పామాయిల్​ సాగుతో ఫాయిదా ఎంత..? : దొంతి నర్సింహారెడ్డి

పామాయిల్​ సాగుతో ఫాయిదా ఎంత..? : దొంతి నర్సింహారెడ్డి

పామాయిల్​సాగు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మభ్యపెడుతున్నాయి. విదేశీ ద్రవ్య వ్యయాన్ని తగ్గించడానికి పామాయిల్ ను ఆదర్శ పంటగా ప్రోత్సహిస్తున్నామని కేంద్రం చెబుతున్నది. కానీ విదేశీ మారక ద్రవ్యం ఖర్చు తగ్గించడం కోసం భూగర్భజల వనరుల ఖర్చు పెరుగుతున్నదనే వాస్తవం మాత్రం విస్మరిస్తున్నది. పామాయిల్ విస్తరణతో దేశంలో కరువు, ఎడారీకరణకు బాటలు పడే ప్రమాదం ఉంది. మంచి పంట రావాలంటే ఎకరాలో 56  పామాయిల్ చెట్లకు రోజుకు 250 లీటర్ల కంటే ఎక్కువ నీరు అవసరం ఉంటుంది. ఇండో-మలయన్ ప్రాంతంలో ఏడాదికి సగటున 2700 మి.మీ వర్షపాతం ఉంటుంది కాబట్టి అక్కడ పామాయిల్ తోటలు సాధ్యపడ్డాయి. నీటి కొరత ఉన్న మన దేశంలో సగటు వర్షపాతం 800 మి.మీ. మించని పరిస్థితుల్లో పామాయిల్ తోటలు భూగర్భ జలాల మీద, కాలువల సాగు మీద ఆధార పడాల్సి వస్తుంది. అలాంటి నీరు ఎల్లకాలం ఉండకపోవచ్చు. అంటే, నీటి మీదనే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. భూగర్భ జల వనరుల మీద ఒత్తిడి పెరుగుతుంది.

అడవుల నాశనం

గత 20 ఏండ్లలో భారతదేశం అతిపెద్ద పామాయిల్ దిగుమతిదారుగా అవతరించింది. ఇండోనేషియా, మలేషియాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నది. పామాయిల్ దిగుమతి కోసం 2015లో 10 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. అపార దిగుమతుల వల్ల, పామాయిల్ తోటల వల్ల అక్కడి పర్యావరణం, ప్రకృతిపైన జరుగుతున్న దుష్ప్రభావంలో మన దేశ పాత్ర కూడా గణనీయంగా ఉంటుంది.  2017 ఏప్రిల్​లో స్వదేశీ పామాయిల్ ఉత్పత్తి పెంచడానికి కేంద్రం కొన్ని చర్యలు చేపట్టింది. పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశించడం కోసం భూ పరిమితిని(25 హెక్టార్లు) తొలగించాలని నిర్ణయించింది. అదనపు ప్రోత్సాహకంగా, ప్రపంచ పామాయిల్ దిగ్గజాలను ఆకర్షించడానికి100 శాతం విదేశీ పెట్టుబడులకు అవకాశం ఇచ్చింది. ఇవన్నీ నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్స్ అండ్ ఆయిల్ పామ్(ఎన్​ఎహ్​వోవోపీ) కింద చేపట్టింది. అయితే ఆ దిగ్గజాలు ఇప్పటి దాకా రాలేదు. అందుకే కావొచ్చు, ఇటీవల కేంద్రం ప్రకటించిన రూ.11 వేల కోట్ల రూపాయల పామాయిల్ పథకం కేవలం ఈశాన్య రాష్ట్రాలకు పరిమితం చేశారు. ఇండోనేషియా, మలేషియాల్లో జరిగినట్లుగా అడవులను నాశనం చేసి, పెద్ద ఎత్తున పండించకపోతే పామాయిల్ సాగు సాధ్యం కాదు. ఈ పరిస్థితి దృష్ట్యా, కేంద్రం ఒక నిబంధన చేసింది. ఆయిల్ ఫామ్ పండించే రాష్ట్రాల్లోని బంజరు భూమిని ఆయిల్ ఫామ్ తోటల పెంపకం కోసం ప్రైవేట్ వ్యవస్థాపకులకు జాయింట్ వెంచర్ల ద్వారా లీజుకు ఇవ్వొచ్చు. లేదా కొనుగోలు చేయవచ్చు. ఈ సడలింపు వల్ల మన దేశంలో ఉన్న ఉమ్మడి ప్రకృతి వనరులు విధ్వంసమయ్యే అవకాశం కనపడుతున్నది. తమ జీవనోపాధికి అవసరమైన అనేక వస్తువుల కోసం అడవులు, బంజరు, కంచే భూములు ఇంకా ఇతర ఉమ్మడి ప్రజా వనరుల మీద ఆధారపడే గ్రామీణ జనం, గిరిజనులు పామాయిల్ తోటల పెంపకం వల్ల నష్టపోతారు. జీవనోపాధి కోల్పోవచ్చు కూడా.

