బాధ్యతలు స్వీకరించిన దీపికా రెడ్డి

 బాధ్యతలు స్వీకరించిన  దీపికా రెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గా ప్రముఖ నాట్య గురువులు దీపికా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రవీంద్రభారతిలోని తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ ఆఫీసులో ఈ కార్యక్రమం జరిగింది. ఈ  కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి తదితరులు పాల్గొన్నారు. నాట్య గురువు  దీపికా రెడ్డి దేశ, విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారని..వేల మంది శిష్యులు ఉన్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. 

నాట్యమే ఊపిరి
దీపికారెడ్డి మాట్లాడుతూ.. "నాకు హాబీ అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. నాట్యం చేయడం, కొత్త ప్రయోగాల గురించి ఆలోచించడం, నాట్యం గురించి మాట్లాడడం... ఇష్టం. రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఏ మధ్య రాత్రిలోనో ఓ కొత్త ఐడియా వస్తుంది. అప్పుడే ఆ ఐడియాను పేపర్‌ మీద రాసుకుని, నాట్యం చేస్తూ ఫోన్‌లో రికార్డు చేసుకోవడం, ఉదయానికంతా కొత్త రూపకాన్ని సిద్ధం చేయడం నాకలవాటు. కోవిడ్‌ సందర్భంగా రూపకం, ప్రకృతి సంరక్షణ కోసం ప్రకృతి రక్షతి రక్షితః, శాంతి జీవనం, రితు సంహార, తెలంగాణ వైభవం, వైద్యో నారాయణో హరి... వంటివన్నీ అలా రూపొందినవే.  భవిష్యత్తులో నాట్యాన్ని హైదరాబాద్ కే కాకుండా... జిల్లాల్లో ఉండే పిల్లల వరకూ తీసుకెళ్తా" అని దీపికారెడ్డి తెలిపారు.