మమ్మల్ని విధుల్లోకి తీస్కోవట్లే  

మమ్మల్ని విధుల్లోకి తీస్కోవట్లే  
  • రాష్ట్రపతి, గవర్నర్లకు లెటర్లు రాసిన కాంట్రాక్ట్​ టీచర్లు

భద్రాచలం, వెలుగు: హైకోర్టు చెప్పినా తమను విధుల్లోకి తీసుకోవట్లేదని, ఆత్మహత్య చేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ.. భద్రాద్రికొత్తగూడెంకు చెందిన కొంతమంది ట్రైబల్​ వెల్ఫేర్​ స్కూల్​ కాంట్రాక్ట్​ టీచర్లు సోమవారం రాష్ట్రపతి, గవర్నర్​కు లెటర్లు రాశారు.14 ఏండ్ల పాటు చాలీచాలని జీతాలతో భద్రాచలం ఐటీడీఏ(ఇంటిగ్రేటెడ్​ ట్రైబల్ డెవలప్​మెంట్ ఏజెన్సీ) పరిధిలోని స్కూళ్లలో పనిచేసిన 11 మంది టీచర్లను 2018–-19లో అప్పటి ఐటీడీఏ పీఓ తొలగించారని అందులో పేర్కొన్నారు. ట్రైబల్ వెల్ఫేర్​ కమిషనర్‍, లీడర్ల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు.

గత్యంతరం లేక 2018లో హైకోర్టును ఆశ్రయించగా 2020లో సింగిల్ ​బెంచ్​జడ్జిమెంట్‍లో ఆశ్రమ స్కూల్స్ లో పనిచేసే కాంట్రాక్టు టీచర్లను రెగ్యులర్​ చేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించిందని గుర్తుచేశారు. ఇంప్లిమెంట్ చేయకుండా కమిషనర్ ​అప్పీలుకు వెళ్లగా, హైకోర్టు 2021 డిసెంబరులో కాంట్రాక్టు పద్ధతిలో 11మందిని తిరిగి నియమించుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. నాలుగు నెలలు కావస్తున్నా తమను విధుల్లోకి తీసుకోకుండా ఐటీడీఏ వేధిస్తోందని పేర్కొన్నారు. హైకోర్టు జడ్జిమెంట్‍నైనా అమలు చేయండి, లేకుంటే చనిపోవడానికి అనుమతి ఇవ్వండంటూ లెటర్​లో విజ్ఞప్తి చేశారు.