నల్లగుట్టలో అగ్నిప్రమాద ఘటనతో ఉలిక్కిపడ్డ సిటీ

నల్లగుట్టలో అగ్నిప్రమాద ఘటనతో ఉలిక్కిపడ్డ సిటీ
  • అర్ధరాత్రి వరకు అదుపులోకి రాని మంటలు
  • చుట్టుపక్కల ఇండ్లను ఖాళీ చేయించడంతో రోడ్డుపైనే బస్తీ వాసులు

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్​లోని రాంగోపాల్ పేట పరిధి నల్లగుట్టలోని డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ షాపింగ్ మాల్​లో జరిగిన  భారీ అగ్నిప్రమాదంతో సిటీ ఉలిక్కిపడింది. ఉదయం 10.50 గంటలకు షార్ట్ సర్క్యూట్​తో సెల్లార్​లో మొదలైన మంటలు 5 అంతస్తుల బిల్డింగ్ మొత్తాన్ని చుట్టేశాయి. స్థానిక ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. దాదాపు 11 గంటల పాటు ఆరు ఫైరింజిన్లతో మంటలను ఆర్పుతున్నా అర్ధరాత్రి వరకు అదుపులోకి రాలేదు. ఒక దశలో బిల్డింగ్​లోని అద్దాలు భారీ  శబ్దాలతో పగిలిపోవడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది పరుగులు తీశారు. దట్టమైన పొగ వ్యాపించడంతో చుట్టుపక్కల జనం భయాందోళనకు గురయ్యారు.   అధికారులు స్థానికులను ఇండ్లు ఖాళీ చేయించి అక్కడి నుంచి పంపించి వేశారు. ప్రమాదం జరిగిన ఏరియాకు వెహికల్స్ రాకుండా ట్రాఫిక్ పోలీసులు డైవర్షన్ చేపట్టారు. మినిస్టర్ రోడ్ ను మూసివేసి ఇతర రూట్లలో వెహికల్స్ వెళ్లే ఏర్పాట్లు చేశారు.  నల్లగుట్టలోని స్పోర్ట్స్ మాల్ లో అగ్ని ప్రమాద ఘటనపై గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను అలర్ట్ చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆమె అక్కడి నుంచే అధికారులతో ఫోన్​లో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

నాలుగు అంతస్తుల నిర్మాణానికే పర్మిషన్!

అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ నిర్మాణానికి 2006లో సెల్లార్, గ్రౌండ్​ఫ్లోర్​తో పాటు 4 అంతస్తులకు పర్మిషన్ తీసుకున్నారు.  కానీ సెల్లార్​లో గోడౌన్​ను నడిపిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మిగతా నాలుగు ఫ్లోర్లను కమర్షియల్ అవసరాలకు వాడుతున్నారు. మూడేండ్ల కిందట 4,5వ అంతస్తు నిర్మాణాలను చేపట్టారు. 2015లో వచ్చిన బీఆర్ఎస్(బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్) లో గ్రౌండ్ ఫ్లోర్​తో పాటు అక్రమంగా నిర్మించిన 4,5 అంతస్తులను చేర్చి పర్మిషన్ పొందారు.  మూడేళ్ల కిందట నిర్మించిన రెండతస్తులను బీఆర్ఎస్ కింద రెగ్యులరైజ్ చేయడం బల్దియా అధికారుల తీరుపై అనుమానాలకు దారితీస్తోంది. 

బస్తీ వాసుల ఆవేదన

అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మమ్మల్ని ఎవరూ అప్రమత్తం చేయలేదని.. తామే ఇండ్లలో నుంచి బయటికి వచ్చినట్లు పక్కనే ఉన్న కాచిబౌలి బస్తీ వాసులు చెబుతున్నారు. బిల్డింగ్​ నుంచి ఎగిసిపడుతున్న మంటల కారణంగా తమ రేకుల షెడ్లు ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను చెప్పుకుందామని హోంమంత్రి వద్దకు వెళ్లితే పోలీసులు రానివ్వలేదని వాపోయారు.