రీ డిజైన్‌‌.. రివర్స్‌‌ : నార్లాపూర్‌‌ కట్టపై ఎటూ తేల్చని సీఎం

రీ డిజైన్‌‌.. రివర్స్‌‌ : నార్లాపూర్‌‌ కట్టపై ఎటూ తేల్చని సీఎం

డిండి వాటర్‌‌ సోర్స్‌‌పైనా అదే తీరు
సమీక్షలతోనే కాలం గడుపుతున్న సర్కారు
వచ్చే వానాకాలానికి నీళ్లు ఇవ్వడం కష్టమే

హైదరాబాద్‌‌, వెలుగుకాళేశ్వరం తరహాలో పాలమూరును పరుగులు పెట్టిస్తామన్న సీఎం కేసీఆర్‌‌ హామీ పట్టాలెక్కే పరిస్థితి కనిపిస్త లేదు. పాలమూరు – రంగారెడ్డి, డిండి లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ స్కీమ్‌‌ల పనులు ముందుకు సాగడంలేదు. వచ్చే వానాకాలం కరివెన రిజర్వాయర్‌‌ వరకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసి 3.29 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని పాలమూరు టూర్‌‌లో సీఎం చెప్పారు. అందుకు అనుగుణంగా పనులు చేయాలని ఇరిగేషన్ అధికారులు, వర్క్‌‌ ఏజెన్సీలకు ఆదేశాలిచ్చారు. డిండి ప్రాజెక్టును వచ్చే ఏడాది ముగిసేనాటికి పూర్తిచేసి యాసంగికి నీళ్లు ఇస్తామని సీఎం గతంలో ప్రకటనలు చేశారు. ఈ ప్రాజెక్టులపై అప్పుడప్పుడూ సమీక్షలే తప్ప పనుల్లో మాత్రం వేగం లేదు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రధాన ఎల్లూరు పంప్‌‌హౌస్‌‌ను మొదట అండర్‌‌గ్రౌండ్‌‌ పంప్‌‌హౌస్‌‌ను నిర్వహించేందుకు టన్నెల్‌‌, సర్జ్‌‌పూల్‌‌ పనులు చేపట్టగా సీఎం పర్యటన తర్వాత దానిని ఓపెన్‌‌ పంపుహౌస్‌‌కు మార్చాలని ఆదేశించడంతో అప్పటికే 50 శాతం పనులు పూర్తి చేసినా పక్కన పెట్టారు. ఈ సర్జ్‌‌పూల్‌‌కు శ్రీశైలం బ్యాక్‌‌ వాటర్‌‌ను చేరవేసే 2.20 కి.మీ.ల గ్రావిటీ కాలువ, 0.87 కి.మీ.ల టన్నెల్‌‌ పనుల్లో సగానికిపైగా పూర్తయినట్టు సమాచారం.

ఓపెన్‌‌ పంప్‌‌హౌస్‌‌కు 170 ఎకరాల రిజర్వ్‌‌ ఫారెస్ట్‌‌ స్థలం అవసరముంది. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతిస్తేనే భూమి బదలాయింపు సాధ్యమవుతుంది. పంప్‌‌హౌస్‌‌ ప్రతిపాదిత స్థలంలో సాయిల్‌‌ టెస్ట్‌‌లు చేస్తున్నారు. రిజల్ట్‌‌ అనుకూలంగా వచ్చి పనులు పూర్తయితే తప్ప పాలమూరు ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతలు సాధ్యం కాదు. ప్రాజెక్టు మొదటి రిజర్వాయర్‌‌ నార్లాపూర్‌‌ నిర్మాణానికి 2.26 కోట్ల క్యూబిక్‌‌ మీటర్ల మట్టి అవసరముండగా రిజర్వాయర్‌‌ నిర్మాణ ప్రాంతంలో కేవలం 60 లక్షల క్యూబిక్‌‌ మీటర్ల మట్టి మాత్రమే అందుబాటులో ఉంది. 75 మీటర్ల ఎత్తు, 6.647 కి.మీ.ల పొడవైన కట్టను నిర్మించాల్సి ఉండగా, కట్ట ఎత్తు తగ్గించి ఉన్న మట్టినే సర్దుబాటు చేసి రిజర్వాయర్‌‌ నిర్మించాలని సీఎం మౌఖికంగా ఆదేశించినట్టు తెలిసింది. రిజర్వాయర్‌‌ నిర్మాణ సంస్థలంలో ఉన్న ప్రతిబంధకాలను సీఎంకు వివరించి ఇతర ప్రత్యామ్నాయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో నార్లాపూర్‌‌ రిజర్వాయర్‌‌ భవితవ్యం ఏమిటన్నది తేలడం లేదు.

డిండి వాటర్‌‌ సోర్స్‌‌ ఏదులకు మార్పు!

