రాష్ట్రానికి మస్తు ఉపాధి పైసలు..ఈ ఏడాదికి రూ.2778 కోట్లు

రాష్ట్రానికి మస్తు ఉపాధి పైసలు..ఈ ఏడాదికి రూ.2778 కోట్లు
  •     వీటితోనే రైతు వేదికలు, శ్మశానాలు, కల్లాల వంటి వాటి నిర్మాణం
  •     ఈజీఎస్​లో రాష్ట్ర వాటా రూ.168 కోట్లు మాత్రమే
  •     ఈ ఏడాది రికార్డు స్థాయిలో 13 కోట్ల వర్కింగ్​ డేస్​ పూర్తి
  •     కొత్తగా 6.14 లక్షల జాబ్ కార్డులు
  •     కరోనా కష్టకాలంలోఆదుకున్న కేంద్రం నిధులు

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో ఎంప్లాయ్​మెంట్​ గ్యారంటీ స్కీమ్​ (ఈజీఎస్​) కింద చేపట్టిన  పనులు, కూలీల జీతాల​ కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించింది. ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించేందుకు, మెటీరియల్​ వర్క్స్​ కోసం ఈ ఫైనాన్షియల్ ఇయర్​ లో ఇప్పటి వరకు రూ.2,778.12 కోట్లు ఇచ్చింది. గత ఏడాదితో పోల్చితే ఈ సారి సుమారు రూ.500 కోట్లు అదనంగా రిలీజ్​ చేయడం విశేషం. కూలీల వర్కింగ్​ డేస్​ ఎన్ని ఎక్కువ ఉంటే, అన్ని నిధులను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. మరిన్ని నిధులు రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు టార్గెట్లు పెట్టి మరీ గ్రామాల్లో పనులు చేయిస్తోంది. ఉపాధి హామీ పనులకు కేసీఆర్​ సర్కారు రూ.168 కోట్లు మాత్రమే ఇచ్చింది.

పల్లె ప్రగతి పనులన్నీ ‘ఉపాధి’ నిధులతోనే..

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి పనులకు ఉపాధి హామీ నిధులను విరివిగా వాడుకుంటోంది. గ్రామాల్లో సీసీ రోడ్లు,  రైతు వేదికలు, శ్మశాన వాటికలు, పంట పొలాల్లో కల్లాలు, కాల్వల పూడిక, డంపింగ్ యార్డుల నిర్మాణానికి ఈజీఎస్ డబ్బే దిక్కు అవుతోంది. రాష్ట్రంలో 2,601 రైతు వేదికల కోసం రూ.572.22 కోట్లు ఖర్చయ్యాయి. వీటిలో రూ.260.10 కోట్లు ఈజీఎస్​ నిధులే! ఒక్కో రైతు వేదిక నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.10 లక్షలు ఖర్చు చేస్తున్నారు.  పొలాల్లో ల‌‌‌‌క్ష క‌‌‌‌ల్లాల కోసం రూ.750 కోట్ల ఈజీఎస్​ నిధులను వాడుతున్నారు.  గ్రామాల్లో నిర్మిస్తున్న 12,703 వైకుంఠధామాలు (శ్మశానాలు) కట్టడానికి అవసరమయ్యే 90 శాతం డబ్బును ఈజీఎస్​ నిధుల నుంచే తీసుకుంటున్నారు. ఒక్కో శ్మశాన వాటిక నిర్మాణ వ్యయం రూ.12 లక్షలు కాగా, వీటిలో రూ.10 లక్షలు ఈజీఎస్​ నిధులే! గ్రామాల్లో చేపట్టిన 12,660 డంపింగ్ యార్డులు కట్టడానికి 90 శాతం డబ్బును ఈజీఎస్​ మెటీరియల్ వర్క్స్​ఫండ్స్​ నుంచి తీసుకున్నారు. ఎస్సారెస్సీ కాల్వలు, చెరువులు, కుంటలను కలిపే కాల్వల్లో నిలిచిన పూడిక, అనవసర మొక్కల తొలగింపులోనూ ఉపాధి హామీ కూలీలను వినియోగిస్తున్నారు.

13 కోట్లు దాటిన వర్కింగ్​ డేస్​…

తెలంగాణ ఏర్పాటు తర్వాత 2015–-16 ఫైనాన్షియల్​ ఇయర్​ లో 14.21 కోట్ల వర్కింగ్​ డేస్ కల్పించగా.. ఆ తర్వాత అన్ని వర్కింగ్​ డేస్ ఎప్పుడూ ఇవ్వలేదు.  ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా చాలా మంది వలస కూలీలు పట్టణాల నుంచి సొంత గ్రామాలకు వచ్చారు. ఇతర పనుల్లేక ఉపాధి హామీ పనుల బాట పట్టారు. ఇలా  51.68 లక్షల మంది కూలీలు పనికి రాగా 13.19 కోట్ల వర్కింగ్​ డేస్​ కల్పించారు. ఈ ఆర్థిక సంవత్సరం మరో నాలుగు నెలలు ఉన్నందున ఈ సంఖ్య  16 కోట్లు దాటే అవకాశముంది. ప్రస్తుతం రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల మంది కూలీలు పనులకు వస్తున్నారు.  గతంలో ఎన్నడూ ఉపాధి హామీ పథకం పనులకు రాని 2,85,063 కుటుంబాలు ఈసారి వచ్చాయి.  రోజుకూలీ రేటును కేంద్ర ప్రభుత్వం రూ.237కు పెంచింది. 6,14,084 మంది తమకు పని కావాలని కొత్తగా దరఖాస్తు చేసుకోవడం విశేషం. కొత్త జాబ్​ కార్డులను ఎప్పుడూ ఇస్తున్నప్పటికీ, ఈ ఏడాది ఏకంగా 2.85 లక్షల కుటుంబాలు కొత్త కార్డులు పొందాయి.