హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్లకు గ్రీన్​సిగ్నల్​

హైదరాబాద్–విజయవాడ  ఆరు లేన్లకు గ్రీన్​సిగ్నల్​
  •     మేలో షురూ కానున్న పనులు
  •     అంచనా వ్యయం సుమారు రూ.3 వేల కోట్లు
  •     17 చోట్ల అండర్ పాస్ బ్రిడ్జిలు, ఐదుచోట్ల ఫ్లై ఓవర్లు

నల్గొండ, వెలుగు: హైదరాబాద్–విజయవాడ నేషనల్​ హైవే(ఎన్​హెచ్​65)ను ఆరు లేన్లుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం నాలుగు లేన్లుగా ఉన్న ఈ రోడ్డు త్వరలో ఆరు లేన్లుగా మారనుంది. ఇప్పుడున్న రోడ్డుకు కుడివైపు ఒక లేన్, ఎడమవైపు మరొక లేన్ కొత్తగా నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన భూసేకరణ 2009లోనే పూర్తవడంతో రోడ్డు నిర్మాణ పనులకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చని జాతీయ రహదారి విస్తరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆరు లేన్ల నిర్మాణంలో అండర్ పాస్ బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్లు కీలకంగా మారనున్నాయి. మొదటి దశ నాలుగులేన్ల రోడ్డు చేపట్టి ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పదేళ్లు పూర్తవుతుంది. బీఓటీ పద్ధతిలో జీఎమ్మార్ సంస్థ 2009లో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం ప్రారంభించి 2012లో పూర్తి చేసింది. చౌటుప్పుల్ మండలం దండుమల్కాపురం నుంచి విజయవాడు వరకు 238 కిలోమీటర్లు కాగా, దీంట్లో తెలంగాణ పరిధిలో నేషనల్ హైవే 182 కిలోమీటర్లు మాత్రమే. దండుమల్కాపురం నుంచి సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వరకు ఆరులేన్లుగా విస్తరించేందుకు సుమారు రూ.3వేల కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

పెరిగిన ట్రాఫిక్..

ఇటీవలి కాలంలో ఈ హైవేపై ట్రాఫిక్​ విపరీతంగా పెరిగింది. 2009లో రోడ్డు నిర్మాణం ప్రారంభించినప్పుడు రోజుకు 20 వేల వెహికల్స్​మాత్రమే రాకపోకలు సాగించేవి. అయితే వచ్చే పదేళ్లలో ట్రాఫిక్ రద్దీని అంచనా వేసి అప్పుడే ఆరు లేన్లకు సరిపడా భూసేకరణ చేశారు. ఈ పదేళ్లలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడమేగాక, తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం హైదరాబాద్ టు విజయవాడ మధ్య నిత్యం 30 వేలకుపైగా వెహికల్స్​ రాకపోకలు సాగిస్తున్నాయి. వీకెండ్స్, పండగ సీజన్లలో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. వీటిల్లో 50 శాతం కార్లు కాగా, మిగతా 50 శాతం బస్సులు, బైక్​లు, ఇతర ట్రాన్స్​పోర్టు వెహికల్స్. నాలుగులేన్ల నిర్మాణంలో అనేక లోపాలు ఉండటంతో రోడ్డు ప్రమాదాలు కంట్రోల్ చేయడం పోలీసులకు సవాల్​గా మారింది.  అవసరమైన చోట అండర్ పాస్ బ్రిడ్జిలు, ఫ్లై ఓవర్లు నిర్మించకపోవడంతోనే పదేళ్లలో అనేక మంది చనిపోయారు. యాక్సిడెంట్లు జరుగుతున్న ముఖ్య ప్రాంతాల్లో సేఫ్టీ మెజర్స్​లో భాగంగా తాత్కాలిక రిపేర్లు చేపట్టారు తప్ప శాశ్వత నిర్మాణలు చేయలేదు. దీంతో ఇప్పుడు రోడ్డు విస్తరణలో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ బ్రిడ్జిలు కీలకం కానున్నాయి. 

