ఐటీడీఏ పరిధిలో రూ.2.50 కోట్ల బిల్లులు పెండింగ్​

ఐటీడీఏ పరిధిలో రూ.2.50 కోట్ల బిల్లులు పెండింగ్​
  • ఐటీడీఏ పరిధిలో సగంలోనే నిలిచిన 3,276 ఇండ్ల నిర్మాణాలు 
  • నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులకు అందని వైనం 
  • షురూ చేసేందుకు రూ.3కోట్ల జిల్లా మినరల్ ఫండ్స్ ఇచ్చిన కలెక్టర్​

భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోనూ డబుల్​బెడ్​రూం ఇళ్ల నిర్మాణాలు సగంలోనే ఆగిపోయాయి. ఐటీడీఏ పరిధిలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్​ జిల్లాల్లో గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్​ విభాగానికి 7,503 ఇండ్లను కేటాయించారు. కానీ వివిధ దశల్లో 3,276 ఇండ్ల నిర్మాణం సగంలోనే నిలిచిపోయాయి. ఇప్పటివరకు 4,227 ఇండ్లు పూర్తయినట్లు ఐటీడీఏ నివేదికలు చెబుతున్నాయి. 447 ఇండ్లు టెండర్​స్థాయిలో ఉండగా..1809 నిర్మాణంలో ఉన్నాయి. మరో 1091 ఇండ్లకు ఇంకా పనులు ప్రారంభం కాలేదు. పూర్తయిన ఇండ్లలో చాలావరకు కరెంట్, వాటర్, ఇతర మౌలిక వసతులు కల్పించకపోవడంతో లబ్ధిదారులకు కేటాయించలేదు.  ఒక్క భద్రాచలం ఐటీడీఏలోనే ఇలా ఆగిన బిల్లులు రూ.2.50కోట్లు వరకు ఉన్నాయి. భద్రాచలంలో నిలిచిన 250 ఇండ్ల నిర్మాణాలను తిరిగి ప్రారంభించేందుకు కలెక్టర్​ జిల్లా మినరల్స్​ ఫండ్స్​ నుంచి రూ.3కోట్లు కేటాయించారు. 

చేతులెత్తేస్తున్న కాంట్రాక్టర్లు 

ఐటీడీఏ పరిధిలో నిర్మిస్తున్న డబుల్​బెడ్రూం ఇండ్లకు బిల్లులు నిలిచిపోవడంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. బిల్లులు సరిగా రాకపోవడం, పెరిగిన ముడిసరుకుల ధరలతో తమపై అదనంగా ఆర్థిక భారం పడుతోందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అయినప్పటికీ అప్పో సప్పో తెచ్చి ఇండ్లు కడితే.. సకాలంలో బిల్లులు రాక తెచ్చిన అప్పులకు వడ్డీల కడుతున్నామని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. 

రూ.3 కోట్లు కేటాయించిన కలెక్టర్​

ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5.04లక్షలు ఇస్తుండగా మరో రూ.2లక్షల వరకు అదనపు భారం పడుతోందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. దీంతో భద్రాచలంలో నిలిచిన 250 డబుల్ బెడ్​ రూం ఇళ్ల నిర్మాణాలను తిరిగి షురూ చేసేందుకు కలెక్టర్​ డిస్ట్రిక్ట్ మినరల్స్ ఫండ్స్ నుంచి రూ.3కోట్లు కేటాయించారు. ఒక్కో ఇంటికి అదనంగా రూ.1.20లక్షలు వెచ్చించి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్మాణాలు పూర్తయిన వెంటనే  బెనిఫిషర్లకు కేటాయించాలని సూచించారు. 

దారిమళ్లిన ‘డబుల్’ ఇసుక 

భద్రాచలంలో డబుల్​ బెడ్రూం ఇండ్లకు కేటాయించిన ఇసుకను కాంట్రాక్టర్లు, ట్రాక్టర్ల యజమానులు కుమ్మక్కై దారి మళ్లించారు. భద్రాచలం ఐటీడీఏ వెనుక ఉన్న ఆగిన డబుల్​బెడ్రూం ఇండ్లను పూర్తి చేసేందుకు కలెక్టర్​ డిస్ట్రిక్ట్ మినరల్స్ ఫండ్స్ నుంచి రూ.3కోట్లు రిలీజ్​ చేశారు. పనులకు అవసరమైన ఇసుకను తోలుకునేందుకు తహసీల్దారు నుంచి 58 కూపన్లు మంజూరు చేశారు. సోమవారం వాటిని కాంట్రాక్టర్లకు ఇచ్చి రెవెన్యూ సిబ్బంది సమక్షంలో ఇసుక తోలేందుకు భద్రాచలం ర్యాంపు నుంచి అనుమతి ఇచ్చారు. ఒక కూపన్​పై ఒక ట్రాక్టర్​ మాత్రమే తోలాల్సి ఉండగా కాంట్రాక్టర్లు, ట్రాక్టర్ల యజమానులతో కలిసి ఒక్కో కూపన్​పై నాలుగు ట్రాక్టర్ల ఇసుకను తోలారు. ఆ ఇసుకను బయట ట్రక్కుకు రూ.4వేల చొప్పున అమ్ముకున్నారు. ఇలా 58 కూపన్లపై 200కు పైగా ట్రిప్పులు తోలారు. ఈ దందాలో ఓ అధికార పార్టీ నాయకుడి హస్తం ఉన్నట్లు సమాచారం. దీంతో అధికారులు తనిఖీలు చేయడానికి ముందుకు రాలేదు. పోలీస్​ బీట్​కానిస్టేబుళ్లు వచ్చి ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నా తర్వాత వదిలేశారు. ఈ విషయం తహసీల్దారు దృష్టికి వెళ్లడంతో మధ్యాహ్నం నుంచి ఇసుక తోలకాలను ఆపేశారు.