11 రోజులుగా సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్​ కార్మికులు

11 రోజులుగా సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్​ కార్మికులు

మందమర్రి,వెలుగు: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ కాంట్రాక్ట్​ కార్మికులు 11 రోజులుగా సమ్మె చేస్తున్నారు. రీజియన్​ పరిధిలో  దాదాపు 8 వేల మంది పారిశుద్ధ్య, స్కావెంజర్, తోటమాలి, హౌజ్​కీపింగ్, బెల్ట్​క్లీనింగ్, సెక్యూరిటీ, సివిల్, అటెండర్లు, నీటి సరఫరా తదితర​ కార్మికులు విధులకు హాజరుకావడంలేదు. శానిటేషన్​కార్మికులు విధులకు దూరంగా ఉండడంతో  కార్మికవాడల్లో టన్నుల కొద్దీ చెత్తపేరుకుపోతోంది. బెల్లంపల్లి రీజియన్​లోని మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, నస్పూర్, బెల్లంపల్లి, గోలేటి, సోమగూడెం, భారత్, కార్మిక వాడలు కంపుకొడుతున్నాయి. అండర్ గ్రౌండ్​ డ్రైనేజీ పైప్​లైన్లు స్తంభించి కుండీల నుంచి మురికినీరు, వ్యర్థాలు రోడ్డుపైకి వచ్చి చేరుతున్నాయి. చెత్త కుప్పల వద్ద పందులు, దోమల బెడద ఎక్కువైంది. గనుల వద్ద బెల్ట్​ క్లీనింగ్, షెల్ పిక్కింగ్ పనులు లేక బొగ్గు రవాణా ఇబ్బంది మారింది. సీహెచ్​పీలు, ఓసీపీల వద్ద మట్టి, రాళ్లు తొలగించే వారు లేక కోల్​క్వాలిటీ దెబ్బతింటోంది.

30 వేల మంది కాంట్రాక్ట్​కార్మికులు..

సింగరేణిలో 42 వేల మంది పర్మినెంటు ఎంప్లాయీస్ ఉండగా...సుమారు 30 వేల మంది  కాంట్రాక్ట్​ కార్మికులు ఉన్నారు. నేరుగా బొగ్గు ఉత్పత్తిలో వీరి సేవలు లేకున్నా... ఇతర పనుల్లో సంస్థ పర్మినెంటు ఎంప్లాయీస్​తో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. అయినా  సింగరేణి యాజమాన్యం, కాంట్రాక్టర్ల నుంచి సరైన గుర్తింపు లేదు. కోలిండియాలో హైపవర్​ కమిటీ సూచించిన వేతనాలు ఇస్తున్నా.. సింగరేణిలో మాత్రం అది అమలు కావడంలేదు. కాంట్రాక్ట్​ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని  సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా.. ఆచరణలోకి రాలేదు. బోనస్​, సీఎంపీఎఫ్​, వైద్య , ఇతర సౌలత్​లను కల్పించడంలేదు. 

24  విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు...

సింగరేణిలో ప్రస్తుతం 30  వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. సివిల్, సివిక్​, సులభ్​, సెక్యూరిటీ, ఓసీపీ ఓబీ, వర్క్​షాప్, స్టోర్స్, బెల్ట్​ క్లీనింగ్, సర్ఫేస్, గెస్ట్​హౌజ్​లు,  ఫారెస్ట్​, నర్సరీలు, క్యాంటీన్లు, కోల్​ ట్రాన్స్ పోర్టులో డ్యూటీలు నిర్వహిస్తున్నారు. అండర్​ గ్రౌండ్ మైన్లలో మేషన్, రూప్ సపోర్టింగ్, లైన్​మెన్, రైల్వే ట్రాక్,  లోడింగ్, అన్ లోడింగ్​, ఎలక్ట్రికల్, ఫిట్టర్, టబ్ క్లీనింగ్, జనరల్ మజ్దూర్, షేల్​పీకింగ్, వేబ్రిడ్జి తదితర 24 విభాగాల్లో పనిచేస్తున్నారు.

ఉధృతమవుతున్న ఆందోళన...

కాంట్రాక్ట్​ కార్మికులు సమ్మె చేస్తుండడంతో బొగ్గు ఉత్పత్తేర పనులు నిలిచిపోయాయి. ఈనెల 16న డిమాండ్లపై హైదరాబాద్​లో డిప్యూటీ లేబర్​ కమిషనర్​సమక్షంలో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఆందోళన ఉధృతం చేశారు.

  • కలెక్టరేట్ ఎదుట కాంట్రాక్ట్​ కార్మికుల ధర్నా
  • జీవో 60 ప్రకారం జీతాలు చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​   

మంచిర్యాల, వెలుగు: సింగరేణి కాంట్రాక్ట్​ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్​ కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మెయిన్  గేటు ఎదుట బైఠాయించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​చేశారు. ఈ సందర్భంగా జేఏసీ లీడర్లు మాట్లాడుతూ కాంట్రాక్ట్​ కార్మికుల శ్రమతో సింగరేణి ఏటా వందల కోట్ల లాభాలు ఆర్జిస్తున్నా.. జీతాలు పెంచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్ కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచిందని.. ఇది అన్ని విభాగాల్లో అమలవుతున్నా.. సింగరేణిలో మాత్రం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోల్​ఇండియాలో ఇంప్లిమెంట్​ చేస్తున్న పథకాలు సింగరేణిలో అమలుకు నోచుకోవడంలేదన్నారు. ధర్నాలో ఏఐటీయూసీ, ఐఎఫ్​టీయూ, ఎస్​సీకేఎస్​లీడర్లు ముస్కే సమ్మయ్య, డి.బ్రహ్మానందం, శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు.