
సెకండ్ టర్మ్..డబుల్ స్లో
రెండేండ్లుగా నత్తనడకన ఇండ్ల నిర్మాణం
2018-19లో 12 వేల ఇండ్లే పూర్తి
ప్రస్తుత ఏడాదిలో 39 వేలు కంప్లీట్
వచ్చే ఏడాది 3.44 లక్షల టార్గెట్
హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ రెండోసారి పవర్లోకి వచ్చిన తర్వాత కూడా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం స్లోగానే సాగుతోంది. బడ్జెట్లో టార్గెట్ ఎక్కువగా ఉంటున్నా.. పూర్తి చేసే ఇండ్ల సంఖ్య మాత్రం చాలా తక్కువే ఉంటోంది. రెండేండ్లుగా ఇదే పరిస్థితి ఉంది. 2018 నుంచి డబుల్ ఇండ్ల నిర్మాణంలో పెద్దగా పురోగతి కనిపించడంలేదు. రాష్ట్ర సర్కార్ మాత్రం తాజా బడ్జెట్లోనూ భారీ టార్గెట్‌ను ప్రకటించింది. మొత్తంగా 3,44,080 డబుల్ ఇండ్లను నిర్మించాలని నిర్ణయించింది. అయితే ప్రభుత్వ పరంగా నిధులు విడుదల చేయకపోడం, భూసేకరణ పూర్తి కాకపోవడంతో ఈ లక్ష్యం చేరడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కేంద్రం సాయంతో..
పేదలకు సొంతింటిని సమకూర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకాన్ని అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వాలు 40% వంతున ఖర్చు చేసేలా ఈ స్కీమ్ ను రూపొందించింది. 2020–21 ఫైనాన్షియల్ ఇయర్ప్లాన్ప్రకారం రూరల్ ఏరియాలో రూ.3,150 కోట్లతో, అర్బన్ ఏరియాలో రూ.3,850 కోట్లతో డబుల్ ఇండ్లను నిర్మించాలని, మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2020–-21లో రూరల్ ఏరియాల్లో నిర్మించనున్న 25,479 డబుల్ఇండ్ల కోసం ఒక్కో ఇంటికి రూ.72 వేలు చొప్పున కేంద్రం ఇస్తుంది. అర్బన్ ఏరియాల్లో నిర్మించనున్న 92,305 డబుల్ ఇండ్ల కోసం ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షల చొప్పున కేంద్రం నిధులు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ విధానం ప్రకారం రూరల్ ఏరియాలో డబుల్ ఇండ్ల నిర్మాణ వ్యయం రూ.5.04 లక్షలు, అర్బన్‌లో రూ.5.30 లక్షలుగా ఉంది.
మూడేండ్ల ప్లాన్ ఇలా..
2018–19లో రాష్ట్రంలో 2,63,241 డబుల్ ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 12,530 ఇండ్లే పూర్తయ్యాయి. 2019––-20లో రాష్ట్రంలో 2,83,401 డబుల్ ఇండ్లను నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల వారీగా ఇండ్ల శాంక్షన్ ఇచ్చింది. స్థలం కపోవడంతో 84,323 ఇండ్ల నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగడంలేదు. శాంక్షన్ అయిన వాటిలో 1,99,001 ఇండ్ల నిర్మాణం కోసమే టెండర్లు పిలిచారు. వీటిలో 1,79,078 ఇండ్ల నిర్మాణమే మొదలైంది. 39,321 ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవి నిర్మాణంలో ఉన్నాయి. రూ.74.94 కోట్లే ఖర్చు చేశారు. 2020–21లో రాష్ట్రంలో 3,44,080 డబుల్ ఇండ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రూరల్ ఏరియాలో నిర్మాణంలో ఉన్న 38,241 ఇండ్లను, అర్బన్ ఏరియాలో 29,652 ఇండ్లను కూడా పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది.