
2022-23 లో రూ. 1.72 లక్షలు
2014-15 లో రూ. 86,647
వెల్లడించిన ఎన్ఎస్ఓ డేటా
వెలుగు బిజినెస్ డెస్క్ : మోడీ నాయకత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2014–15 నుంచి చూస్తే దేశంలో తలసరి ఆదాయం రెట్టింపై రూ. 1.72 లక్షలకు చేరింది. తలసరి ఆదాయంలో ఏటా 5 నుంచి 6 శాతం గ్రోత్ సాధిస్తూ, సంపద వీలయినంతగా పంపిణీ అయ్యేలా చూస్తే దేశం ఆర్థికంగా మరింత దూసుకెళ్తుందని ఎకానమిస్టులు నమ్ముతున్నారు. అయితే, సంపద పంపిణీలో వ్యత్యాసం ఎక్కువగా ఉంటే మాత్రం పెద్ద సవాలే అవుతుందని వారు చెబుతున్నారు.
నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) డేటా ప్రకారం ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం 2022–23 సంవత్సరానికి రూ. 1.72 లక్షల వద్ద నిలిచింది. అంతకు ముందు ఏడాది అంటే 2021–22 తో పోలిస్తే ఈ తలసరి ఆదాయం 15.8 శాతం పెరిగింది. 2014–15 నాటి రూ. 86,647 తో పోల్చినప్పుడు తాజా తలసరి ఆదాయం దాదాపు రెట్టింపయినట్లు. ఇక 2020–21 ఏడాదికి తలసరి ఆదాయం రూ. 1,27,065, 2021–22 ఏడాదికి రూ. 1,48,524 గా (ప్రస్తుత ధరల వద్ద) లెక్కగట్టారు. తలసరి ఆదాయం నిలకడగా పెరుగుతూ వస్తోందనేది దీనిని బట్టి తెలుస్తోంది.
ఈ గ్రోత్ చెప్పుకోదగ్గ స్థాయిలోదే.....
వరల్డ్ డెవలప్మెంట్ ఇండికేటర్ డేటాబేస్ ప్రకారం ఇండియా పెర్కాపిటా ఇన్కం (తలసరి ఆదాయం) 2014–2019 మధ్య కాలంలో సగటున 5.6 శాతం పెరిగిందని ఎన్ఐపీఎఫ్పీ మాజీ డైరెక్టర్ పినాకి చక్రబర్తి చెప్పారు. ఈ గ్రోత్ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉందని పేర్కొన్నారు. హెల్త్, ఎడ్యుకేషన్, ఎకనమిక్, సోషల్ మొబిలిటీ వంటి అంశాలలో చాలా మెరుగుదల మన దేశంలో కనబడుతోందని ఆయన చెప్పారు. కొవిడ్ ప్రభావం మన మీద ఎక్కువగానే పడిందని, అయినా, ఆ తర్వాత కాలంలో చురుకైన రికవరీ సాధించగలిగామని పినాకి చక్రబర్తి పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో ఏటా 5 నుంచి 6 శాతం చొప్పున గ్రోత్ సాధించగలుగుతూ, సంపద పంపిణీకి సరయిన చర్యలు తీసుకోగలిగితే ఇదే మొమెంటమ్ కొనసాగే అవకాశాలుంటాయని ఆయన వివరించారు.
ఫుల్ ఇయర్ గ్రోత్ అంచనా మారలే...
2022–23 క్యూ 3 లో మన జీడీపీ (గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్) 4.4 శాతం పెరిగింది. ఇదే ఫైనాన్షియల్ ఇయర్ రెండో క్వార్టర్లో రికార్డయిన 6.3 శాతం గ్రోత్తో పోలిస్తే తాజా క్వార్టర్లో గ్రోత్ పడిపోయింది. బేస్ ఎఫెక్ట్స్తోపాటు, గత కాలపు అంకెల రివిజన్ల వల్లే ఇండియా జీడీపీ గ్రోత్ మూడో క్వార్టర్లో 4.4 శాతానికి తగ్గిందని డీబీఎస్ బ్యాంక్ సీనియర్ ఎకానమిస్ట్ రాధికా రావు చెప్పారు. రెండో అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం వాస్తవిక జీడీపీ గ్రోత్ అంచనా మారకుండా 7 శాతం వద్దే ఉందని గమనించాలని జేఎం ఫైనాన్షియల్ ఒక రివ్యూ రిపోర్టులో తెలిపింది. క్యూ 3 జీడీపీ గ్రోత్ మార్కెట్ అంచనాల కంటే కొంచెం తక్కువగా 4.4 శాతంగా రికార్డయిందని పేర్కొంది. కన్జంప్షన్బాగా తగ్గడం వల్లే డిసెంబర్ 2022 క్వార్టర్లో గ్రోత్ తక్కువైందని, మరోవైపు దిగుమతులు కూడా తగ్గుతున్నాయంది.
ఈ రెండు అంశాలూ డొమెస్టిక్గా డిమాండ్ తగ్గడాన్నే సూచిస్తున్నాయని జేఎం ఫైనాన్షియల్ వెల్లడించింది. 2022–23 లో మన ఎకానమీ 6.8 శాతం పెరుగుతుందని ఈ సంస్థ అంచనా వేస్తోంది. ఫిబ్రవరి 2023 కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా చేసుకుని రాబోయే మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మీటింగ్లో రిజర్వ్ బ్యాంక్ తన పాలసీ రేటును నిర్ణయిస్తుంది. అయితే, గ్రోత్ పైనే ఆర్బీఐ ఫోకస్ కొనసాగుతుందని తాము భావిస్తున్నట్లు జేఎం ఫైనాన్షియల్ పేర్కొంది.
ఇన్ఫ్లేషన్ లెక్కలోకి తీసుకోలే...
ప్రస్తుత ధరల వద్ద జీడీపీ లెక్క చూసినప్పుడు పై గణాంకాలు సరిపోలుతాయని, కానీ, ఇన్ఫ్లేషన్ను లెక్కలోకి తీసుకుంటే తలసరి ఆదాయంలో వృద్ధి అంత ఎక్కువగా ఉండదని మరో ప్రముఖ ఎకానమిస్ట్ జయతి ఘోష్ చెప్పారు. దేశంలోని టాప్ 10 శాతం జనాభా సంపదే భారీగా పెరిగిందని ఈ జేఎన్యూ ప్రొఫెసర్ అన్నారు. మరోవైపు, సగటు వేతనాలు బాగా తగ్గిపోతున్నాయని, రియల్ టర్మ్స్ (వాస్తవిక ప్రాతిపదికన) చూస్తే ఇవి మరీ తగ్గినట్లని చెప్పారు. సంపద పంపిణీ అనేది చాలా కీలకమైనదని ఆమె అభిప్రాయపడ్డారు.