కూతురి నిర్వాకం... ఇంటిని రాయించుకుంది.. తండ్రిని గెంటేసింది.. తిరిగి ఆస్తిని తండ్రికి అప్పగించిన అధికారులు

 కూతురి నిర్వాకం... ఇంటిని రాయించుకుంది.. తండ్రిని గెంటేసింది.. తిరిగి ఆస్తిని తండ్రికి అప్పగించిన అధికారులు

 

  • ఆసిఫ్​నగర్​ మండలంలో కూతురి నిర్వాకం
  • కలెక్టర్​కు ఫిర్యాదు చేసిన సీనియర్​ సిటిజన్

మెహిదీపట్నం, వెలుగు: తన కూతురు బాగుండాలని కోరుకున్న ఓ తండ్రి తన వద్ద ఎలాంటి ఆస్తి ఉంచుకోకుండా ఉన్నదంతా కూతురికే రాసిచ్చాడు. ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ తానే తండ్రిని పోషిస్తానని ముందుకు రావడంతో తోడబుట్టిన వారు కూడా అభ్యంతరం చెప్పలేదు. 

తండ్రి ఆస్తితో ఆమె లైఫ్​ సెటిల్​ అయిపోయింది. కానీ ఆ తండ్రే ఆమెకు బరువయ్యాడు. భార్యను కోల్పోయి ఒంటివాడైనా ఆయనకు నాలుగు ముద్దలు పెట్టడమే బరువు అనుకున్న ఆ కూతురు ఇంట్లోంచి వెళ్లగొట్టింది. ఈ ఘటన ఆసిఫ్ నగర్ మండలం గుడిమల్కాపూర్ లో పరిధిలో జరిగింది. గుడిమల్కాపూర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ అహ్మద్ అలీ సీనియర్ సిటిజన్. ఇతడికి ముగ్గురు కూతుర్లు. అందరి పెళ్లిల్లు కాగా అందరూ లైఫ్​లో బాగానే సెటిల్​ అయ్యారు. 

వృద్ధ్యాప్యంలో తన బాగోగులు చూసుకోవాలని అహ్మద్​ అలీ తనకున్న ఆస్తిని చిన్న కూతురు ఇస్రా అహ్మద్ కు రాసిచ్చాడు. గుడిమల్కాపూర్ ప్రాంతంలో ఉన్న 500 గజాల స్థలంలో నిర్మించిన అపార్ట్​మెంట్  భవనాన్ని నాలుగేళ్ల క్రితం ఆమెకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. ఎలాగూ తండ్రిని చూసుకుంటుందని కదా అని మిగతా కూతుళ్లు కూడా ఏమీ అభ్యంతరం చెప్పలేదు. 

విశ్వాసం మరిచి..

నాలుగు సంవత్సరాల క్రితం అహ్మద్​ అలీ భార్య చనిపోయింది. అప్పటి నుంచి చిన్న కూతురుతోనే ఉంటున్నాడు. కాగా రెండు సంవత్సరాల క్రితం తండ్రిని మూడో కూతురు ఇస్రా ఇంటి నుంచి బయటికి గెంటేసింది. అప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న అలీ ఇటీవల సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 కింద కలెక్టర్​కు ఫిర్యాదు చేశాడు. 

విచారించిన కలెక్టర్ ఆ ఇంటిని స్వాధీనం చేసుకొని, సీనియర్ సిటిజెన్ అయిన అలీకి అప్పగించాలని ఆసిఫ్ నగర్ తహసీల్దార్ జ్యోతికి ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం తహసీల్దార్​ జ్యోతి సిబ్బందితో కలిసి ఆ ఇంటికి వెళ్లగా ఇస్రా వాగ్వాదానికి దిగింది. పోలీసుల సాయంతో రాత్రికల్లా అధికారులు సయ్యద్ అహ్మద్ అలీకి ఇంటిని అప్పగించారు. ఈ చర్యపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.