ఇంకిన్ని రైళ్లు నడపండి..రాష్ట్రాలను కోరిన కేంద్రం

ఇంకిన్ని రైళ్లు నడపండి..రాష్ట్రాలను కోరిన కేంద్రం

న్యూఢిల్లీవలస కూలీలను తరలించేందుకు మరిన్ని శ్రామిక్ స్పెషల్ రైళ్లు నడపాలని రాష్ర్టాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇందుకోసం రైల్వే శాఖతో కోఆర్డినేషన్ చేసుకోవాలని సూచించింది. రైల్వే ట్రాకులు, రోడ్ల వెంట ఏ ఒక్క వలస కూలీ కూడా నడవకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అని హోం శాఖ స్పష్టం చేసింది. నడిచి వెళ్లే మైగ్రెంట్లను గుర్తించి వెంటనే వాళ్ల కోసం ఏర్పాట్లు చేయాలని సూచించింది. అన్ని రాష్ట్రాల సీఎస్‌‌‌‌లకు కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్‌‌‌‌ భల్లా లెటర్‌‌‌‌‌‌‌‌ రాశారు. ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసి కూలీలను సొంతూళ్లకు పంపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వలస కూలీలు నడచివెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిండి, శానిటేషన్‌‌‌‌, క్వారంటైన్‌‌‌‌ తదితర ఏర్పాట్లు చూసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రాల సీఎస్‌‌‌‌లకు పంపిన లెటర్‌‌‌‌‌‌‌‌లను అజయ్‌‌‌‌ ట్వీట్‌‌‌‌ చేశారు.

పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్త

పిల్లలు, మహిళలు, ముసలివాళ్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ర్టాలను కేంద్రం కోరింది. వలస కార్మికుల తరలింపుకు సంబంధించి మంగళవారం కేంద్ర హోం శాఖ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ (ఎస్​వోపీ) జారీ చేసింది. ‘‘కరోనా భయం, ఉపాధి లేకపోవడం వల్ల మైగ్రెంట్లు సొంతూళ్లకు వెళ్తున్నారు. అందుకే రాష్ర్టాలు మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపాలి. అలాగే శానిటేషన్, ఫుడ్, హెల్త్ వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని విశ్రాంతి స్థలాలు ఏర్పాటు చేయాలి’’ అని అజయ్ భల్లా సూచించారు. బస్సులు, ట్రైన్లు బయలుదేరే టైమ్ విషయంలో క్లారిటీ లేదని, దీంతో కార్మికుల్లో అసహనం ఏర్పడుతోందని అన్నారు. బస్​స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విశ్రాంతి స్థలాలకు నడిచి వెళ్తున్న కార్మికులకు ట్రాన్స్​పోర్టేషన్ ఏర్పాటు చేయాలని, వారిని అధికారులు గైడ్ చేయాలని కోరారు. అలాగే మైగ్రెంట్ల అడ్రస్​లు, నంబర్లు తీసుకోవాలని, అవసరమైన సమయంలో ఇవి కాంటాక్ట్ ట్రేసింగ్​కు ఉపయోగపడుతాయని అన్నారు. రాష్ర్టాల సరిహద్దులు దాటేందుకు బస్సులను అనుమతించాలని, ఆపొద్దని సూచించారు.

1,565 రైళ్లు.. 20 లక్షల మంది మైగ్రెంట్లు

మే 1వ తేదీ నుంచి ఇప్పటిదాకా 1,565 శ్రామిక్ రైళ్లు నడిపామని, 20 లక్షల మందికిపైగా వలస కార్మికులను సొంత రాష్ర్టాలకు తరలించామని రైల్వే తెలిపింది. ఉత్తరప్రదేశ్​కు 837 రైళ్లు, బీహార్​కు 428, మధ్యప్రదేశ్​కు 100కు పైగా రైళ్లు వివిధ రాష్ర్టాల నుంచి వెళ్లినట్లు రైల్వే మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. రైల్వే డేటా ప్రకారం.. ఒక్క గుజరాత్​నుంచే పలు రాష్ర్టాలకు 500 పైగా రైళ్లు, మహారాష్ర్ట నుంచి 300 పైగా వెళ్లాయని చెప్పారు.