రామరాజు విద్యాసాగర్‌‌రావు డిండి లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ స్కీమ్‌‌కు వాటర్‌‌ సోర్స్‌‌పైనే చర్చోపచర్చలు సాగుతున్నాయి. సీఎం ఒక్కో రివ్యూలో ఒక్కో తరహా ప్రతిపాదనలు చేస్తుండటంతో ఏం చేయాలో తెలియక ప్రాజెక్టు ఇంజినీర్లు తలలు పట్టుకుంటున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 60 రోజుల్లో ఎత్తిపోసే 120 టీఎంసీల్లో 30 టీఎంసీల నీటిని నార్లాపూర్‌‌ పంపుహౌస్‌‌ ద్వారా డిండికి తరలించాలని మొదట ప్రతిపాదించారు. 50 కి.మీ.ల దూరం కాలువ ద్వారా నీటిని తరలించాల్సి ఉండటం, కాలువ 5వ కి.మీ.ల నుంచి 20వ కి.మీ. వరకు కాలువ, రంగాయపల్లి పంపుహౌస్‌‌ రిజర్వ్‌‌ ఫారెస్ట్‌‌లో ఉండటంతో ఇక్కడి నుంచి నీటి తరలింపు వద్దనే నిర్ణయానికి వచ్చారు.డిండి ప్రాజెక్టును మొదట ప్రతిపాదించినప్పుడు ఏదుల రిజర్వాయర్‌‌ నుంచి నీటిని తరలించాలని నిర్ణయించారు. పాలమూరు వాటర్‌‌ సోర్స్‌‌ను జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్‌‌ వాటర్‌‌కు మార్చిన క్రమంలో డిండి సోర్స్‌‌ను కూడా మార్చారు. భూసేకరణ సమస్యలు ఎక్కువగా ఉండటంతో సీఎం ప్రతిపాదనలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నీటి సోర్స్‌‌ను మళ్లీ ఏదులకు మార్చాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఏదుల నుంచి 800 మీటర్ల అప్రోచ్‌‌ చానల్‌‌, 2.5 కి.మీ.ల గ్రావిటీ కాలువ, 16 కి.మీ.ల టన్నెల్‌‌ ద్వారా డిండి ప్రాజెక్టు ప్రధాన రిజర్వాయర్‌‌ ఉల్పరకు నీటిని తరలించడానికి రూ.1,200 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. సీఎం ఈ అలైన్‌‌మెంట్‌‌ను ఫైనల్‌‌ చేస్తేనే ఈ పనులు ముందుకు సాగే అవకాశముందని అధికారులు చెప్తున్నారు.

రెండు ప్రాజెక్టుల్లో రీ డిజైన్లు మళ్లీ మళ్లీ చేసినవి

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును జూరాల బ్యాక్‌‌ వాటర్‌‌ నుంచి 45 రోజుల పాటు రోజుకు 1.5 టీఎంసీలు ఎత్తిపోసేలా ఉమ్మడి ఏపీలో అడ్మినిస్ట్రేటివ్‌‌ సాంక్షన్‌‌
తెలంగాణ ఆవిర్భావం తర్వాత వాటర్‌‌ సోర్స్‌‌ను జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్‌‌ వాటర్‌‌కు మార్పు
జూరాల వద్ద 45 రోజులు వరద నీటిని తీసుకునేలా ప్రాజెక్టును డిజైన్‌‌ చేయగా, శ్రీశైలంకు మార్చిన తర్వాత 60 రోజుల పాటు ఫ్లడ్‌‌ వాటర్‌‌ తీసుకునేలా ప్రపోజల్స్‌‌
పాలమూరు ప్రధాన పంపుహౌస్‌‌ ఎల్లూరు (డేగలబండ) మొదట అండర్‌‌గ్రౌండ్‌‌ పంపుహౌస్‌‌గా అడ్మినిస్ట్రేటివ్‌‌ సాంక్షన్‌‌.. సుమారు 50 శాతం పనులు పూర్తి
ఎల్లూరు పంపుహౌస్‌‌ను ఓపెన్‌‌ పంపుహౌస్‌‌గా మార్పు.. ప్రతిపాదిత స్థలంలో సర్వే పూర్తి చేసిన అధికారులు
నార్లాపూర్‌‌ రిజర్వాయర్‌‌ను మట్టికట్ట ద్వారా నిర్మాణానికి అనుమతులు
నార్లాపూర్‌‌లో మట్టి కొరత నేపథ్యంలో రాక్‌‌ఫిల్‌‌ డ్యాం కోసం సర్వే, తెహ్రీ హైడ్రో పవర్‌‌ కార్పొరేషన్‌‌ ఈడీ రాజీవ్‌‌ వైష్ణో ఆధ్వర్యంలో రూ.1,182 కోట్లతో ప్రాథమిక ప్రతిపాదనలు సిద్ధం
మట్టికట్ట నిర్మాణానికి సీఎం ససేమిరా.. ఇప్పటికీ రాని స్పష్టత
రెండు టీఎంసీల నీటి తరలింపునకు బదులుగా మొదట ఒక్క టీఎంసీకే పంపు హౌస్‌‌లు, టన్నెళ్లు సిద్ధం చేస్తున్న ఇంజనీర్లు
పాలమూరు-–-రంగారెడ్డి స్కీమ్‌‌లో ప్రతిపాదించిన ఎల్లూరు నుంచి డిండికి నీటిని తీసుకోవాలని మొదట నిర్ణయం
ఎల్లూరుకు బదులుగా వాటర్ సోర్స్‌‌ను నార్లాపూర్‌‌కు మార్చిన ప్రభుత్వం
నార్లాపూర్‌‌ నుంచి నీటి తరలింపులో ఉన్న ఇబ్బందులతో మళ్లీ ఏదులకు సోర్స్‌‌ మారుస్తూ ప్రతిపాదనలు తయారు చేస్తున్న అధికారులు