రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా 493 కరోనా కేసులు నమోదయ్యాయని శుక్రవారం హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. 20 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు వేగంగా పెరుగుతోందని చెప్పింది. ఈ వారం రోజుల లెక్కల ప్రకారం రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా 3.62 శాతం పాజిటివిటీ రేటు రికార్డయ్యింది. హైదరాబాద్‌లో 2.98 శాతం, మేడ్చల్‌ జిల్లాలో 1.93 శాతంగా ఉంది. వీటితో పాటు యాదాద్రి, వికారాబాద్‌, ఆసిఫాబాద్‌, మహబూబ్‌నగర్‌‌, సూర్యాపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మంచిర్యాల, సిద్దిపేట, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్‌‌, అదిలాబాద్‌, నారాయణపేట్‌, మహబూబాబాద్‌, గద్వాల, వనపర్తి జిల్లాల్లో పాజిటివిటీ రేటులో పెరుగుదల నమోదైంది. మిగిలిన జిల్లాల్లో స్వల్పంగా తగ్గుదల నమోదవడం గమనార్హం. పది రోజుల క్రితం వరకూ గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని 3 జిల్లాల్లోనే కేసులు పెరుగుతుండగా.. ఇప్పుడు ఏకంగా 20 జిల్లాల్లో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గ్రేటర్ నుంచి రాకపోకలతో రాష్ట్రవ్యాప్తంగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు స్ప్రెడ్ అవుతున్నాయని హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారు. 

కొత్త కేసుల్లో 66% బీఏ2.1 వేరియంట్‌

కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్‌ జిల్లాలోనే 366 మందికి వైరస్ సోకింది.  రంగారెడ్డి జిల్లాలో 40, మేడ్చల్‌లో 34, మిగిలిన కేసులు ఇతర జిల్లాల్లో వచ్చాయి. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,322కు పెరిగాయి. ఈ కేసుల్లో 66 శాతం బీఏ2.1 వేరియంట్‌వేనని, ఇది ఒమిక్రాన్‌కు సబ్ వేరియంట్ అని  అధికారులు చెబుతున్నారు. వైరస్ బారిన పడుతున్న వారిలో ఎక్కువగా గొంతు, తల, ఒళ్లు నొప్పులు, విరోచనాల వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకు 4,848 కేసులు నమోదవగా..100 మంది లోపు బాధితులే హాస్పిటళ్లలో చేరి ట్రీట్‌మెంట్ తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. కరోనా కేసుల సంఖ్య పెరిగినా బాధితులపై తీవ్ర ప్రభావమేమి చూపదని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్​రాజారావు అన్నారు.  గాంధీలో గత ఆర్నెల్లుగా ప్రతి రోజు ఒకటి, రెండు కేసులు నమోదు అవ్వగా.. అదే స్థాయిలో డిశ్చార్జీ అయ్యారని తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు వాడాలని, శానిటైజర్​ వినియోగించాలని కోరారు. వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని, పర్సనల్​ హైజీన్​ మెయింటేన్​ చేయాలని విజ్ఞప్తి చేశారు.

మీర్ పేట పీఎస్​లో ముగ్గురు కానిస్టేబుళ్లకు కరోనా

 హైదరాబాద్​లోని  మీర్ పేట్ పోలీస్ స్టేషన్​లో శుక్రవారం ముగ్గురికి పాజిటివ్ రావడంతో మిగతా సిబ్బందిలో ఆందోళన నెలకొంది. అప్రమత్తమైన అధికారులు 30 మంది సిబ్బందికి టెస్టులు చేయించారు. అందరికీ నెగెటివ్ రావడంతో ఊపిరిపీల్చుకున్నారు. చాలా రోజుల తర్వాత పోలీస్ స్టేషన్​లో కేసులు నమోదు కావడంతో  సిబ్బందితో పాటు పీఎస్​కు వచ్చే వాళ్లు తప్పని సరిగా మాస్క్ ,శానిటైజర్ వాడాలని సూచించారు.

లెక్క కుదరడం లేదు..

రాష్ట్ర సర్కార్ చెప్తున్న కరోనా మరణాల లెక్కకు, అసలు లెక్కకు పొంతన కుదరట్లేదు. ఫస్ట్ వేవ్ నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో 4,111 మంది మాత్రమే వైరస్‌ బారిన పడి చనిపోయినట్టు సర్కార్ చెప్తుండగా, కొవిడ్‌ డెత్ పరిహారం కోరుతూ ఏకంగా 35,846 అప్లికేషన్లు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఇది సర్కార్ చెప్పే మరణాల లెక్కకు దాదాపు 9 రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. కరోనా మృతుల కుటుంబాల నుంచి వచ్చిన 35,846 దరఖాస్తుల్లో, 32,057 అప్లికేషన్లు సరియైనవేనంటూ అధికారులు పరిహారం కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో 26,870 కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం కూడా చెల్లించారు. ఇంకో 5,187 మందికి చెల్లించాల్సి ఉంది. పరిహారం కోరుతూ వచ్చిన దరఖాస్తులను చిన్నచిన్న సాకులు చెప్పి రిజెక్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. కానీ, మన రాష్ట్రంలో ఏకంగా 2,603 అప్లికేషన్లను అధికారులు రిజెక్ట్ చేశారు. కరోనా పాజిటివ్ సర్టిఫికెట్ లేకపోవడంతో, డెత్ సర్టిఫికెట్‌లో కొవిడ్ అని లేకపోవడం వంటి కారణాలను చూపించారు. అయితే, సరియైన పత్రాలతో మరోసారి అప్లైచేసుకునేందుకు చాన్స్ ఇచ్చామని అధికారులు చెప్తున్నారు.