ఏప్రిల్ 10న కోవిడ్‌ సన్నద్ధతపై దేశవ్యాప్తంగా మాక్‌ డ్రిల్‌ 

ఏప్రిల్ 10న కోవిడ్‌ సన్నద్ధతపై దేశవ్యాప్తంగా మాక్‌ డ్రిల్‌ 

దేశంలో మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతుండంటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. గతవారం కరోనా కేసులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండవియా సూచించారు. ఇందులో భాగంగానే అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులలో సౌకర్యాలపై ఏప్రిల్ 10న (సోమవారం), 11న (మంగళవారం) దేశవ్యాప్తంగా మాక్‌ డ్రిల్‌ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే హర్యానాలోని ఝజ్జర్‌ ఎయిమ్స్‌లో మాండవియా మాక్‌డ్రిల్‌ను పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. 

ఇటీవల కరోనా కేసులు గణనీయంగా పెరుతున్నాయని, దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎదుర్కొనేలా సంసిద్ధంగా ఉందని మాండవియా చెప్పారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా కరోనా నాలుగో వేవ్‌పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. చివరి కోవిడ్‌ మ్యూటేషన్‌ ఓమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీఎఫ్‌.7, ఇప్పుడు వస్తున్న మరో వేరియంట్‌ ఎక్స్‌బీబీ 1.16 వంటి కారణంగానే కేసులు పెరుగుతున్నాయన్నారు.

గత కొన్ని రోజులుగా దేశంలో చాలా ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున అనేక రాష్ట్రాల్లో మళ్లీ మాస్కులు తప్పనిసరి చేయడమేగాక మరికొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించింది కేంద్రం. ముందుజాగ్రత్తగా హర్యానా, పుదుచ్చేరి వంటి రాష్ట్రాలు బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. హర్యానాలోని పాఠశాలల్లో కూడా మాస్క్‌లు తప్పనిసరి చేశారు.