కాంగ్రెస్​కు జంపింగ్​ల భయం.. రూ.5 లక్షలు ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేస్తేనే టికెట్​

కాంగ్రెస్​కు జంపింగ్​ల భయం.. రూ.5 లక్షలు ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేస్తేనే టికెట్​
  • పార్టీ ఫిరాయించబోమని అఫిడవిట్లు
  • గెలిచాక టీఆర్​ఎస్​ గుంజుకుంటుందని ముందు జాగ్రత్త
  • ఆశావహుల నుంచి అప్లికేషన్లతో పాటు బ్లాంక్​ చెక్కులు
  • కొన్ని జిల్లాల్లో రూ.5లక్షల వరకు ఫిక్సుడ్​​ డిపాజిట్లు
  • సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 300 మంది నుంచి ప్రామిసరీ నోట్లు
  • అసెంబ్లీ, పంచాయతీ ఎలక్షన్ల నాటి ఫిరాయింపుల ఎఫెక్ట్​

(వెలుగు, నెట్​వర్క్)

కాంగ్రెస్​ పార్టీకి జంపింగ్​ల భయం పట్టుకుంది. గతంలో జరిగిన మున్సిపల్​ ఎలక్షన్లలో, ఏడాది కిందటి అసెంబ్లీ ఎలక్షన్లు, తర్వాత జరిగిన పరిషత్​ ఎలక్షన్లలో తమ పార్టీ తరఫున గెలిచిన చాలామంది అధికార పార్టీలోకి దూకడంతో ఈసారి అలర్టయింది. తాజా మున్సిపల్​ ఎలక్షన్లలో టికెట్ల కోసం వస్తున్న ఆశావహుల నుంచి అప్లికేషన్లతోపాటు అఫిడవిట్లు, ప్రామిసరీ నోట్లు, బ్లాంక్​ చెక్కులు ఏది వీలైతే అది తీసుకోవాలని నిర్ణయించింది. సంగారెడ్డి జిల్లాలో టికెట్ల కోసం ఇప్పటివరకు కాంగ్రెస్​ ఆఫీసుకు సుమారు మూడు వేల అప్లికేషన్లురాగా.. అందులో 300 మంది అఫిడవిట్లు ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొన్నిచోట్ల రూ.5 లక్షలు ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేస్తేనే టికెట్​ ఇస్తామని అక్కడి కాంగ్రెస్​ లీడర్లు చెప్తుండటం హాట్​టాపిక్​గా మారింది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత 12 మంది ఔట్..

2018 డిసెంబర్​లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్​ 19 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. తర్వాత జరిగిన పరిణామాల్లో ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి టీఆర్​ఎస్​లో చేరిపోయారు. కాంగ్రెస్​ ప్రతిపక్ష హోదా కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత ఎంపీగా గెలిచిన ఉత్తమ్ ఎమ్మెల్యే పదవికి ​రాజీనామా చేయడంతో ఖాళీ అయిన హుజూర్​నగర్​సీటును టీఆర్ఎస్​ గెలుచుకోవడంతో ప్రస్తుతం అసెంబ్లీలో ఆరుగురే (జగ్గారెడ్డి– సంగారెడ్డి-, -కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి–-మునుగోడు,- మల్లు భట్టివిక్రమార్క–-మధిర-, సీతక్క–ములుగు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు–మంథని, పొదెం వీరయ్య–భద్రాచలం) కాంగ్రెస్​ సభ్యులుగా కొనసాగుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్​ చరిత్రలో ఆ పార్టీకి ఇదే అత్యంత ఘోరమైన పరిస్థితి. ఇక లోక్​సభ ఎలక్షన్లలో పోటీ చేసిన పొన్నం ప్రభాకర్​ వంటి సీనియర్​ లీడర్ సైతం గెలిస్తే పార్టీ మారబోనని ప్రామిస్​ చేస్తూ, అఫిడవిట్  సమర్పించడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

ఐదేండ్లుగా ఇదే పరిస్థితి

ఐదేండ్ల కింద 2014లో జరిగిన మున్సిపల్​ ఎలక్షన్ల నుంచి టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్​ను ముమ్మరం చేస్తూ వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్  చేతి గుర్తుపై గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లను తనవైపు తిప్పుకోవడం ద్వారా మ్యాజిక్​ ఫిగర్​ సాధించి.. వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను తన ఖాతాలో వేసుకుంది. ఉదాహరణకు అప్పటి మహబూబ్​నగర్ ​జిల్లాలో 9 మున్సిపాలిటీలు ఉండగా.. టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ కూటమి తలా ఒక్క చోటే మెజారిటీ సాధించాయి. కాంగ్రెస్​ 6 చోట్ల మెజారిటీ​ సాధించింది. కానీ ఆ పార్టీలోని కీలకమైన వ్యక్తులకు చైర్మన్​ పదవులు ఆశచూపిన టీఆర్ఎస్.. ఏకంగా 5 మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరవేసింది. మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, గద్వాల, కల్వకుర్తి, షాద్​నగర్ మున్సిపాలిటీలు ఈ రకంగానే అధికార పార్టీ ఖాతాలో పడ్డాయి. ఖమ్మం జిల్లాలోనూ కాంగ్రెస్ గెలుచుకున్న ఇల్లెందు మున్సిపాలిటీని తర్వాత టీఆర్ఎస్ చేజిక్కించుకుంది. మధిర, కొత్తగూడెంలో మెజారిటీ వార్డులను కాంగ్రెస్​ గెలుచుకున్నా టీఆర్ఎస్​ పాగా వేసింది. నల్గొండ జిల్లాలోని నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి. గతేడాది జరిగిన మండల పరిషత్​ ఎలక్షన్లలో కాంగ్రెస్​ నుంచి గెలిచి, అధికార పార్టీలో చేరిన ఎంపీటీసీ సభ్యులు వందల్లో ఉంటారు.

అఫిడవిట్లతో రండి

కాంగ్రెస్  లీడర్లు గతేడాది జరిగిన జిల్లా, మండల పరిషత్​ ఎన్నికలప్పుడు కొన్నిజిల్లాల్లో ఆశావహుల నుంచి అఫిడవిట్లు తీసుకున్నారు. నామినేషన్ల గడువు ముగిసే సమయంలో ఇలాంటి ఆదేశాలు ఇవ్వడంతో పెద్దగా రెస్పాన్స్  రాలేదు. కానీ అప్పటి ఎన్నికల్లో గెలిచిన కొందరు పదవులు, పైసల ఆశతో టీఆర్ఎస్​లో చేరారు. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే ముందే అఫిడవిట్లు తీసుకోవాలని నిర్ణయించారు. పలు జిల్లాల్లో దీనికి స్పందన బాగానే వస్తోందని లీడర్లు చెప్తున్నారు. ఉదాహరణకు సంగారెడ్డి జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో162 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్​ తరఫున పోటీకి 3 వేల అప్లికేషన్లు వచ్చాయి. కానీ టికెట్​ఆశించేవారంతా అప్లికేషన్లతో పాటు అఫిడవిట్లు, ప్రామిసరీ నోట్లు, బ్లాంక్​ చెక్కుల్లో ఏదైనా ఇవ్వాలని తేల్చిచెప్పడంతో ఒక్కొక్కరే సమర్పిస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో ఆశావహుల నుంచి అఫిడవిట్లు తీసుకున్నాకే టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్​ స్పష్టం చేయడం విశేషం.

5 లక్షలు డిపాజిట్​ చేయాలె..

కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్​ లీడర్లు మరో అడుగు ముందుకేసి.. మీడియేటర్ల దగ్గర డిపాజిట్లు చేయించుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి దగ్గరకు కొందరు వెళ్లి టికెట్లు అడిగారు. రూ.5 లక్షలు ముందస్తు డిపాజిట్​ చేస్తేనే టికెట్ చేతిలో పెడతామని, చైర్మన్​ ఎన్నిక పూర్తయ్యాక వెనక్కిస్తామని ఆయన చెప్పడంతో తెల్లమొహాలేశారు.

అఫిడవిట్లు తీసుకుంటం..

గత అనుభవాల దృష్ట్యా మున్సిపల్​ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పార్టీ  బీఫామ్ ఇచ్చే సమయంలో అభ్యర్థుల నుంచి అఫిడవిట్లు తీసుకోవాలని భావిస్తున్నాం.  ఫిక్స్​డ్​ డిపాజిట్లకు సంబంధించి మా జిల్లాలోనైతే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. – పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు