
- రేషన్‌కార్డు, ఇండ్ల పట్టాలపంపిణీ పంచాయతీ సెక్రటరీకి
- ఆర్ఆర్ యాక్టు, ఎన్నికల నిర్వహణ విధులు కూడా..
- చెరువులు, కుంటల సంరక్షణ డ్యూటీ ఇరిగేషన్ ఏఈలకు
- రెవెన్యూ శాఖ నుంచి పలు బాధ్యతలు బదిలీ
- కొత్త రెవెన్యూ చట్టం కోసం ప్రతిపాదనలు రెడీ
హైదరాబాద్, వెలుగు: ఇప్పటివరకు రెవెన్యూ శాఖ చేతిలో ఉన్న భూముల రికార్డుల నిర్వహణ బాధ్యత ఇక నుంచి వ్యవసాయ శాఖ పరిధిలోకి మారనుంది. ఊళ్లలోని భూముల రికార్డులను భద్రపరచడం, పంటల సాగు వివరాలు రికార్డు చేయడం వంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో) పనులు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఏఈవో)కు దక్కనున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం రెవెన్యూ పర్యవేక్షణలో ఉన్న ఆసరా పెన్షన్ల మంజూరు, రేషన్‌కార్డుల పంపిణీ, ఇండ్ల పట్టాల పంపిణీ పంచాయతీ సెక్రటరీకి దక్కనుంది. కొత్త రెవెన్యూ చట్టం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు రెడీ చేసింది. వీఆర్వో వద్ద ఉండే బాధ్యతలు, తీసేసే బాధ్యతలను స్పష్టం చేసింది. రెవెన్యూ వ్యవస్థకు అవినీతి మకిలీ అంటించిన బాధ్యతలన్నీ ఈ శాఖ నుంచి పూర్తిగా బదిలీ చేసేలా కొత్త ప్రతిపాదనలు ఉన్నాయి. తుది పరిశీలన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వీటిని చట్టంలో పొందుపరచనుంది.
రెవెన్యూ నుంచి ఇతర డిపార్ట్మెంట్లకు బదిలీ చేసేవి..
- ఊరికి సంబంధించిన అన్ని రికార్డులను, అకౌంట్లను ఏఈవోకు అప్పగించడం. పంటల అజమాయిషీ, భూముల రికార్డులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ విధులు కూడా ఏఈవోకే బదిలీ.
- ప్రభుత్వ శాఖల ఆస్తులను ఆయా శాఖలకు అప్పగించడం. ఆయా శాఖల భూముల ఆక్రమణలకు సంబంధిత ఆఫీసర్లదే బాధ్యత. అలాగే ప్రభుత్వ శాఖల ఆస్తుల ధ్వంసమైనా ఇదే పద్ధతి ఉంటుంది. ప్రభుత్వ శాఖల భూముల ఆక్రమణ విషయంలో సంబంధిత శాఖలు, తహశీల్దార్‌తో ఫాలో అప్ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
- విలేజ్ సర్వెంట్ల పే బిల్లుల తయారీ బాధ్యతలను మండల స్థాయి ఆఫీసర్‌కు అప్పగించడం.
- చెరువులు, కుంటల సంరక్షణ బాధ్యతలను సాగునీటి శాఖ ఏఈకి బదిలీ చేయడం.
- గ్రామ పంచాయతీ పరిధిలోని ఆసరా పెన్షన్ల మంజూరు, రేషన్‌కార్డుల పంపిణీ, ఇండ్ల పట్టాల పంపిణీ వంటి రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్న విధులను పంచాయతీ కార్యదర్శికి అప్పగించడం.
- గ్రామ పంచాయతీ పరిధిలోని బర్త్, డెత్ రిజిస్ర్టర్ నిర్వహణ పంచాయతీ కార్యదర్శి పరిధిలో ఉంచడం. కనీస వేతనాల చట్టం అమలు బాధ్యతలను పంచాయతీ కార్యదర్శికి బదిలీ చేయడం. గ్రామ చావడీ నిర్వహణ బాధ్యత కూడా పంచాయతీ కార్యదర్శిపైనే ఉంటుంది.
వీఆర్వోల నుంచి పూర్తిగా తొలగించేవి… - భూమి శిస్తు, సెస్సు, పన్నుల వసూలు, ఇతర ప్రభుత్వ శాఖలకు వచ్చే రెవెన్యూ వసూలు అధికారాలు.
- వర్షాలు, వరదలు, ఇతర ప్రకృతి విపత్తుల సమయంలో జరిగే రైలు ప్రమాదాల సమాచారాన్ని ఆ శాఖకు.. విమాన ప్రమాదాల విషయాన్ని సమీపంలోని పోలీసు స్టేషన్లకు అధికారికంగా సమాచారం ఇచ్చే విధులు.
- కరెంట్ సరఫరాకు సంబంధించి అనధికారిక వాడకం, సరఫరాలో నష్టం వంటి విషయాలను సంబంధిత శాఖకు సమాచారం ఇచ్చే బాధ్యతలు.
- పైఆఫీసర్ ఎవరైనా బదిలీ, సస్సెన్షన్, రిమూవల్, డిస్మిస్, రిటైర్మెంట్ అయిన సందర్భాల్లో వీఆర్వోకు ఆ బాధ్యతలను అప్పగించడం ఉండదు.
- పోలీసు స్టేషన్‌తో కో ఆర్డినేషన్ చేసే అన్ని రకాల బాధ్యతలు.
పంచాయతీ సెక్రటరీకి అప్పగించేవి… - క్యాస్ట్, ఇన్‌కం, రెసిడెన్స్, సాల్వెన్సీ వంటి సర్టిఫికెట్లు జారీ చేసే అధికారం.
- అగ్ని ప్రమాదాలు, వరదలు, తుఫాను, ప్రమాదాలు, విపత్తులు జరిగినప్పుడు పైఆఫీసర్లకు సమాచారం ఇచ్చే డ్యూటీ.
- గుప్త నిధులు, ఎవరికీ చెందని ఆస్తులు సమాచారాన్ని ఉన్నతాధికారులకు.. పురాతన వస్తువులు, వారసత్వ భవనాలను కూల్చడం వంటి సమాచారాన్ని
- తహశీల్దార్‌కు తెలిపే విధులు. ఈ అంశాలపై పంచనామా నిర్వహణ.
- రెవెన్యూ రికవరీ యాక్టు అమలులో సంబంధిత అధికారులకు సాయంగా ఉండడం, లోన్ల రికవరీ డ్యూటీ.
- రకరకాల కార్యక్రమాలపై ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు గ్రామాల్లో డప్పు చాటింపు, ఇతర పబ్లిసీటీ కార్యక్రమాల నిర్వహణ.
- ఎన్నికల ఓటర్ల జాబితా అప్‌గ్రేడేషన్, ఇతర ఎన్నికల నిర్వహణ డ్యూటీ.
తెలంగాణలో కరోనా పాజిటివ్ రేటు దేశంలోనే హయ్యెస్ట్