
పే స్కేల్, జాబ్ చార్ట్ అమలు చేస్తామన్న సీఎం
ఐదేండ్లు గడుస్తున్నా హామీల అమలు ఊసే లేదు
15 ఏండ్లుగా జీతం రూ.10,500 మాత్రమే..
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళన కార్యక్రమాలు
మంచిర్యాల, వెలుగు: గ్రామస్థాయిలో ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల పరిస్థితి దయనీయంగా మారింది. సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన పలు హామీలు ఐదేండ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. రోజుకు పది పన్నెండు గంటలు గొడ్డు చాకిరీ చేస్తూ.. చాలీచాలని జీతాలతో అవస్థలు పడుతున్నారు. వీఆర్ఏలకు 2007 నుంచి రూ.10,500 జీతం చెల్లిస్తున్నారు. 15 ఏండ్లలో పైసా కూడా పెరగలేదు. ఇతర డిపార్ట్మెంట్లలోని ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం వేతనాలు పెంచినప్పటికీ వీఆర్ఏలకు అమలు కాలేదు. 2017 ఫిబ్రవరిలో వీఆర్ఏలను సీఎం కేసీఆర్హైదరాబాద్లోని ప్రగతిభవన్‌కు పిలిపించుకున్నారు. పే స్కేల్, జాబ్ చార్ట్ అమలు చేస్తామని, విద్యార్హతలను బట్టి ప్రమోషన్లు కల్పిస్తామని, 55 ఏండ్లు నిండినవారి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని, వీఆర్ఏలను ఇతర డిపార్ట్మెంట్లలో సర్దుబాటు చేస్తామని, అందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇస్తామని ప్రకటించారు. 2020 సెప్టెంబర్, ఈ ఏడాది కూడా అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. కానీ ఐదేండ్లు గడుస్తున్నా అతీగతీ లేకపోవడం, ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం జీతాలు పెంచినా వీఆర్ఏలకు వర్తించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనబాట పట్టారు. అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర మూడు రోజుల ధర్నా చేపట్టారు.
అన్ని పనులూ వీఆర్ఏలతోనే..
వీఆర్ఏలకు జాబ్ చార్ట్ లేకపోవడంతో డ్యూటీ విషయంలో గందరగోళం నెలకొంది. గతంలో ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం, ప్రభుత్వ పథకాలపై దండోరా వేయించడం, అధికారులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు వాళ్ల వెంట ఉండి అవసరమైన సహాయం అందించడం చేసేవాళ్లు. కానీ క్రమంగా వీఆర్ఏలపై పనిభారం పెరిగింది. వీఆర్వో వ్యవస్థ రద్దయిన తర్వాత వాళ్లు చేయాల్సిన పనులన్నీ వీఆర్ఏలతోనే చేయిస్తున్నారు. ఓటరు నమోదు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, ధరణి రికార్డుల నమోదుతో పాటు ప్రభుత్వ ఆఫీసుల్లో స్వీపర్లు, అటెండర్లు, వాచ్మన్లు, డ్రైవర్లుగా వాడుకుంటున్నారు. రెవెన్యూతో పాటు ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన పనులు సైతం వాళ్లకే అప్పగిస్తున్నారు. పేరుకు పార్ట్‌టైమ్ ఉద్యోగులు అయినా రోజుకు పది నుంచి పన్నెండు గంటలు డ్యూటీ చేస్తున్నారు. ఇంత చేస్తున్నా అధికారులు తమను చులకనభావంతో చూస్తున్నారని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్హతలున్నా ప్రమోషన్లు లేవు
రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది వీఆర్ఏలు ఉన్నారు. వీళ్లలో మెజారిటీ వారసత్వంగా కొనసాగుతున్నారు. మిగతా వాళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012, 2014లో ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్ష ద్వారా సెలక్ట్అయ్యారు. డిగ్రీలు, పీజీలు చదివినవాళ్లు భవిష్యత్‌లో ప్రమోషన్లు వస్తాయనే ఆశతో ఎంతో కష్టపడి పోటీ పరీక్షల్లో నెగ్గారు. ఏపీపీఎస్సీ ద్వారా నియామకం అయినప్పటికీ ప్రమోషన్లు లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. వీరితోపాటు సెలక్టయిన వాళ్లకు ఏపీ సర్కారు పే స్కేల్ అమలు చేయడంతో ఇతర ఉద్యోగులతో సమానంగా వేతనాలు పొందుతున్నారు. విద్యార్హతలను బట్టి ప్రమోషన్లు కల్పించడంతో వీఆర్ఏ నుంచి ఆర్ఐ స్థాయికి చేరుకున్నారు. మరోవైపు ప్రభుత్వం తమతో వెట్టిచాకిరీ చేయించుకుంటోందని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రకటించిన పే స్కేల్‌అమలు చేసినట్లయితే ఇతర ఉద్యోగులతో సమానంగా జీతాలు పెరగడంతో పాటు అలవెన్సులు అందుతాయని అంటున్నారు. ప్రస్తుత మార్కెట్ ధరలతో పోల్చితే తమకు వచ్చే జీతం తక్కువ కావడంతో కుటుంబాలను పోషించుకోవడం ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు.
అమలయ్యేదాకా పోరాటం
వీఆర్ఏలలో చాలామంది ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు చెందినవాళ్లే. గ్రామాల్లో అన్ని పనులు మేమే చేస్తున్నం. పొద్దున నిద్ర లేచింది మొదలు అర్ధరాత్రి వరకు సేవలందిస్తున్నం. 15 ఏండ్లుగా చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నం. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలనే అమలు చేయాలని అడుగుతున్నం. ఈ నెల 25 నుంచి మండల కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేపడతాం. మా డిమాండ్లు నెరవేర్చేంతవరకు పోరాడుతాం.
– దశరథం, వీఆర్ఏల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మంచిర్యాల
హామీలే.. అమలు చేస్తలేరు
2012లో ఏపీపీఎస్సీ ద్వారా వీఆర్ఏగా సెలక్టయిన. పీజీ చదివినప్పటికీ భవిష్యత్‌లో ప్రమోషన్ వస్తుందనే ఆశతో ఈ జాబ్‌లో చేరిన. ఇప్పటికి పదేండ్లు అవుతున్నా ప్రమోషన్లు ఇయ్యలే. ఏపీలో జాబ్ చార్ట్, పే స్కేల్ అమలు చేసిన్రు. ప్రమోషన్లు ఇచ్చిన్రు. మాతోపాటు వీఆర్ఏలుగా చేరినవాళ్లు ఇప్పుడు ఆర్ఐ స్థాయిలో ఉన్నరు. తెలంగాణ ప్రభుత్వం హామీలు ఇచ్చుడే తప్ప అమలు చేస్తలేదు. వేళాపాళా లేకుండా పది పన్నెండు గంటలు చాకిరీ చేస్తూ దయనీయ పరిస్థితుల్లో బతుకుతున్నం.
– శ్రీనివాస్, వీఆర్ఏ, జన్నారం మండలం