జూన్ లో వానాకాలం రైతుబంధు 

జూన్ లో వానాకాలం రైతుబంధు 

హైదరాబాద్, వెలుగు: వానాకాలం రైతుబంధును జూన్​లో ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకు రూ.7,500 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా కోటి 50లక్షల ఎకరాల భూములకు సంబంధించి 63.25 లక్షల మందికి రైతుబంధు అందించాలని భావిస్తోంది. నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ దృష్టి సారించింది.

అర్హులను గుర్తించే బాధ్యత సీసీఎల్‌‌ఏకు..

రైతుబంధు మార్గదర్శకాల ప్రకారం పట్టాభూమి ఉన్న రైతులు పెట్టుబడి సాయానికి అర్హులు. అయితే అర్హులైన రైతులను గుర్తించే బాధ్యతను సీసీఎల్‌‌ఏ చూస్తుంది. జూన్‌‌ మొదటి వారం నాటికి ఈ కసరత్తు పూర్తి చేయనుంది. ఆ లిస్ట్​ను వ్యవసాయ శాఖకు అందించనుంది. కొత్తగా పాస్​బుక్​లు పొందిన రైతులు, తొలిసారి రైతుబంధుకు దరఖాస్తు చేసుకునే రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు సేకరించనున్నారు.
త్వరలో రైతుబంధు పోర్టల్‌‌లో ఎడిట్‌‌ ఆప్షన్‌‌
కొందరు రైతులు భూములు అమ్ముకోగా, కొనుక్కున్న వారు రైతుబంధుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. దీని కోసం పోర్టల్‌‌లో ఎడిట్‌‌ ఆప్షన్‌‌ ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. దరఖాస్తు చేసుకున్న రైతులకు కొత్తగా రైతుబంధు సాయం అందనుంది. అంతే కాకుండా గతంలో బ్యాంకు ఖాతాల్లో తప్పులుండి నిధులు వెనక్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి రైతులు బ్యాంకు ఖాతాలను మార్చుకునే వెసులుబాటు కల్పించనున్నారు. రైతుబంధు పోర్టల్‌‌లో మూడు రకాల ఎడిట్‌‌ ఆప్షన్లు ఇవ్వనున్నారు.

ఎకరాలోపు వారికి తొలి ప్రాధాన్యత

2022–23 బడ్జెట్​లో వానాకాలం, యాసంగి సీజన్ల కోసం రైతుబంధుకు రూ.14,800 కోట్లు కేటాయించారు. ఇందులో వానాకాలానికి అవసరమైన రూ.7,508.78 కోట్లను అందించేందుకు ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. రైతు బంధు జమ చేయడంతో ఎకరాలోపు ఉన్న వారికి తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఆ తర్వాత ఒక్కో ఎకరా పెంచుకుంటూ జూన్‌‌ చివరికి అర్హులైన రైతులందరి ఖాతాల్లో నిధులు జమ చేస్తారు.