస్తున్నాడు. దేశానికి ఒక దిశ దశ అందిచాలనే కుతూహలం ఆయనలో కనిపిస్తున్నది. సమన్యాయమే తన లక్ష్యంగా పయనిస్తున్నాడు. 

ఆయన రాజీవ్​, ఇందిర వారసుడే కావచ్చు. కానీ, రొటీన్​ రాజకీయాలకు అతీతంగా ఆలోచించే శక్తి తనలో ఉందని నిరూపించుకుంటున్నాడు. అందుకే విపక్షమేగాక,  స్వపక్షనేతలు కూడా సహకరించకపోయినా కూడా  సమన్యాయమే ఎజెండాగా పయనిస్తున్నాడు. ఆయన చేపట్టిన పంథా ఇవాళ దేశ రాజకీయాల్లో ఒక అనివార్యతను సృష్టించింది. దాని ఫలితంగానే ఇవాళ మోదీ ప్రభుత్వం కులగణనను చేపడతామని చెప్పకతప్పలేదనే భావన ఇవాళ దేశవ్యాప్తంగా ఉంది. 

కులగణన చేపడతామంటున్న మోదీకి ఎవరు ఎంత క్రెడిట్​ ఇచ్చినా.. దానికి ప్రేరణ కాగలిగిన రాహుల్​గాంధీకి కూడా అంతే క్రెడిట్​ దక్కుతుంది. మొత్తం మీద రాహుల్​గాంధీ మోదీ ప్రభుత్వానికి ఒక రాజకీయ అనివార్యతను సృష్టించి గెలిచాడు.

ఇల్లు అలుకగానే పండుగ కాదు!

కులగణన జరిగితేనే సరిపోయేది కాదు. ఆయా కులాల జనాభా అధారంగా బీసీలకు రిజర్వేషన్​ కల్పించాలి. 50 శాతం రిజర్వేషన్​ పరిమితిని ఎత్తివేయాలి. అలా ఎత్తివేస్తేగానీ మిగతా బడుగు వర్గాలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లు దక్కవు. అలాగే  జనాభా ఆధారంగా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లూ దక్కాలి. ఇవన్నీ జరిగితేగానీ.. సమన్యాయం దక్కని పరిస్థితి. కాబట్టి,  కులగణన  తర్వాత తీసుకునే నిర్ణయాలే రేపటి సమన్యాయానికి కొలమానం అవుతాయి. 

అందుకే ఇల్లు అలుకగానే పండుగ కాదు. కులగణన జరుపుతామన్న  మోదీ ప్రభుత్వం కూడా పై విషయాలపై స్పష్టత ఇవ్వాల్సిఉంది. మొత్తం మీద రాహుల్ ​పోరాటం, మోదీ చాణక్యం మధ్య బడుగు వర్గాలకు రాబోయే కాలంలో ఏమేరకు న్యాయం జరగనుందో వేచి చూడాల్సిందే.  

 

- దొమ్మాట వెంకటేశ్,
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్