రోడ్డు పనులు చేస్తున్నాడని కాంట్రాక్టర్ ను కొట్టి చంపారు

రోడ్డు పనులు చేస్తున్నాడని కాంట్రాక్టర్ ను కొట్టి చంపారు

వెంకటాపురం, వెలుగు : ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర గ్రామానికి 50 కిలోమీటర్ల దూరంలో తెలంగాణ-–ఛత్తీస్​గఢ్​సరిహద్దులో మంగళవారం రాత్రి ఓ కాంట్రాక్టర్​ను మావోయిస్టులు కిరాతకంగా కొట్టి చంపారు. వెంకటాపురంలోని శివాలయం కాలనీకి చెందిన కాంట్రాక్టర్​ షేర్​శేఖర్(35) చత్తీస్​గఢ్​రాష్ట్రం బీజాపూర్ ​జిల్లా ఉసూర్ బ్లాక్ పరిధిలోని చార్గడోడి, –భండర్‌‌పల్లి గ్రామాల మధ్య పీఎం గ్రామీణ సడక్​యోజన పథకం కింద రోడ్డు పనులు చేపట్టాడు. ఈ రోడ్డును నిర్మించవద్దని మావోయిస్టులు కాంట్రాక్టర్​కు హుకుం జారీ చేశారు. అయినప్పటికీ రోడ్డు పనులు చేస్తుండటంతో మంగళవారం సాయంత్రం మావోయిస్టులు పనులు చేస్తున్న ప్రాంతానికి వెళ్లి రెండు ట్రాక్టర్లను, జేసీబీని తగలబెట్టారు. అక్కడే ఉన్న శేఖర్​ను తీవ్రంగా కొట్టడంతో అతను మృతి చెందాడు. ఆ తర్వాత మృతదేహాన్ని రహదారిపై వదిలేసి వెళ్లిపోయారు. బుధవారం పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులు మృతదేహాన్ని వెంకటాపురానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

లూటీ చేసిన ఆయుధాల ప్రదర్శన

భద్రాచలం, వెలుగు : ఇటీవల ఛత్తీస్‍గఢ్‍ లో జరిగిన ఎన్‍కౌంటర్లో జవాన్లను హతమార్చి వారి నుంచి లూటీ చేసిన ఆయుధాలను మావోయిస్టులు గురువారం ప్రదర్శించి వాటి వివరాలు, ఫొటోలను విడుదల చేశారు. అంతేకాకుండా ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారంటూ వారి పేర్లను ప్రకటించారు. ఆ పార్టీ వికల్ప్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 21న సుక్మా జిల్లా మినపలో జరిగిన ఎన్‍కౌంటర్లో 17 మంది జవాన్లను హతమార్చి వారి వద్ద నుంచి  ఏకే–47 తుపాకులు 11, ఇన్సాస్ రైఫిల్స్ 2, ఎస్‍ఎల్ఆర్‍ ఎల్‍ఎంజీ 1, యూబీజీఎల్‍ 2, బుల్లెట్లు 1550, యూబీజీఎస్‍ సెల్స్ 6 లూటీ చేసినట్లుగా తెలిపారు. కాల్పుల్లో తమ పార్టీకి చెందిన సక్రూ, సుక్కు, రాజేశ్ మృతిచెందారని పేర్కొన్నారు. వారికి మినప అటవీ ప్రాంతంలో దహన సంస్కారాలు నిర్వహించి నివాళి అర్పించినట్లు తెలిపారు.

సోషల్ మీడియాలో ఎంట్రీ అదిరింది