కరోనా విపత్తే..ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

కరోనా విపత్తే..ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

కరోనాను విపత్తుగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. శనివారం కేంద్ర హోం శాఖ దీనిపై అధికారిక ప్రకటన చేసింది. వైరస్​తో చనిపోయిన వాళ్ల కుటుంబానికి, అది సోకిన వాళ్లకు పరిహారం అందించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. స్టేట్​ డిజాస్టర్​ రెస్పాన్స్​ ఫండ్స్​ (ఎస్డీఆర్​ఎఫ్​) నిధులను అందుకోసం వాడుకోవచ్చని తెలిపింది. ఇందులో భాగంగా వైరస్​తో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందించొచ్చని సూచించింది. కరోనాతో హాస్పిటల్​లో చేరి ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న బాధితులకూ రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చులు భరించాలని సూచించింది. క్వారెంటైన్​లో ఉంటున్న వాళ్లకు తాత్కాలిక వసతి, తిండి, నీళ్లు, బట్టలు, మందుల వంటి సౌకర్యాలను కల్పించాలని చెప్పింది. అదనపు టెస్టింగ్​ సెంటర్లు, పోలీసులకు ప్రొటెక్టివ్​ పరికరాలు, ఆరోగ్య, మున్సిపల్​ శాఖ అధికారులు, సిబ్బంది, థెర్మల్​ స్కానర్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరికరాల కోసం ఎస్డీఆర్​ఎఫ్​ నిధులను వాడుకోవచ్చని చెప్పింది. అయితే, ఆ నిధులన్నింటినీ కేవలం రాష్ట్రాల వాటా నుంచే తీసుకోవాలని, నేషనల్​ డిజాస్టర్​ రెస్పాన్స్​ ఫండ్​ (ఎన్డీఆర్​ఎఫ్​) నుంచి తీసుకోవద్దని చెప్పింది. కేటాయింపుల్లో పరికరాల ఖర్చు  పది శాతానికి మించొద్దని ఆదేశించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జనాలు ఎక్కువగా రాకుండా మార్చి 16న ఆరు బెంచ్​లు 12 చొప్పున అర్జెంట్​ కేసులు మాత్రమే విచారించాలని సుప్రీం కోర్టు సూచించింది. భీమా కొరెగావ్​ కేసులో గౌతమ్​ నవలఖ, ఆనంద్​ తేల్​టుంబ్డే ముందస్తు బెయిల్​ పిటిషన్​తో పాటు, నిర్భయ దోషుల్లో ఒకడైన ముకేశ్​ సింగ్​ పిటిషన్లను బెంచ్​లు విచారించనున్నాయి.

స్టూడెంట్లూ..ఎక్కడికీ వెళ్లొద్దు

అమెరికాలో ఎమర్జెన్సీని ప్రకటించిన నేపథ్యంలో అక్కడ చదువుతున్న ఇండియన్​ స్టూడెంట్లెవరూ బయటకు వెళ్లొద్దని అమెరికాలోని ఇండియన్​ ఎంబసీ అధికారులు సూచించారు. అనవసరపు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని కోరారు. అమెరికాలోగానీ, ఇంటర్నేషనల్​ ప్రయాణాలుగానీ ఉంటే క్యాన్సిల్​ చేసుకోవాలని చెప్పారు. అమెరికాలో ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో మార్చి 16 నుంచి ఇండియాలోని అమెరికా ఎంబసీ, కాన్సులేట్లలో అన్ని వీసా అపాయింట్​మెంట్లను రద్దు చేసింది అమెరికా. ఇప్పటికే అపాయింట్​మెంట్లు తీసుకున్నోళ్లు రీషెడ్యూల్​ చేసుకోవాలని చెప్పింది.

ఇంకొకరు మృతి?

మహారాష్ట్రకు చెందిన 71 ఏళ్ల వ్యక్తి కరోనా లక్షణాలతో చనిపోయాడు. బుల్ధానా జిల్లా ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ తీసుకుంటూ మరణించాడు. ఇటీవలే అతడు సౌదీ అరేబియా నుంచి తిరిగొచ్చాడని అధికారులు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం హైబీపీతో ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో అతడు చేరాడని, కరోనా లక్షణాలుండడంతో శనివారం ఉదయం జిల్లా ఆస్పత్రికి పంపించారని, ఐసోలేషన్​ వార్డులో పెట్టి ట్రీట్​మెంట్​ చేశామని ఆస్పత్రి సివిల్​ సర్జన్​ ప్రేమ్​చంద్​ పండిట్​ చెప్పారు. సాయంత్రం 4.20 గంటలకు చనిపోయాడని, శాంపిళ్లను టెస్టుల కోసం పంపామని చెప్పారు. దేశంలో కేసుల సంఖ్య 84కు పెరిగింది. కరోనాతో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న ఏడుగురు వ్యక్తులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారని, వాళ్లలో కరోనా తగ్గిపోయిందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మొత్తం కేసుల్లో 17 మంది విదేశీయులేనని చెప్పింది. అందులో 16 మంది ఇటలీ వాళ్లు కాగా, ఒకరు కెనడాకు చెందిన వ్యక్తి అని పేర్కొంది. పాజిటివ్​ వచ్చిన వాళ్లను కలిసిన 4 వేల మందిని క్వారెంటైన్​లో పెట్టామని తెలిపింది. ఇరాన్​లో చిక్కుకున్న వారిని మహాన్​ ఎయిర్​ ఫ్లైట్​లో తీసుకొచ్చారు. శనివారం అర్ధరాత్రి ఆ విమానం ముంబైలో ల్యాండ్​ అయింది. ఇటలీలోని మిలాన్​లో చిక్కుకున్న ఇండియన్లను తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా ఎయిరిండియా విమానాన్నీ పంపామని చెప్పింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కమ్యూనిటీ సర్వైలెన్స్​, క్వారెంటైన్​, ఐసోలేషన్​ వార్డులు, సిబ్బంది, ర్యాపిడ్​ రెస్పాన్స్​ టీమ్​లను ఇప్పటికే సిద్ధం చేశామని పేర్కొంది. పాజిటివ్​ వచ్చిన వాళ్లను కలిసిన వ్యక్తులు క్వారెంటైన్​లో ఉండేందుకు చాలా మంది ఇష్టపడట్లేదని చెప్పింది. ఇటలీలో చిక్కుకున్న 21 మంది కేరళకు తిరిగొచ్చారు. వాళ్లను అళువాలోని హాస్పిటల్​లో ఐసోలేషన్​లో పెట్టారు.

పారిపోయిన్రు..మళ్లీ వచ్చిన్రు

కరోనా అనుమానితులు నలుగురు ఆస్పత్రి నుంచి పారిపోయారు. లక్షణాలు ఎక్కువవుతుండడంతో మళ్లీ ఆస్పత్రికి వచ్చి చేరారు. శుక్రవారం ముగ్గురు మగవాళ్లు, ఇద్దరు ఆడవాళ్లు నాగ్​పూర్​లోని ఇందిరా గాంధీ గవర్నమెంట్​ మెడికల్​ కాలేజ్​ అండ్​ హాస్పిటల్​ (ఐజీజీఎంసీహెచ్​)కు వచ్చారు. అందులో ఓ వ్యక్తికి నెగెటివ్​ వచ్చింది. మిగతా నలుగురి శాంపిళ్లను టెస్టులకు పంపించారు. అప్పటి వరకు ఆస్పత్రిలోనే ఐసోలేషన్​ వార్డులో ఉండాలని సిబ్బంది చెప్పారు. అందుకు వాళ్లు ఒప్పుకోలేదు. అక్కడి నుంచి వెళ్లిపోయారు. శనివారం నాటికి వాళ్లలో లక్షణాలు ముదురుతుండడంతో మధ్యాహ్నం టైంలో వాళ్లంతట వాళ్లే వచ్చి ఆస్పత్రిలో చేరారు. జ్వరం లక్షణాలుండి కొచ్చి మెడికల్​ కాలేజీలో జాయిన్​ అయిన ఇద్దరు అమెరికా దంపతులు పారిపోయారు. కొచ్చి ఎయిర్​పోర్టులో వాళ్లను పట్టుకుని కళామసేరీ మెడికల్​ కాలేజీ హాస్పిటల్​ ఐసోలేషన్​ వార్డులో చేర్పించారు. మార్చి 9న ఆ ఇద్దరు లండన్​ నుంచి వయా దోహా ఇండియాకు వచ్చారు. కొచ్చిలో కథకళి షోను చూసి, అళప్పుజలోని ఫోర్ట్​  కొచ్చి రిసార్ట్​లో బస చేశారు. ఇప్పుడు క్వారెంటైన్​కు పోయారు. కరోనా బాధితులను ట్రీట్​ చేయనని అన్నందుకు జమ్మూకాశ్మీర్​ డాక్టర్​ సలీమ్​ భట్టిని సస్పెండ్​ చేశారు.

