
సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు పాశమైలారంలోని సిగాచి కంపెనీ ప్రమాదంపై ఎట్టకేలకు కంపెనీ యాజమాన్యం స్పందించింది. రియాక్టర్ పేలుడు వలన ప్రమాదం జరగలేదని.. కారణాలు దర్యాప్తులో తేలుతాయని పేర్కొన్నారు. ఘటనలో 40 మంది చనిపోయారని.. 33 మంది గాయపడ్డారని కంపెనీ యాజమాన్యం తెలిపింది. ప్రమాదం ఘటనకు సంబంధించి దర్యాప్తుకు సహకరిస్తామని.. నిబంధనలు పాటిస్తాం ప్రకటన విడుదల చేసింది.
ప్రమాదంలో గాయపడిన వారికి సాయం చేయటంతో పాటు వారి కుటుంబాలకు పునరావాసం కల్పిస్తామని సిగాచి కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ పేర్కొన్నారు. అన్ని రకాల బీమా క్లైమ్ లను చెల్లిస్తామని తెలిపారు. కంపెనీ తరఫున మృతులకు కోటి రూపాయల పరిహారం చెల్లిస్తామని చెప్పారు.
35 ఏళ్లలో ఎలాంటి ప్రమాదం జరగలేదని.. ఇది ఘోర ప్రమాదని పేర్కొన్నారు. 3 నెలల పాటు కంపెనీని తాత్కాలికంగా మూసివేస్తున్నా ప్రకటించారు. కంపెనీని పదేళ్ల క్రితం ఎలాంగో గౌడకు లీజుకు ఇచ్చామని.. కంపెనీ బాధ్యతలు ఆయనే చూస్తు్న్నారని తెలిపారు. పేలుడు ఘటనలో ఎలాంగో గౌడ చనిపోవటంతో వివరాలు తెలియడం లేదని తెలిపారు. ప్రమాదంపై స్టాక్ ఎక్ఛేంజ్ కు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఇక సిగాచి కంపెనీపై 4 సెక్షన్ల కింద కేసు నమోదైంది. కంపెనీ ఉద్యోగి యశ్వంత్ ఇచ్చిన కంప్లైంట్ తో కేసు నమోదయ్యింది. కంపెనీలో వాడుతున్న పాత మిషనరీ కారణంగా పేలుడు సంభవించినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు పోలీసులు.