ఊర్లల్ల జనం బతుకులెట్లున్నయి?

ఊర్లల్ల జనం బతుకులెట్లున్నయి?

గ్రామాల్లో ‘ఈజ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ లివింగ్‌‌‌‌’ సర్వేకు కేంద్ర సర్కార్ సన్నద్ధం
ప్రజల జీవన ప్రమాణాలు, సౌకర్యాలపై త్వరలో స్టడీ
17 అంశాలు.. 38 ప్రశ్నలు డీపీఓలకు బాధ్యతల అప్పగింత

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఊర్లలో ప్రజల బతుకులు ఎట్లున్నయి? ఇళ్లల్లో సౌలతులు ఎట్లున్నయి? జీవన ప్రమాణాలు ఏమైనా మెరుగైనయా? అని తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఈజ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ లివింగ్‌‌‌‌’ పేరిట రాష్ట్రంలో సర్వే జరపనుంది. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ సర్వేను రాష్ట్రంలోనూ చేపడుతోంది. ఈ బాధ్యతలను ఆయా జిల్లాల పంచాయతీ అధికారుల(డీపీఓ)కు అప్పగించింది. సర్వే చేయాల్సిన తీరుపై వారికి మరో వారం రోజుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. డీపీఓలు శిక్షణ పొందిన తర్వాత వారు డివిజనల్‌‌‌‌, మండల స్థాయిలోని డీఎల్‌‌‌‌పీఓలు, ఎంపీడీఓ/ఎంపీఓలకు సర్వేపై ట్రైనింగ్‌‌‌‌ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ పూర్తయ్యాక సర్వే ప్రారంభించనున్నట్లు పంచాయతీరాజ్‌‌‌‌ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

మొబైల్‌‌‌‌ యాప్‌‌‌‌ ద్వారా..

ఈ సర్వేను మొబైల్‌‌‌‌ యాప్‌‌‌‌ ద్వారా పంచాయతీ సిబ్బంది చేపట్టనున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి ఇంటి వివరాలను సేకరించి ఇందులో రికార్డు చేయబోతున్నారు. 17 అంశాలకు సంబంధించిన 38 ప్రశ్నలతో ప్రొఫార్మా రూపొందించారు. గ్యాస్‌‌‌‌, కరెంట్‌‌‌‌ కనెక్షన్‌‌‌‌, బ్యాంకు అకౌంట్‌‌‌‌, లైఫ్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌, యాక్సిడెంటల్‌‌‌‌ ఇన్సూరెన్స్‌‌‌‌ కలిగి ఉన్నారా? కుటుంబంలో మహిళలు స్వయం సహాయక సంఘంలో సభ్యులుగా ఉన్నారా ? ఏవైనా ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందారా? ఇంట్లో పెన్షన్‌‌‌‌ పొందుతున్న వారు ఎంతమంది? ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారా? స్కిల్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ స్కీమ్‌‌‌‌ల ద్వారా కుటుంబంలో ఎవరైనా లబ్ధిపొందారా? అనే అంశాలతోపాటు ఇంట్లోని ఫ్రిజ్‌‌‌‌, టీవీ, కూలర్‌‌‌‌, ఏసీ తదితర సౌకర్యాలు, రేషన్‌‌‌‌కార్డు, టాయిలెట్‌‌‌‌, వాహనాల వివరాలు సేకరించనున్నారు. ప్రభుత్వ హౌసింగ్‌‌‌‌ స్కీమ్‌‌‌‌ ద్వారా పొందిన లబ్ధి, ఇంటి పైకప్పు రేకులా? పెంకులా? కాంక్రీటా? అనే వివరాలతోపాటు అది రెసిడెన్షియలా? లేదా కమర్షియలా? అనే అంశాలను కూడా సేకరిస్తారు. ఈ వివరాలన్నింటిని ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నమోదు చేసిన వెంటనే ఇంటి ఫొటోను తీసి, జియో ట్యాగింగ్‌‌‌‌ చేస్తారు. ‘ఈజ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ లివింగ్‌‌‌‌’ సర్వేలో సేకరించిన వివరాలను బట్టి గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలపై ప్రభుత్వం ఓ అంచనాకు రానుంది.

see also:ఎమ్మెల్యేలు, మంత్రులకు ఇయ్యాల పరీక్షే