రూపాయల్లో బిజినెస్​ బెస్ట్​

రూపాయల్లో బిజినెస్​ బెస్ట్​

రూపాయి కరెన్సీలో వ్యాపారం చేసేందుకు మరిన్ని దేశాలతో  ఒప్పందాలు కుదుర్చుకోవాలని బ్యాంకులకు, పరిశ్రమ సంఘాలకు ప్రభుత్వం సూచించింది. ఇది వరకే 18 విదేశీ బ్యాంకులు వోస్ట్రో ఖాతాలను తెరిచాయి. 

న్యూఢిల్లీ : డాలర్​పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. అంతేగాక విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. ఇది వరకే రష్యా, మారిషస్, శ్రీలంకలతో రూపాయి వాణిజ్యాన్ని తేలిక చేసిన ప్రభుత్వం, మరిన్ని దేశాలతో ఇటువంటి అవకాశాలను అన్వేషించాలని వాణిజ్య సంస్థలను,  బ్యాంకులను కోరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.  భారతీయ బ్యాంకులు ఇప్పటికే ఈ మూడు దేశాల బ్యాంకుల్లో ప్రత్యేక వోస్ట్రో రూపాయి ఖాతాలను (ఎస్​వీఆర్​ఏలు) తెరిచాయి. రూపాయి కరెన్సీలో అమ్మకాలు, కొనుగోళ్లు  చేస్తున్నాయి. ఇటీవల ఎస్​బీఐ  మారిషస్ లిమిటెడ్,  పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంకలు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ)లో ఎస్​వీఆర్​ఏని ప్రారంభించాయి. అంతేగాక, బ్యాంక్ ఆఫ్ సిలోన్ చెన్నైలోని దాని భారతీయ అనుబంధ సంస్థలో ఇదేరకం ఖాతాను తెరిచింది.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రష్యా రాస్ బ్యాంక్ లో ప్రత్యేక రూపాయి ఖాతాను తెరిచింది.

చెన్నైకి చెందిన ఇండియన్ బ్యాంక్ కొలంబోకు చెందిన ఎన్​డీబీ బ్యాంక్  సెలాన్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌తో సహా మూడు శ్రీలంక బ్యాంకుల్లో ఎస్​వీఆర్​ఏ ఖాతాలను తెరిచింది. ఆర్​బీఐ ఆమోదం రావడంతో రష్యాకు చెందిన రెండు బ్యాంకులు,  శ్రీలంకలోని ఒక బ్యాంకుతో సహా 11 బ్యాంకులు రూపాయి ఖాతాలను తెరిచాయి. దేశీయ కరెన్సీలో సరిహద్దు వాణిజ్య లావాదేవీలపై ఆర్​బీఐ మార్గదర్శకాలను ఈ ఏడాది జూలైలో జారీ చేసింది. సంబంధిత పక్షాలతో ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో  కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ అంశంపై చర్చించింది. రూపాయితో వ్యాపారాన్ని మరిన్ని దేశాలను అన్వేషించాలని,  ఎస్​వీఆర్​ఏల ద్వారా ఇరుపక్షాల వ్యాపారాలను విస్తరించాలని సూచించింది.  దేశీయ చెల్లింపు పద్ధతులను అంతర్జాతీయీకరించే ప్రణాళికలలో భాగంగా ఈ విధానాన్ని ఏర్పాటు చేయాలని కోరింది.

రష్యా యుద్ధం మొదలయ్యాక...

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల నేపథ్యంలో చాలా దేశాలు రష్యాతో వ్యాపారం చేయలేకపోతున్నాయి. ఈ దేశానికి చాలా బ్యాంకుల ఆర్థిక సేవలు నిలిచిపోయాయి. స్విఫ్ట్​ పేమెంట్స్​ నెట్​వర్క్​ నుంచి రష్యా వైదొలగాల్సి వచ్చింది. దీంతో రూపాయి వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. రష్యాలోని అతిపెద్ద బ్యాంకులైన ఎస్​బర్​బ్యాంక్​, వీటీబీ బ్యాంక్  ఈ ఏడాది జూలై నుంచి ఆర్​బీఐ మార్గదర్శకాల ప్రకారం రూపాయి వాణిజ్యానికి ఓకే చెప్పాయి.  రూపాయల్లో ఎగుమతులు/దిగుమతుల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌వాయిస్, చెల్లింపు, సెటిల్‌‌‌‌మెంట్ కోసం అదనపు ఫెసిలిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. భారతదేశంలో తన శాఖ లేకున్నా రష్యాకే చెందిన గాజ్​ప్రోమో బ్యాంక్​, కోల్‌‌‌‌కతాకు చెందిన యూకో బ్యాంక్‌‌‌‌లో కూడా ఎస్​వీఆర్​ఏ ఖాతాను తెరిచింది. ప్రత్యేక వోస్ట్రో ఖాతాలను తెరవడం వల్ల భారతదేశం– రష్యా మధ్య రూపాయి వాణిజ్యం మరింత సులభతరం అవుతుందని, చెల్లింపుల సెటిల్మెంట్లకు ఇబ్బందులు ఉండవని కేంద్ర ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి.

భారతీయ కరెన్సీలో సరిహద్దు వాణిజ్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నాయి. రూపాయి వాణిజ్యాన్ని మరింత పెంచడానికి, భారత ప్రభుత్వ సెక్యూరిటీలలో మిగులు మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి ప్రత్యేక వోస్ట్రో ఖాతాలకు ఆర్​బీఐ అనుమతించింది. "ఈ విధానం ద్వారా దిగుమతులు చేసే భారతీయ దిగుమతిదారులు  భారత రూపాయల్లో డబ్బు చెల్లిస్తారు. ఇది విదేశీ అమ్మకందారుడి నుంచి వస్తువులు, సేవలు, సరఫరా కోసం ఇన్‌‌‌‌వాయిస్‌‌‌‌లపై భాగస్వామి దేశం చెల్లించిన మొత్తం  కరస్పాండెంట్ బ్యాంక్  వోస్ట్రో ఖాతాలో జమ అవుతుంది’’ అని ఆర్​బీఐ పేర్కొంది.