జీఎమ్మార్​తో ముగిసిన వివాదం

బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్​ఫర్(బీఓటీ) పద్ధతిలో ఆరులేన్ల రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం వల్ల తమకు నష్టం వచ్చిందని, అనుకున్నంత స్థాయిలో టోల్ వసూలు కావడం లేదని జీఎమ్మార్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. రాష్ట్రం విడిపోయాక వెహికల్స్​రద్దీ తగ్గిందని, చేంజ్ ఆఫ్ లా కింద పరిహారం చెల్లించాలని కోర్టును ఆశ్రయించింది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా ఎంపీలు కో మటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని పలుసార్లు కలిసి హైవే సమస్యను వివరించారు. రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి నిర్మాణ సంస్థతో ఆరులేన్ల గురించి చర్చించారని, ఒప్పందం మేరకు మే మొదటి వారంలో ఆరులేన్ల నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం ఉందని ఎన్​హెచ్ఏ అధికారులు చెప్పారు. 

అండర్ పాస్ బ్రిడ్జిలు.. ఫ్లైఓవర్లు

దండుమల్కాపురం నుంచి కోదాడ వరకు 17 చోట్ల అండర్ పాస్ బ్రిడ్జిలు, సర్వీసు రోడ్లు, చౌటుప్పుల్, చిట్యాల, కట్టంగూరు, సూర్యాపేట-, జనగాం రోడ్డ వద్ద ఫ్లై ఓవర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. కొర్లపాడు, నవాబుపేట, పెద్దకాపర్తి యూ జంక్షన్, మేళ్లచెర్వు ఫ్లై ఓవర్, ముకుందాపురం యూ టర్న్, ఆకుపాముల బైపాస్, కట్టంగూరు – నల్గొండ క్రాస్ రోడ్డు, కట్టంగూరు లోకల్, నల్లబండగూడెం వద్ద రామాపురం క్రాస్ రోడ్డు, సూర్యాపేటలోని ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజీ, కోదాడలో కట్టకొమ్మగూడెం క్రాస్​రోడ్డు, శ్రీరంగాపురం, దురాజ్​పల్లి క్రాస్​రోడ్డు, కొమరబండ క్రాస్​రోడ్డు వంటి చోట్ల అండర్​పాస్ బ్రిడ్జిలు, సర్వీసు రోడ్లు నిర్మించాలని ప్రతిపాదించారు.

కేంద్ర మంత్రి గడ్కరీకి ఎంపీ ఉత్తమ్​ వినతి

ఎన్​హెచ్​–65ను వీలైనంత త్వరగా 6 లేన్ల రహదారిగా మార్చాలని ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీని ఢిల్లీలో కలిసి వినతిపత్రం ఇచ్చారు. హైదరాబాద్​– విజయవాడ మధ్య 6 లేన్ల ఎక్స్​ప్రెస్​ వే పనుల ప్రారంభానికి అవసరమైన ప్రక్రియను రెండు వారాల్లో పూర్తి చేస్తామని, వీలైనంత త్వరగా పనులను మొదలుపెడతామంటూ నితిన్​ గడ్కరీ హామీ ఇచ్చారని ఉత్తమ్​ తెలిపారు. ప్రస్తుతం నాలుగు లేన్లు ఉన్న ఈ హైవే విజయవాడ–హైదరాబాద్​ మధ్య మాత్రమే కాకుండా నల్గొండ, సూర్యాపేట, హుజూర్​నగర్​, కోదాడలకూ ఈ హైవే మంచి కనెక్టివిటీ అని చెప్పారు. 

మేలో పనులు ప్రారంభిస్తారు

నాలుగు లేన్ల హైవేను ఆరు లేన్లుగా విస్తరించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో చర్చించా. సమస్య తీవ్రత గురించి పార్లమెంట్​లో ప్రశ్నించా. స్పందించిన మంత్రి నిర్మాణ సంస్థతో చర్చించారు. మేలో ఆరు లేన్ల విస్తరణ పనులు ప్రారంభమవుతాయి. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈసారి అవసరమైన చోట అండర్​పాస్, సర్వీసు రోడ్డు, ఫ్లైఓవర్లు నిర్మించాలని కోరాం. దీంతోపాటు ఎల్బీనగర్ నుంచి దండుమల్కాపురం వరకు 25 కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు కేంద్రం రూ.600 కోట్లు కేటాయించింది. 
– కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