జీఎస్​టీ రాకతో కుటుంబ నెలవారీ ఖర్చులు తగ్గాయ్ : కేంద్ర ప్రభుత్వం వెల్లడి

జీఎస్​టీ రాకతో కుటుంబ నెలవారీ ఖర్చులు తగ్గాయ్ : కేంద్ర ప్రభుత్వం వెల్లడి

జీఎస్​టీ రాకతో కుటుంబ నెలవారీ ఖర్చులు తగ్గాయ్

ప్రభుత్వం వెల్లడి

న్యూఢిల్లీ :
గూడ్స్​ అండ్​ సర్వీసెస్​ ట్యాక్స్​(జీఎస్​టీ) అమలు దేశంలో కన్జంప్షన్​ పెరగడానికి ఇంజిన్​గా ఉపయోగపడిందని ప్రభుత్వం వెల్లడించింది. కుటుంబాల నెలవారీ ఖర్చులు తగ్గడానికి జీఎస్​టీ వీలు కల్పించిందని పేర్కొంది. ఆరేళ్ల కిందట జీఎస్​టీని దేశంలో అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే.  జీఎస్​టీ అమలులోకి రావడానికి ముందు వివిధ వస్తువులపై ఉన్న పన్ను రేట్లను పోల్చి మరీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. పెట్టుబడులు పెరగడంతో సహా ప్రోగ్రెస్​కి కేటలిస్ట్​గా జీఎస్​టీ మారిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

జీఎస్టీ రావడానికి ముందు పన్ను చట్టాలలో సంక్లిష్టత ఉండేదని, ఆ రూల్స్​ను పాటించడం కష్టతరంగానూ ఉండేదని, పన్ను చెల్లింపుదారులకు జీఎస్​టీ అమలు ఎంతో వెసులుబాటు కల్పించిందని స్పష్టం చేసింది. ఏప్రిల్​1, 2018 నాడు  దేశంలో 1.30 కోట్ల రిజిస్టర్డ్​ టాక్స్​పేయర్లుంటే, ఏప్రిల్​1, 2023 నాటికి ఈ సంఖ్య 1.36 కోట్లకు పెరిగినట్లు ఫైనాన్స్​మినిస్టర్​ నిర్మలా సీతారామన్​ ఆఫీసు ట్వీట్​ చేసింది. ఎక్సైజ్​డ్యూటీ, సర్వీస్​ ట్యాక్స్​, వ్యాట్​ వంటి 17 లోకల్​ ట్యాక్స్​లను, 13 సెస్​లను కలిపేసి ఒకే పన్ను (జీఎస్​టీ) ని జులై 1, 2017న అమలులోకి తెచ్చారు. 

నాలుగు శ్లాబ్స్​తో ఈ జీఎస్​టీ అమలవుతోంది. 5, 12,18,28 శాతం చొప్పున ఆయా వస్తువులు, సేవలపై జీఎస్​టీని విధిస్తున్నారు. గోల్డ్​, జ్యుయెలరీపై 3 శాతం, కట్​–పాలిష్డ్  డైమండ్స్​పై 1.5 శాతం చొప్పున స్పెషల్​ రేటుతో పన్ను విధింపు అమలవుతోంది. లగ్జరీ, సిన్, డీమెరిట్​ గూడ్స్​పై అత్యధికంగా 28 శాతం జీఎస్​టీతో పాటు, సెస్​ను కూడా వసూలు చేస్తున్నారు. జీఎస్​టీకి ముందు వ్యాట్​, ఎక్సైజ్​, సీఎస్​టీ, ఇతర పన్నుల వల్ల కేస్కేడింగ్​ ఎఫెక్ట్​ పడేదని, కన్జూమర్​పై పన్ను భారం  సగటున 31 శాతంగా ఉండేదని ఈ ట్వీట్​లో ప్రభుత్వం వివరించింది.