బీసీ రిజర్వేషన్లకు కేంద్రమే అడ్డు..రెండేళ్లపాలనలో చేసిన అభివృద్ధి సంతృప్తినిచ్చింది: మంత్రి సీతక్క

బీసీ రిజర్వేషన్లకు కేంద్రమే అడ్డు..రెండేళ్లపాలనలో చేసిన అభివృద్ధి సంతృప్తినిచ్చింది: మంత్రి సీతక్క

ములుగు, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్  అమలును అడ్డకుంటున్నది కేంద్రమేనని, గవర్నర్  వద్ద బిల్లు పెండింగ్ లోనే ఉంటోందని మంత్రి సీతక్క తెలిపారు. రెండేళ్ల పాలన రాష్ట్రంలో ప్రజా పాలనకు సూచిక అని, మహిళలకు సీఎం రేవంత్​రెడ్డి పెద్దపీట వేసి ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. గురువారం ములుగులో మంత్రి మీడియాతో మాట్లాడారు. 

పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్  ఇవ్వాలనే ఉద్దేశంతో కులగణన, అసెంబ్లీ తీర్మానం చేసి బిల్లును గవర్నర్‌కు పంపిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రం స్పందించకపోయినా బీసీలకు న్యాయం చేసేంత వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. 

ఆదివాసీ బిడ్డనైన తనకు రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని స్పష్టం చేశారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం వడ్డీలేని రుణాలు, సోలార్  యూనిట్లు, పెట్రోల్  బంకులు, పాడి కేంద్రాలు అందిస్తున్నామని తెలిపారు. 

తెలంగాణ రైజింగ్ లో గ్రామీణాభివృద్ధి, మహిళల ఉపాధి, శానిటేషన్‌, తాగునీరు, ఆరోగ్యం, ఉపాధి హామీ పథకాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు.   ఈసారి జరిగే సమ్మక్క, సారలమ్మ మహాజాతర చారిత్రాత్మకంగా నిలుస్తుందని, 200 ఏండ్లు నిలిచేలా మాస్టర్ ప్లాన్  అమలు జరుగుతోందని మంత్రి సీతక్క తెలిపారు. జాతర కోసం రూ.150 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.