రేషన్ సప్లైలో సంస్కరణలు

రేషన్ సప్లైలో సంస్కరణలు


    కొత్త టెక్నాలజీతో వేయింగ్‌, ఈపాస్‌ మిషన్లు
    తూకాల్లో మోసాలకు చెక్‌ పెట్టనున్న సర్కార్

హైదరాబాద్‌, వెలుగు: రేషన్ పంపిణీ తూకాల్లో జరిగే మోసాలకు చెక్ పెట్టేందుకు సివిల్ సప్లయ్స్ డిపార్ట్​మెంట్ కొత్త టెక్నాలజీని తేనుంది. ఐదేళ్లుగా వినియోగిస్తున్న వేయింగ్‌ మెషీన్లు, ఈపాస్‌ మెషీన్లన్నింటినీ మార్చేందుకు సన్నద్ధమవుతోంది. వాటి స్థానంలో తూకం వేసే కొత్త మెషీన్లు, ఈపాస్‌ మెషీన్లను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ నెలలోనే అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

తూకాల్లో మోసాలకు చెక్‌..

రాష్ట్రంలో 17,088 రేషన్‌ షాపుల్లో తూకం వేసే మెషీన్లను కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. ఈ పాస్‌ మేషీన్లను 4జీ టెక్నాలజీతో అందుబాటులోకి తెస్తున్నారు. ఈ రెండు మెషీన్లను వైర్‌ లెస్‌ గా, బ్లూటూత్‌ ద్వారా కనెక్ట్‌ చేస్తున్నారు. వెయిట్ మెషీన్‌ కు ఈపాస్‌ మెషీన్​కు లింక్‌ చేసి కరెక్ట్‌ తూకం ఉంటే ఈ పాస్‌ మెషీన్ నుంచి పంపిణీకీ గ్రీన్‌ సిగ్నల్‌ వస్తుంది. 30 గ్రాములకు మించి తక్కువ ఉంటే మెషీన్ ట్రాన్సాక్షన్‌ నిలిపేస్తుంది. దీంతో తూకంలో అక్రమాలకు చెక్ పెట్టొచ్చని సివిల్‌ సప్లయ్స్‌ అధికారులు భావిస్తున్నారు.

ఈ నెల నుంచి పాత పద్ధతే

కరోనా నేపథ్యంలో ఫిజికల్‌ డిస్టెన్స్‌ అమలు చేసేందుకు ఏడాదిగా మొబైల్‌ ఫోన్లకు ఓటీపీ విధానం అమలు చేశారు. ఓటీపీ విధానం మిస్‌ యూజ్​ అవుతోందని ఫిర్యాదులు రావడంతో మళ్లీ బయోమెట్రిక్‌, ఐరిస్‌ విధానం ఈ నెల నుంచి అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. బయోమెట్రిక్ ద్వారా రేషన్ ఇచ్చే సందర్భంలో వైరస్​ వ్యాప్తిస్తుందని, ఆ విధానాన్ని నిలిపేయాలని గతంలో హైకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం ఓటీపీ విధానం అమలు చేసింది. దీంతో 2021 ఫిబ్రవరి 1 నుంచి వేలిముద్ర ద్వారా సరుకులు తీసుకునే విధానం ఆపేసి మొబైల్‌ ఫోన్‌కు పంపే ఓటీపీ ద్వారా రేషన్‌ పంపిణీ చేపట్టింది. అయితే మొబైల్ ఫోన్లు లేని వృద్ధులు, ఒంటరి మహిళలు, సెల్‌ఫోన్‌లకు ఆధార్ లింక్ లేనివారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గడం, ఓటీపీ విధానంతో అక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో తిరిగి పాత పద్ధతిలోనే రేషన్‌ పంపిణీ చేసేలా నిర్ణయం తీసుకుంది.

ఓటీపీతో పక్కదారి పడుతున్నయనే..

ఓటీపీ విధానంలో ఎక్కడ ఉన్నా సరే ఓటీపీ చెప్తే ఎవరో ఒకరు రేషన్‌ తీసుకునే పరిస్థితి ఉండేది. దీన్ని కొంత మంది దీన్ని ఆసరాగా చేసుకొని రేషన్​ను పక్కదారి పట్టించారు. దూరప్రాంతాల్లో ఉంటున్న కార్డుదారులు లేకుండానే వారి ఓటీపీని అడిగి తెలుసుకొని ఇతరులు రేషన్‌ తీసుకుంటున్నారు. ఇలా అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనికి తోడు కరోనా వ్యాప్తి తగ్గినందున పాత పద్ధతిలోనే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. వేలిముద్రలు పడకపోవడం, ఐరిస్ రాకపోవడం వంటి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఓటీపీని అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.