విషరసాయనాలతోనూ ముప్పు..

తమిళనాడులోని తిరుచ్చి, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, మైలదుతురై, తిరునెల్వేలితో సహా పలు జిల్లాల్లో పామాయిల్ తోటలు ఉన్నాయి. 150 ఎకరాల వరకు భూమి ఉన్న సంపన్న రైతులు పామాయిల్ సాగు కోసం 30 నుంచి 70 ఎకరాల మధ్య కేటాయించారు. కొద్దిమంది చిన్న రైతులు మూడు నుంచి ఏడు ఎకరాల మధ్య పంటను సాగు చేశారు. మొత్తం మీద పామాయిల్ ను అదనపు ఆదాయంగా చూశారు. అయితే క్రమంగా తర్వాతి దశల్లో(ఏడు నుంచి పదేండ్లలో) సమస్యలు పెరగడం ప్రారంభమైంది. పంట కొనుగోలు, ధర విషయంలో హెచ్చుతగ్గులు ప్రభావం చూపెడుతున్నాయి. వాటి వల్ల నష్టాలు చవిచూసి, చాలా మంది రైతులు మళ్లి సేంద్రీయ వ్యవసాయానికి మొగ్గు చూపారు. పామాయిల్ మొక్క జీవితకాలం సుమారు 25 ఏండ్లు. తర్వాత రైతు తన పంటను తీసివేసి, తిరిగి నాటాలి. ఆదాయం కోసం ఐదేండ్లు వేచి ఉండాలి. కొంతమంది పెద్ద రైతులు పంటను నిలుపుకోగలిగారు. కానీ చిన్న రైతులు చాలా ఒత్తిడికి గురయ్యారు. తీవ్రంగా నష్టపోవటం వల్ల, భూములనే అమ్ముకోవాల్సి వచ్చింది. 2010 నాటికి, ఆ తర్వాత దేశంలో చాలా మంది రైతులు పామాయిల్ పంటలు తీసివేశారు. తగినంత దిగుబడి లేక, వచ్చిన దిగుబడికి ధర రాక నష్టపోయారు. 2010లో ఉన్న పరిస్థితుల కారణంగా సుమారు 30 వేల హెక్టార్ల పామాయిల్ తోటలను తీసివేసినా, కారణాలను ప్రస్తావించకుండానే, కేంద్ర ప్రభుత్వం డీవోపీఆర్ విజన్ 2030 పామాయిల్ ను ఆదర్శ పంటగా చిత్రీకరించే ప్రయత్నంలో కీలకమైన రుగ్మతలను దాచి పెడుతున్నది. ఆయిల్​ఫామ్​సాగు కోసం వాడుతున్న పురుగుమందుల్లో అత్యంత ప్రమాదకరమైన విష రసాయనాలు ఉన్నాయి. డ్యూరాన్, అట్రాజైన్, పారాక్వాట్ లాంటి వాటిని ఐరోపా సహా 32 దేశాల్లో నిషేధించారు. పారాక్వాట్​మన దేశంలో ఒడిశా, రాజస్థాన్, కర్నాటకలో మరణాలకు కారణమైంది. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ, సిఫారసు చేస్తున్న ఇతర విషాల్లో మోనోక్రోటోఫాస్ కూడా ప్రమాదకరమైంది. ఇది పక్షులకు అత్యంత విషపూరితమైనది. 

