భద్రాచలం, వెలుగు : పుష్యమి నక్షత్రం వేళ మంగళవారం భద్రాద్రి సీతారామయ్యకు ఘనంగా పట్టాభిషేకం నిర్వహించారు. సుప్రభాత సేవ అనంతరం బాలబోగం నివేదించాక ఉత్సవమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన తర్వాత యజ్ఞోపవీతం, కంకణధారణ, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక తర్వాత మంత్రపుష్పంతో క్రతువు ముగిసింది.
అనంతరం సమస్త నదీజలాలతో వేదికను సంప్రోక్షణ చేశారు. సీతారామయ్యకు పట్టాభిషేక మహోత్సవాన్ని అర్చకులు ప్రారంభించారు. ముందుగా భక్తరామదాసు తయారు చేయించిన ఆభరణాలను స్వామికి అలంకరించారు.
పట్టాభిషేకంలో భాగంగా కత్తి, డాలు, రాజదండం, రాజముద్రిక, చామరాలు సమర్పించి చివరిగా కిరీటం అలంకరించి ప్రోక్షణ జలాలను పట్టాభిరామయ్యకు, తర్వాత ఉత్సవాన్ని తిలకిస్తున్న భక్తులపై చల్లడం ద్వారా ముగించారు. భక్తులు తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
అంతకుముందు ఉదయం గాలిగోపురానికి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం చేసి, అప్పాల, నిమ్మకాయల, తమలపాకుల మాలలను నివేదించారు. హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. సాయంత్రం సీతారామచంద్రస్వామికి దర్బారు సేవను నిర్వహించారు. భక్తులు వేడుకలనుతిలకించారు.
రామయ్యను దర్శించుకున్న కలెక్టర్
భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఈవో దామోదర్‌రావు ఘనంగా స్వాగతం పలికారు. అర్చకులు పరివట్టం కట్టి సంప్రదాయం ప్రకారం ఆలయంలోకి తీసుకెళ్లారు. పూజలు చేసిన అనంతరం అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చి ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు.
అనంతరం ఈవో దామోదర్‌తో అభివృద్ధి, ప్రణాళికలు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ముక్కోటి ఏకాదశీ ఉత్సవాలకు కల్పించాల్సిన సౌకర్యాలపై ఈవోకు సూచనలు చేశారు. ఈసారి కూడా ఏరు ఉత్సవం ఉంటుందని, ముక్కోటి తెప్పోత్సవం, వైకుంఠ ఏకాదశీ ఉత్సవాలకు వచ్చే భక్తులకు చక్కని సాంస్కృతిక కార్యక్రమాలతో కనువిందు చేస్తామని తెలిపారు.
