
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు విచారణను సుప్రీంకోర్టు ఆగస్టు 4కు వాయిదా వేసింది. ఈ కేసులో గుజరాత్ హైకోర్టు తనకు రెండేళ్ల జైలు శిక్ష విధించడాన్ని రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. రాహుల్ అప్పీల్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ శుక్రవారం విచారణకు చేపట్టింది. కాంగ్రెస్ మాజీ ఎంపీ అప్పీల్ పై స్పందన తెలపాలంటూ పూర్ణేశ్ మోదీ, గుజరాత్ సర్కారుకు నోటీసులు పంపించింది. రాహుల్ గాంధీ తరపున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ సింఘ్వీ వాదిస్తూ.. ఈ కేసుతో రాహుల్ ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారని, లోక్ సభ సభ్యత్వాన్ని కూడా కోల్పోయారని చెప్పారు. అలాగే పార్లమెంట్ సెషన్ కు హాజరయ్యే వీలు లేకుండా పోయిందని సింఘ్వీ తెలిపారు. వయనాడ్ సీటుకు ఎప్పుడైనా బైపోల్ జరిగే అవకాశం ఉందని, సాధ్యమైనంత త్వరగా ఈ కేసును విచారించాలని బెంచ్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. గుజరాత్ ప్రభుత్వం తరపున మహేశ్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న బెంచ్.. కేసు విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. అలాగే, రాహుల్ అప్పీల్‌పై రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని జెఠ్మలానీ, పూర్ణేశ్ మోదీకి ఆదేశాలు జారీ చేసింది.