సబ్సిడీలు, ప్రోత్సాహకాలు

పామాయిల్​ సాగుకు సబ్సిడీలు ఇచ్చినా, వాటి మీద కూడా పరిమితులు ఉంటాయి. ప్రభుత్వం ఎల్లకాలం ఇవ్వలేదు. మార్కెట్ ధరల్లో హెచ్చు తగ్గులు ఓ ఎత్తయితే, దిగుబడి కూడా పోటీ మేరకు లేదు. ప్రస్తుతం హెక్టారుకు భారతదేశ పామాయిల్ ఉత్పాదకత1.12 టన్నులు కాగా, ఇండోనేషియా ఉత్పాదకత 3.87 టన్నులు. టన్నుకు ఉత్పత్తి ఖర్చు కూడా ఇక్కడ ఎక్కువ. దిగుమతుల సుంకాల ద్వారా, పరిమాణం మీద నియంత్రణ లేకపోతే, మన దేశీయ ఉత్పత్తి, ఉత్పాదకత ఎట్లా పెరుగుతుంది? తక్కువ ఖర్చుతో, అధిక ఉత్పత్తి సాధించగలిగితేనే పామాయిల్ లో స్వయం సమృద్ధికి అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు పామాయిల్ సాగును ప్రోత్సహిస్తోందో అర్థం కాని పరిస్థితి ఉంటే, తెలంగాణ రాష్ట్రం కూడా రైతులను అదే బాట పట్టిస్తున్నది. వచ్చే నాలుగేండ్లలో రాష్ట్రంలో మొత్తం 8,09,371 హెక్టార్ల భూమిని ఆయిల్ ఫామ్ సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం చూస్తున్నది. పామాయిల్ సాగులో ఉన్న 36,421 హెక్టార్ల భూమి కన్నా ఇది 22 రెట్లు ఎక్కువ. ఇంత పెద్ద మొత్తంలో సాగు చేస్తే, భూగర్భజలాలు, కరెంట్​వినియోగం బాగా పెరుగుతాయి. పామాయిల్ పంటకు కనీసం 25 ఏండ్ల ఆలోచన అవసరం. కేంద్ర, రాష్ట్రాల విధానాల మధ్య సయోధ్య ఉండాలి. ఇవేవి లేని పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఆశ్చర్యం కలిగిస్తున్నది. పామాయిల్ పెద్ద కమతాల్లో సాగు చేయడం సులభం. అందుకనే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద కమతాలనే ప్రోత్సహిస్తున్నాయి. మరి, చిన్న, సన్నకారు రైతుల పరిస్థితి ఏమిటి? పామాయిల్ వల్ల రైతులకు గిట్టుబాటు కావాలంటే సబ్సిడీలు తప్పనిసరి. మన దేశంలో ఎక్కడా పామాయిల్ పూర్తిగా వర్షాధార పంట కాదు. అదనపు సాగునీరు కావాల్సిందే.

గిట్టుబాటు ధర లేక..

2013 గణాంకాల ప్రకారం.. దేశంలో పామాయిల్ పండించే14 రాష్ట్రాల్లో(ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు) ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. పామాయిల్ కింద ఉన్న 200,000 హెక్టార్లలో, 86 శాతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(తెలంగాణతో సహా) లో ఉన్నది. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీసెర్చ్ తన విజన్ 2030 డాక్యుమెంట్ లో ఆయిల్ ఫామ్ కింద10 లక్షల హెక్టార్లను సాధించాలని లక్ష్యం పెట్టుకున్నది. ఆయిల్ ఫామ్ సాగుకు రైతులను ప్రేరేపించడానికి, సాగు వల్ల కలిగే ప్రయోజనాల గురించి వారికి అవగాహన కల్పించడానికి, కొత్త సాంకేతిక ఉపయోగం, సంకరజాతుల వినియోగం ప్రోత్సహించాటానికి, తగిన సౌకర్యాలు, సబ్సిడీలను ఇవ్వాలని డాక్యుమెంట్​లో పొందుపరచారు. అయితే, దీని మీద చర్చ మాత్రం పెట్టలేదు. ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు. కార్పొరేట్ కంపెనీలను ఆకర్షించడానికి సులభమైన రీతిలో భూమిపై ఉన్న ఆంక్షలను సడలించాలని, తద్వారా దేశం పామాయిల్ ఉత్పత్తిలో ముందడుగు సాధించాలనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఇండోనేషియా 22.2 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేస్తే, ఇండియా కేవలం 0.08 మిలియన్ టన్నులనే ఉత్పత్తి చేస్తున్నది. వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో పామాయిల్ దిగుమతులు అనివార్యం. 2020–-21లో పామాయిల్ మీద దిగుమతి సుంకం 49 శాతం ఉండగా, ఈ ఏడాది ప్రభుత్వం దాన్ని సున్నాకు కుదించింది. ఫలితంగా, రైతులకు ప్రాసెసింగ్ ప్లాంట్లు ఇచ్చే ధర కూడా టన్నుకు రూ.20 వేల నుంచి రూ.10 వేలకు పడిపోయింది. పర్యవసానంగా దాదాపు1,60,000 ఎకరాల్లో పామాయిల్ చెట్లను తీసివేశారు. 

- దొంతి నర్సింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్