బియ్యం ధరలు తగ్గించండి : వ్యాపారులకు కేంద్రం వార్నింగ్

బియ్యం ధరలు తగ్గించండి : వ్యాపారులకు కేంద్రం వార్నింగ్

భారతదేశంలో బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బాస్మతీయేతర బియ్యం ధరలు ఆకాశన్నంటాయి. ప్రస్తుతం మార్కెట్‌లో బాస్మతీయేతర బియ్యం ఆ బియ్యం రకాన్ని బట్టి రూ.40 నుంచి 60 మధ్య పలుకుతోంది. సన్న బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. వారం పది రోజులుగా అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో క్వింటాలుకు వెయ్యిపైనే పెరిగి మునుపెన్నడూ లేని విధంగా సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి. దాంతో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. అందులో భాగంగా తాజాగా బియ్యం పరిశ్రమలకు కఠిన ఆదేశాలను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.

దేశీయ మార్కెట్ లో బాస్మతీయేతర బియ్యం ధరలు వేగంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగానే బియ్యం ధరల నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రెటరీ సంజీవ్ చోప్రా.. రైస్ ప్రాసెసింగ్ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యారు. బాస్మతీయేతర బియ్యం ధరలు అదుపులో ఉండేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చోప్రా కోరారు.

దేశంలో ఉన్న నాణ్యమైన బియ్యాన్ని ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ కింద 29 రూపాయలకే ప్రాసెసర్లకు అందజేస్తున్నారని, ప్రాసెసర్లు అదే బియ్యాన్ని మార్కెట్లో రూ.43 నుంచి 50 వరకు విక్రయిస్తున్నారని, దాన్ని దృష్టిలో ఉంచుకునే తాము ఆదేశాలు జారీచేస్తున్నామని సమావేశంలో సంజీవ్‌ చోప్రా చెప్పారు. గత జూలైలో బియ్యం ధరలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. ఎగుమతి సుంకాలను 20 శాతం వరకు పెంచింది.

మరోవైపు.. బియ్యం ధరలు విపరీతంగా పెరగడంతో అమ్మకాలు పడిపోయినట్లు వ్యాపారులు చెబుతుండగా, ఇదే అదునుగా కొందరు మిల్లర్లు, ట్రేడర్లు మాయాజాలం ప్రదర్శిస్తున్నారనే విమర్శలున్నాయి. ఉన్న సన్న బియ్యాన్ని బ్లాక్‌ చేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.