ఆస్తుల సర్వేకు గడువు మరో 10 రోజులు పెంపు

ఆస్తుల సర్వేకు గడువు మరో 10 రోజులు పెంపు

హైదరాబాద్‌, వెలుగు: వ్యవసాయేతర ఆస్తుల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ గడువును ఇంకో 10 రోజుల పాటు పొడిగించారు. ఈ నెల 20 వరకు ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆన్‌లైన్‌లోనే నాలా కన్వర్షన్‌ చేసేలా ప్రతిపాదించిన చట్ట సవరణకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రిజిస్ట్రేషన్‌ చట్టానికి స్వల్ప సవరణలకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో సగం సీట్లు మహిళలకు ఇవ్వడంతో పాటు డివిజన్ల రిజర్వేషన్‌ల రూపకల్పన చట్టానికి సవరణలు ప్రతిపాదించింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన శనివారం రాత్రి ప్రగతిభవన్‌లో నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో పలు బిల్లులకు ఆమోదముద్ర పడింది. ఈ నెల13,14 తేదీల్లో నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో వీటిని ప్రవేశపెట్టి ఉభయ సభల ఆమోదం పొందనున్నారు.

ఆటోమేటిక్ గా నాలా కన్వర్షన్

వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమి(నాలా కన్వర్షన్‌)గా మార్చే విచక్షణాధికారం దుర్వినియోగం కాకుండా చేసేందుకు ఆన్‌లైన్‌లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ప్రతిపాదించిన రెవెన్యూ చట్టంలో ఈ మేరకు సవరణలు ప్రతిపాదించింది. ధరణి పోర్టల్‌ ద్వారా సంబంధిత వివరాలతో ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే ఆటోమేటిక్‌గా నాలా కన్వర్షన్‌ చేసేలా చట్టాన్ని సవరించింది. రిజిస్ట్రేషన్‌ల చట్టానికి కొన్ని సవరణలు ప్రతిపాదించగా వాటికి కేబినెట్‌ ఓకే చెప్పింది. జీహెచ్‌ఎంసీ చట్టం1995కు సవరణలు చేసింది. గ్రేటర్‌లో సగం డివిజన్‌లను మహిళలకు రిజర్వ్‌ చేశారు. పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయడంతో పాటు డివిజన్‌ల రిజర్వేషన్‌ల అంశంలోనూ సవరణలకు ఆమోదం తెలిపారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ విధానంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

ధాన్యం కొనుగోలుకు 6 వేల కేంద్రాలు..  

కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. రైతుల నుంచి పంటను ఈ సీజన్ లో గ్రామాల్లోనే  కొనుగోలు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అయితే 17 శాతానికి మించకుండా తేమ ఉండేలా చూసుకుని, తాలు, పొల్లు లేకుండా ధాన్యాన్ని తీసుకురావాలని రైతులకు సూచిస్తున్నారు. వడ్ల కొనుగోలులో ఆందోళన వద్దని, ఎన్ని రోజులైనా పంటను కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వడ్లను కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని సూచించారు. దేశంలో అవసరానికి మించి మొక్కజొన్నల నిల్వలు ఉన్నా, విదేశాల నుంచి దిగుమతికి కేంద్రం అనుమతి ఇవ్వడంపై కేబినెట్‌ విస్మయం వ్యక్తం చేసింది. మొక్కజొన్న రైతులకు మద్దతు ధర వచ్చే అవకాశం లేదని, రైతులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌ సూచించింది.

ఏ గ్రేడ్ వడ్లకు.. రూ. 1,888  

రాష్ట్రవ్యాప్తంగా 5,690 సెంటర్లలో వడ్లు కొనుగోలు చేయనున్నట్లు సివిల్‌ సప్లయ్స్ డిపార్ట్​మెంట్​శనివారం ప్రకటించింది. ఇంకా కొనుగోలు కేంద్రాలు ఎక్కడైనా అవసరమైతే ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఏ గ్రేడ్‌ వడ్లు క్వింటాల్‌కు రూ.1,888, కామన్‌ రకం వడ్లు రూ.1,868 మద్దతు ధర చెల్లించి కొంటామని ఉత్తర్వులలో పేర్కొంది.