రూ. 92 లక్షలు : ఇలా కొట్టేశాడు.. అలా దొరికాడు

రూ. 92 లక్షలు : ఇలా కొట్టేశాడు.. అలా దొరికాడు

ఏటీఎంలో క్యాష్​ పెట్టనీకిపోతే..92 లక్షలతో పరార్
వ్యాన్ యూ టర్న్ చేస్తానంటూ కస్టోడియన్లకు డ్రైవర్​ మస్కా
500 కెమెరాల సీసీ ఫుటేజీ పరిశీలించి నిందితుడి గుర్తింపు
రూ. 90 లక్షలు స్వాధీనం

హైదరాబాద్, వెలుగు: ఏటీఎం క్యాష్ రీఫిల్లింగ్ కస్టోడియన్లకు మస్కా కొట్టి రూ.92లక్షలు ఎత్తుకెళ్లిన డ్రైవర్ ను సిటీ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.90 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 500 సీసీ టీవీ కెమెరాల 36 గంటల ఫుటేజ్ పరిశీలించి నిందితుడిని పట్టుకున్నారు. కేసు వివరాలను టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిసి సీపీ అంజనీకుమార్​వెల్లడించారు. వెస్ట్ గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన దొండపాటి ప్రకాశ్(35) పాలిటెక్నిక్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చదివాడు. 20‌‌‌‌04లో తన స్టడీస్ పూర్తయిన తరువాత ప్రైవేట్ కన్ స్ట్రక్షన్స్ కంపెనీల్లో సైట్ ఇంజనీర్ గా పని చేశాడు. 2014 వరకు ఏపీ, మధ్యప్రదేశ్, తమిళనాడులో వర్క్ చేశాడు.

2015లో మ్యారేజ్ అయిన తరువాత హైదరాబాద్ నాగోల్ లోని సాయినగర్ కాలనీకి మకాం మార్చాడు. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ కి సిటీలో సివిల్ ఇంజనీర్ గా పని చేస్తున్నానని చెప్పుకునేవాడు. ఇంజనీరింగ్ వర్క్ కాకుండా ఉబెర్ క్యాబ్స్ లో కొంతకాలం డ్రైవర్ గా చేశాడు. ఆ సమయంలో ఏటీఎంలలో  క్యాష్  రీఫిల్లింగ్ చేసే క్యాష్ మేనేజ్ మెంట్ సర్వీస్ ఇన్ఫో సిస్టమ్ లిమిటెడ్(సీఎంఎస్)​ గురించి తెలిసింది. ఈజీ మనీ కోసం క్యాష్ రీఫిల్లింగ్ వ్యాన్స్ ను టార్గెట్ చేశాడు. ఇందులో భాగంగా కవాడిగూడలోని ఫైవ్ స్టార్ ఫెసిలిటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా బోయినపల్లి డైమండ్ పాయింట్ వద్ద ఉన్న సెక్యూరిట్రన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో డ్రైవర్ గా చేరాడు. ఆ తరువాత తను టార్గెట్ చేసిన సీఎంఎస్ ఏజేన్సీకి మూడు రోజులపాటు పనిచేశాడు.

ముఖానికి కర్చీఫ్ తో సెక్యూరిటీకి బురిడీ

ప్లాన్ ప్రకారం సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ లో చేరిన తరువాత వెహికల్ మూవ్ మెంట్స్ గమనించాడు. కస్టోడియన్స్ చేసే క్యాష్ డెలివరీ టైమ్ తెలుసుకున్నాడు. సోమవారం కవాడిగూడలోని సీఎంఎస్ వెహికల్ పార్కింగ్ వద్దకు వెళ్లాడు. పార్కింగ్ లోని సెక్యూరిటీకి తన ముఖం కనిపించకుండా కర్చీఫ్ ​కట్టుకుని తలపై క్యాప్ పెట్టుకున్నాడు. సెక్యూరిటీగా ఉన్న కుంట యాదగిరికి ఫైవ్​స్టార్ సెక్యూరిటీ సర్వీసెస్ డ్రైవర్ రాకేశ్ గా చెప్పాడు. పార్కింగ్ లో ఉన్న బొలెరో తీసుకుని అక్కడి నుంచి లోయర్ ట్యాంక్ బండ్ లోని సీఎంఎస్ ఆఫీస్ కి వెళ్లాడు. వెహికల్ మూవ్ మెంట్ కోఆర్డినేటర్ అనిల్ యాదవ్ ను కలిశాడు. కస్టోడియన్లు రవికుమార్, జగన్నాథ రావులతో పాటు గన్ మెన్ రవికుమార్ లతో కలిసి ఎస్బీఐకి చెందిన ఏటీఎంలలో క్యాష్ రీఫిల్లింగ్ కోసం బయలుదేరాడు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కోఠిలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ నుంచి రూ.1.6కో ట్లు తీసుకుని బయలుదేరారు. ముందుగా చిలకలగూడలోని ఏటీఎంలో రూ.68 లక్షలు రీఫిల్ చేసేందుకు కస్టోడియన్స్ రవికుమార్, జగన్నాథరావు తో పాటు గన్ మెన్ రవికుమార్ కిందకు దిగారు. ఆ సమయంలో వ్యాన్ యూ టర్న్ చేసుకుని వస్తానని చెప్పి ప్రకాశ్ ఎస్కేప్ అయ్యాడు. బాక్సుల్లో ఉన్న రూ.92లక్షలు తీసుకుని లాలాగూడ లో వ్యాన్ వదిలి పారిపోయాడు.

28 మంది పోలీసులు.. 500 సీసీ కెమెరాలు

సీఎంఎస్ మేనేజర్ పూజల హరీశ్​ ఫిర్యాదుతో చిలుకలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. చిలుకలగూడ నుంచి నాగోల్ వరకు సుమారు 500 సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన 36 గంటల ఫుటేజ్ ను పరిశీలించారు. ఇందులో లాలాగూడ ఫ్లై ఓవర్ వద్ద క్యాష్ వ్యాన్ వదిలిన తరువాత ఆటోలో పారిపోయిన ప్రకాశ్ ను గుర్తించారు. ఆటో నంబర్ ఆధారంగా డ్రైవర్ ను విచారించారు. నాగోల్ సాయినగర్ కాలనీలో రెండు క్యాష్ బ్యాగులతో దిగిన ప్రకాశ్ ఫుటేజ్ తోపాటు కాలనీ వాసులను కలిసి అతడి సమాచారం సేకరించారు. కాలనీవాసులు చెప్పిన ఆధారాలతో హైదరాబాద్  నుంచి ఎస్కేప్ అయ్యేందుకు రెడీ అవుతున్న ప్రకాశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి  నుంచి రూ.90 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు

కరోనా ఎఫెక్ట్‌‌తో సెబీ రూల్స్‌‌ మార్చింది