మేం ఇద్దరం తోటి కోడళ్లం..తిట్టుకుంటం..కలిసుంటం : రేవంత్​

మేం ఇద్దరం తోటి కోడళ్లం..తిట్టుకుంటం..కలిసుంటం : రేవంత్​

హైదరాబాద్, వెలుగు: ధరణి, రైతు సమస్యలపై ప్రజల్లోకి వెళ్లాలని,  ఇందులో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.  ఈ అంశంపై శుక్రవారం సీఎల్పీలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన పార్టీ నేతలు జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, మల్లు రవి, చెరుకు సుధాకర్, ఈరవత్రి అనిల్, వేణుగోపాల్, ప్రీతంలు సమావేశమయ్యారు. సుమారు గంటన్నర పాటు చర్చించారు. కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు టీమ్ ప్రతినిధులు కూడా ఈ మీటింగ్​లో పాల్గొని డేటా అందించారు. మీటింగ్ తరువాత ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ధరణి వల్ల  రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.  రాష్ట్రంలో 20 లక్షల 30 వేల మంది ధరణి, భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని  తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని ఉంచాలా.. సరికొత్త విధానం తీసుకు రావాలా అనే అంశంపై చర్చించామన్నారు. ధరణిపై మండలానికి ఐదుగురి చొప్పున రాష్ట్రమంతటా డేటా సేకరిస్తామన్నారు. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి పార్టీ లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. 

సింహయాజిని కలవలేదు: రాజనర్సింహ

తాను  సింహయాజి ని కలవలేదని, ఆయన ఎలా ఉంటారో తనకు తెలియదని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తెలిపారు. ఎవరో కావాలని తనపై తప్పుడు ప్రచారం చేశారన్నారు. గతంలో చాలా సార్లు ఇలా తనపై కుట్రలు చేశారని దామోదర స్పష్టం చేశారు. 

బలహీన వర్గాలపై ఫోకస్.. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప్రయోజనాలను సమాజంలో, పార్టీలో కాపాడటమే లక్ష్యంగా ముందుకెళ్లాలని ఆయా వర్గాల నేతలు నిర్ణయించారు. ఈ వర్గాల ప్రజలను పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని ఓ హోటల్ లో కాంగ్రెస్ పార్టీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీ వర్గాల నేతలు అద్దంకి దయాకర్, రాములు నాయక్, జనక్ ప్రసాద్, చందా లింగయ్య దొర, రియాజ్ అహ్మద్, భరత్ చౌహాన్ లతో పాటు మొత్తం 17 మంది నేతలు  సమావేశమై  19  తీర్మానాలు చేశారు.

మేం ఇద్దరం తోటి కోడళ్లం.. తిట్టుకుంటం.. కలిసుంటం : రేవంత్​

సమావేశానికి హాజరైన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర సంభాషణ జరిగింది. జగ్గారెడ్డిని రేవంత్ పలకరించగా.. ‘రేవంత్ ను విమర్శిస్తవ్. మళ్లీ ఇద్దరు కలుసుకుంటరు. పలకరించుకుంటరు.’ అని మీడియా వాళ్లు అంటున్నరని జగ్గారెడ్డి అన్నారు. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ‘మేం ఇద్దరం తోటికోడళ్లం.. తిట్టుకుంటం.. కలిసుంటం’ అని అన్నారు. పీసీసీపై జగ్గారెడ్డిని ప్రశ్నించగా.. ఆయన్ని దింపి ఆ పదవిలోకి వెళ్లాలని నాకు లేదని తెలిపారు. కాంగ్రెస్ లో ఒకరిని గుంజి మరొకరు ఆ పదవిలోకి వెళ్లటం అసాధ్యం, అవన్నీ ఉత్తమాటలు అని జగ్గారెడ్డి అన్నారు.