3 రెట్లు పెరగనున్న పత్తి దిగుబడి

3 రెట్లు పెరగనున్న పత్తి దిగుబడి

 

  • హైడెన్సిటీ విధానం అమలు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయం
  •      3 రెట్లు పెరగనున్న దిగుబడి
  •     45 వేల ఎకరాల్లో పైలట్ ప్రాజెక్టు 
  •      సాగు చేసే రైతులకు ప్రోత్సహకాలు 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: పత్తి సాగులో కొత్త విధానం అమలు చేయాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది. ఈ వానాకాలం సీజన్‌‌‌‌ నుంచి హైడెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ (హెచ్ డీపీఎస్) అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి సాగును పెద్ద ఎత్తున పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. మొదట రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమైంది. ఈ సాగును ప్రోత్సహించేందుకు రైతులకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలని నిర్ణయించింది. 

ఎకరాకు 22 వేల నుంచి 66 వేల మొక్కలు..  

ప్రస్తుత సాగు విధానంలో ఎకరానికి 7 నుంచి 8 వేల మొక్కలు ఉండేలా పత్తి విత్తనాలు వేస్తున్నారు. కానీ కొత్త విధానంలో ఎకరానికి 22 వేల నుంచి 66 వేల మొక్కలు ఉండేలా విత్తనాలు వేస్తారు. మొక్కల మధ్య దూరం 10 నుంచి 20 సెంటీమీటర్ల లోపే ఉంటుంది. పత్తి సాళ్ల మధ్య దూరం కూడా 30 నుంచి  90 సెంటీమీటర్లకు పరిమితమవుతుంది. ఇప్పటికే వరంగల్ రీజనల్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ సెంటర్‌‌‌‌ ఈ కొత్త సాగు విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది. వరంగల్, మెదక్, నల్గొండ జిల్లాల్లో రైతులతో సాగు చేయించి పరీక్షించింది. ఈ పద్ధతిలో ఖర్చులు తగ్గడమే కాకుండా, దిగుబడి మూడు రెట్లు పెరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నేపథ్యంలో హైడెన్సిటీ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. 

రైతులకు శిక్షణ

హైడెన్సిటీ సాగు విధానంపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ విధానంలో ఎలాంటి విత్తనాలు వాడాలి? ఎలాంటి పద్ధతులు పాటించాలి? ఎలాంటి మెషినరీ వినియోగించాలి? ఏయేం లాభాలు ఉంటాయి? తదితర అంశాలపై రైతులకు వివరిస్తారు. మార్కెటింగ్‌‌‌‌లో వ్యాల్యూ చైన్‌‌‌‌ మెకానిజం అమలు చేయనున్నారు. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా పత్తిని నేరుగా అమ్మే కంటే, బేళ్లుగా చేసి అమ్మేలా చర్యలు తీసుకోనున్నారు. పత్తి తీసేందుకు యంత్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సాగులో  నూజివీడు, రాశీ కాటన్ సీడ్స్ వంటి ప్రైవేటు సంస్థల సహకారం తీసుకోనున్నారు.

ఎకరాకు 15 క్వింటాళ్లు.. 

సాధారణ సాగుతో పోలిస్తే, హైడెన్సిటీ విధానంలో పత్తి దిగుబడి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ విధానంలో మొక్కల సంఖ్య పెరుగుతుందని, ప్రతి మొక్కకు 6 నుంచి10 కాయలు వస్తాయని, ఫలదీకరణ వేగంగా జరుగుతుందని అంటున్నారు. దీంతో తక్కువ కాలంలోనే  ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఎకరానికి నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తుండగా, కొత్త విధానంతో 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.