 
                                    హైదరాబాద్ : తెలంగాణలో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ముగిసింది. దరఖాస్తులు లక్ష దాటినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం (ఆగస్టు 18వ తేదీ) చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వివరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం (ఆగస్టు 18వ తేదీ) సాయంత్రం 6 గంటల వరకు ఒక లక్ష 7 వేల 16 దరఖాస్తులు వచ్చాయి.
ఎక్కువగా దరఖాస్తులు వచ్చిన ప్రాంతాలు ఇవే.. ( శుక్రవారం 6pm వరకు)
* సరూర్ నగర్ లో 8 వేల 883
* శంషాబాద్ లో 8 వేల 749
* నల్కొండలో 6 వేల 134
* మేడ్చల్ లో 5 వేల 210
తక్కువగా దరఖాస్తులు వచ్చిన ప్రాంతాలు ఇవే
* నిర్మల్ కేవలం : 657 దరఖాస్తులు
* అదిలాబాద్ :781 దరఖాస్తులు
* ఆసిఫాబాద్ : 846 దరఖాస్తులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల 620 మద్యం దుకాణాల కోసం ఆగస్టు 4వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. దీంతో డ్రాలో పాల్గొనే వారు రూ.2 లక్షలు.. తిరిగి ఇవ్వని నగదు చలాన్ (డీడీ)తో దరఖాస్తు సమర్పించారు. ఆగస్టు20న డ్రా ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు.
డ్రా ద్వారా గౌడ్‌లకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 చొప్పున దుకాణాలు కేటాయించనున్నారు. ఈ మూడు కేటగిరీలకు కలిసి 756 మద్యం దుకాణాలు కేటాయించినట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది.
మిగిలిన ఒక వెయ్యి 864 మద్యం దుకాణాలు ఓపెన్ కేటగిరీ కింద ఉన్నట్లు అబ్కారీశాఖ స్పష్టం చేసింది. ఈ ఎంపిక ప్రక్రియ ఆయా జిల్లా కలెక్టర్ల సమక్షంలో పూర్తి కానుంది. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న నూతన మద్యం విధానంలో భాగంగా ఈ కొత్త దుకాణాలు ఏర్పాటు కానున్నాయి.

 
         
                     
                     
                    