రూ.10కోట్లు పెట్టి కడితే ఏడాదికే కొట్టుకపాయె

రూ.10కోట్లు పెట్టి కడితే ఏడాదికే కొట్టుకపాయె
  • పెద్దపల్లి జిల్లా మడకలో మానేరు చెక్ డ్యామ్పరిస్థితి ఇది
  • తాజా వరదలతోబయటపడ్డ క్వాలిటీ లోపం
  • 50 ఎకరాల్లో పంట నష్టం
  • ఆదుకోవాలంటున్న రైతులు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడకలో మానేరు నదిపై కట్టిన చెక్​డ్యామ్​కట్టిన ఏడాదికే  కొట్టుకు పోయింది. లోయర్​ మానేరు డ్యామ్ ​నుంచి ఇటీవల నీళ్లు విడుదల చేయడంతో ఆ ప్రవాహానికి చెక్​డ్యామ్​ కొట్టుకుపోగా.. దాని కారణంగా ఊరిలో  50 ఎకరాల్లో పంట దెబ్బతింది. ఆఫీసర్లు మాత్రం చెక్​ డ్యామ్​ 30 శాతమే కొట్టుకుపోయిందని, కాంట్రాక్టర్​తో మళ్లీ కట్టిస్తామని చెబుతున్నారు.ఇటీవల వరుసగా ప్రాజెక్టుల్లో క్వాలిటీ లోపాలు బయటపడుతున్నాయి. మిడ్​మానేరు కట్ట తెగడం, కొండపోచమ్మ సాగర్​ఆనకట్ట కుంగడం, వాక్​ఓవర్​​బ్రిడ్జి కూలడం, కాళేశ్వరం మెయిన్​ కెనాల్​ లైనింగ్​ ఊడిపోవడం, గతేడాది జంపన్నవాగు వద్ద చెక్​డ్యామ్​లు కొట్టుకుపోవడం తెలిసిందే.

ఇప్పుడు.. మానేరు నదిపై రూ.10 కోట్లతో నిర్మించిన చెక్​డ్యామ్  కూడా కొట్టుకుపోయింది.  భూగర్భ జలాలను పెంచేందుకు మానేరు నదిపై పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని మడక, రూఫ్​ నారాయణపేట, గుంపుల గ్రామశివారులో మూడు చెక్​ డ్యామ్​ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం..  2016లో ఫండ్స్​కేటాయించగా టెండర్లు పూర్తి అయి 2018లో పనులు ప్రారంభించారు. 800 మీటర్ల పొడవు ఉన్న మానేరు నదిపై ఒక చెక్​ డ్యాం నిర్మాణానికి రూ. 10 కోట్ల అంచనాతో  పనులు చేపట్టారు. మూడు చోట్ల గతేడాదే చెక్​డ్యామ్​ల పనులు పూర్తి అయ్యాయి. గడిచిన వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోయర్​ మానేరు డ్యామ్​గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సుమారు లక్ష క్యూసెక్యుల నీరు మానేరు నదిలోకి రావడంతో ఓదెల మండలం మడకలోని చెక్ డ్యామ్​ మూడురోజుల కింద కొట్టుకుపోయింది.

90 శాతమే నిర్మాణం పూర్తయిందట!

విషయం తెలిసి ఇరిగేషన్​ ఆఫీసర్లు మాటమారుస్తున్నారు. క్వాలిటీపై ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డపేరు వస్తుందోనని చెక్​డ్యామ్​ నిర్మాణం 90శాతం మాత్రమే పూర్తయిందని చెబుతున్నారు. 30 శాతం మాత్రమే కొట్టుకుపోయిందని, కొట్టుకుపోయిన చోట కాంట్రాక్టర్​తోనే తిరిగి నిర్మిస్తామంటున్నారు.  చెక్​డ్యామ్ ఎన్నడో పూర్తయిందని, నిర్మాణంలో క్వాలిటీ పాటించకపోవడం వల్లే కొట్టుకుపోయిందని స్థానిక రైతులు అంటున్నారు.

50 ఎకరాల్లో పంట నష్టం

మడక గ్రామంలోని చెక్​డ్యామ్​కొట్టుకుపోవడంతో చుట్టుపక్కల పంట పొలాల్లోకి వరద నీరుపోటెత్తిందని రైతులు చెబుతున్నారు. దీంతో 50 ఎకరాల్లో వరి పంట పనికిరాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెక్​ డ్యాం ఒక్కసారిగా తెగిపోవడంతో ఆ ధాటికి మానేరు ఒడ్డు చాలామేర కోతకు గురైంది. పొలాల్లో మట్టి, ఇసుక మేటలు వేశాయి. మానేరు తీరంలో కరెంట్​ మోటర్ల కోసం ఏర్పాటు చేసుకున్న ఐదు ట్రాన్స్​ఫార్మర్లు పడిపోయాయి. కరెంట్ మోటర్లు, పైపులు కొట్టుకుపోయాయి. తమకు పరిహారం ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు.

పరిహారం చెల్లించాలి

మడకలో చెక్​ డ్యామ్​ ఒక్కసారిగా కొట్టుకుపోవడంతో నాకున్న రెండు ఎకరాల పొలం పూర్తిగా కోతకు గురైంది.  మిగిలిన పొలం కూడా పనికి రాకుండా పోయింది. నాతోపాటు ఊర్లో మస్తు మంది రైతుల పొలాలు అక్కరకు రాకుండపోయినయ్.  కాంట్రాక్టర్ క్వాలిటీతో డ్యామ్​ కట్టకపోవడంతోనే నా పొలం ఇట్లయింది. నష్టపోయిన రైతులందరికి సర్కార్​ పరిహారం చెల్లించాలి.

– ఎల్కపల్లి సురేశ్‌​, రైతు, మడక

క్వాలిటీ లేకపోవడం వల్లే..

మడక గ్రామంలో మానేరుపై చెక్​డ్యామ్​ నిర్మాణ సమయంలో క్వాలిటీ పాటించకపోవడంతోనే కొట్టుకు పోయింది. ఒక ప్రణాళిక లేకుండా హడావుడిగా పనులు చేయడంతో ప్రజాధనం వృథా అయింది. మానేరు నదిలో  ఎన్ని నీళ్లు వస్తాయి అనే అంచనా లేకుండా కట్టడం వల్లే ఇలా జరిగింది. టీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులకు, ఆఫీసర్లకు కమీషన్లపై ఆశే తప్ప పనులపై ధ్యాస లేకపోవడం వల్లే ఇలా జరిగింది.

– గంట రాములు, ఓదెల జడ్పీటీసీ