పారిపోయిన టెకీ భార్యకూ పాజిటివ్

బెంగళూరులోని గూగుల్​ ఎంప్లాయికి కరోనా పాజిటివ్​ వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఇటలీలో హనీమూన్​కు వెళ్లారు ఆ దంపతులు. తిరిగి రాగానే భర్తకు కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే ఇద్దరినీ బెంగళూరులో క్వారెంటైన్​ చేశారు. కానీ, అతడి భార్య (25) ఈ నెల 8న క్వారెంటైన్​ నుంచి తప్పించుకుని వెళ్లిపోయింది. విమానంలో న్యూఢిల్లీకి వెళ్లింది. అక్కడి నుంచి రైల్లో ఆగ్రాలోని తల్లిదండ్రుల దగ్గరకు చేరింది. అంతేకాదు, ఆ టైంలో ఇంట్లో మొత్తం 8 మంది ఉన్నారు. మెడికల్​ టీం వెళ్లి రిక్వెస్ట్​ చేసినప్పుడు రైల్వే ఇంజనీర్​ అయిన ఆమె తండ్రి క్వారెంటైన్​కు వెళ్లలేదని, తన బిడ్డ బెంగళూరుకు వెళ్లిందంటూ అబద్ధం చెప్పాడని ఆగ్రా చీఫ్​ మెడికల్​ ఆఫీసర్​ డాక్టర్​ ముకేశ్​ కుమార్​ వత్స్​ చెప్పారు. జిల్లా కలెక్టర్, పోలీసుల​ సాయంతో మళ్లీ వాళ్ల ఇంటికి వెళ్లి అందరినీ క్వారెంటైన్​కు పంపించామన్నారు. ఆమెకూ కరోనా పాజిటివ్​ వచ్చిందని చెప్పారు.

మరో 4 ఐటీబీపీ క్వారెంటైన్​లు

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరో నాలుగు క్వారెంటైన్​ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. నాలుగు రాష్ట్రాల్లో ఆ క్వారెంటైన్​ సెంటర్లను పెట్టనుంది. మొత్తంగా 1,300 మందిని వాటిలో క్వారెంటైన్​ చేసేలా వసతులు కల్పిస్తున్నారు. తమిళనాడులోని శివగంగైలో 300, చండీగఢ్​లో 580, అరుణాచల్​ ప్రదేశ్​లోని కిమిన్​లో 210, ఎంపీ కరేరాలో 180 మందిని క్వారెంటైన్​ చేస్తారు.

పద్మ అవార్డుల వేడుక వాయిదా

పద్మ అవార్డుల ప్రదానోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. మార్చి 26న వేడుక జరగాల్సి ఉండగా, దానిని ఏప్రిల్​ 13కి పోస్ట్​పోన్​ చేసింది. ఈ మేరకు శనివారం కేంద్ర హోం శాఖ ప్రకటన జారీ చేసింది. ఈ ఏడాది ఏడుగురికి పద్మ విభూషణ్​, 16 పద్మభూషణ్​, 118 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది.