- ధర్నా చౌక్ లో బీసీ కుల సంఘాల ఆందోళన
ముషీరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణన జరిపి, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఆత్మగౌరవం, అధికారం కోసం బీసీలు మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో మహాధర్నా చేపట్టింది. బీసీ జన సభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ అధ్యక్షత వహించగా, బీఆర్‌ఎస్‌నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, ఎంపీ ఆర్. కృష్ణయ్య, మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, సర్దార్ పుట్టం పురుషోత్తం, ఆకుల శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు.
జనాభా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్అగ్రనేత రాహుల్‌గాంధీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేస్తే పాలకులు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కులగణన చేపట్టకుండా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. చట్టపరమైన అంశాలను సాకుగా చూపెట్టి, బీసీలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. కాంగ్రెస్కామారెడ్డి డిక్లరేషన్ప్రకారం కులగణన చేపట్టాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో నాయకులు సాయిని నరేందర్, ముఠా జైసింహ, ఎల్చల దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.