పెరిగిన దూరం : కేసీఆర్, జగన్​ ఎడమొకం పెడమొకం

పెరిగిన దూరం : కేసీఆర్, జగన్​ ఎడమొకం పెడమొకం
  • గోదావరి‌‌–కృష్ణా లింక్​పై ఎవరి దారి వారిదే
  • ఆర్టీసీ, మద్యంపై సెపరేటు రూట్లు
  • ఇక్కడ పక్కనబెట్టిన ఆఫీసర్లకు అక్కడ కీ రోల్‌
  • కాళేశ్వరంపై సుప్రీంలో ఏపీ ఫైట్​
  • ఆస్తుల పంపకాలపై తెగని పంచాయితీ

హైదరాబాద్, వెలుగు: ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్​కు మధ్య మూడో సమావేశం తర్వాత దూరం పెరుగుతూ వస్తోంది. ఇద్దరూ తొలిసారిగా జూన్‌ 28న సమావేశమయ్యారు. ఆ తర్వాత రెండో సారి ఆగస్టు 2న, మూడోసారి సెప్టెంబర్​ 23న ప్రగతిభవన్‌ లో భేటీ అయ్యారు. మూడో భేటీలో ఆర్థిక మాంద్యం, కేంద్రం సహకారం, నిధుల కేటాయింపు, తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు బయటకు పొక్కింది. మరుసటి రోజునే  కేంద్రం వైఖరిపై అసలు చర్చనే జరగలేదని ఏపీ సీఎంవో వర్గాలు ఖండించాయి. ఆ తర్వాత  భేటీలు జరుగలేవు. దీంతో మూడో మీటింగ్‌ లోనే ఇద్దరు సీఎంల మధ్య భిన్నాభిప్రాయాలు పొడసూపాయనే వాదనలున్నాయి.

ఢిల్లీలోనూ సపరేట్‌ రూట్‌

కేంద్రంతో సంబంధాల విషయంలోనూ ఇద్దరు సీఎంలు చెరో రూట్‌ ఎంచుకున్నారు. ఆరేండ్లుగా కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులన్నింటికీ మద్దతిచ్చిన టీఆర్‌ఎస్​ తొలిసారిగా సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసింది.  రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా రాలేదని, జీఎస్టీ బకాయిలు చెల్లించాలని ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌ బయట నిరసన తెలిపారు. ఈ రెండు అంశాల్లోనే జగన్‌ కేసీఆర్‌కు దూరంగా ఉండటంతో పాటు.. బీజేపీకి సంపూర్ణంగా మద్దతు పలికారు.

కొత్తలో ఇద్దరు సీఎంలు కలిసి కొబ్బరికాయ కొట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు.. క్రమంగా ఇద్దరినీ దూరం చేసింది. సీఎం కేసీఆర్‌‌ ప్రత్యేకంగా విజయవాడకు వెళ్లి ఈ ప్రాజెక్టు ప్రారంభానికి జగన్‌‌ను ఆహ్వానించటం.. ఆయన హాజరవటం.. అప్పట్లో  జాతీయస్థాయిలో ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక్కసారిగా ఏపీ ప్లేట్‌‌ ఫిరాయించింది. భారీ ఖర్చుతో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. దీన్ని వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కౌంటర్‌‌ దాఖలు చేసింది. రీఇంజనీరింగ్‌‌ పేరుతో  నిర్మించిన కాళేశ్వరంతో దిగువన ఉన్న ఏపీ రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని, జాతీయ హోదా ప్రకటించడానికి వీల్లేదని ఏపీ వాదిస్తోంది.

తెగిన లింక్‌‌.. గోదావరి టు కృష్ణా

గోదావరి జలాలను కృష్ణాకు మళ్లించాలనే ప్రతిపాదన కొత్తలో రెండు రాష్ట్రాల సీఎంలను దగ్గర చేసింది. గోదావరి నీటితో రాయలసీమను, పాలమూరును సస్యశ్యామలం చేస్తామని కేసీఆర్‌‌ ప్రకటించగా.. ఎక్కడ రిజర్వాయర్‌‌ నిర్మించాలి? ఎక్కడి నుంచి నీటిని శ్రీశైలం వరకు తీసుకెళ్లాలి? అనే అంశాలపైనే ఇద్దరు సీఎంలు, అటు ఇరిగేషన్‌‌ అధికారులు రెండునెలల పాటు వరుసగా  చర్చలు జరిపారు. ఇటీవల చర్చలు ఆగిపోయాయి. తెలంగాణ భూ భాగంతో సంబంధం లేకుండా.. పోలవరం నుంచి గోదావరి జలాలను బనకచర్ల రెగ్యులేటర్‌‌ వరకు తరలించే కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి డీపీఆర్‌‌ తయారు చేయాలని సీఎం జగన్‌‌ అక్కడి ఇరిగేషన్‌‌ అధికారులను ఆదేశించారు. గోదావరి– కృష్ణా జలాలను అనుసంధానించేందుకు ఈ ప్రాజెక్టును తలపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆర్టీసీపై కేసీఆర్‌‌కు కౌంటర్‌‌

ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సీఎం జగన్‌‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే ప్రధాన డిమాండ్​తో తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు 53 రోజులు సమ్మె చేస్తే కేసీఆర్‌‌ డిఫరెంట్‌‌గా రియాక్టయ్యారు. భూగోళం ఉన్నంత వరకు ఆర్టీసీని విలీనం చేయటం అసంభవమని కొట్టిపారేశారు. ఏపీలోనూ పెద్దగా చేసిందేమీ లేదని, అక్కడ  ఒక కమిటీ వేశారని.. ఆ కమిటీ నివేదిక ఇచ్చే వరకు మూడు నెలలో ఆరు నెలలో పడుతుందని తేలిగ్గా మాట్లాడారు. మరుసటి రోజునే ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి చూపిస్తామని పరోక్షంగా కేసీఆర్​కు కౌంటర్‌‌ ఇచ్చారు.

మందు.. అక్కడ దశలవారీగా బంద్..ఇక్కడ ఫుల్​

దశలవారీగా మద్యాన్ని నిషేధించేందుకు జగన్​ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైన్​ షాపులను నడుస్తున్నాయి.  అది కూడా రాత్రి 8 దాటితే అమ్మకాలు బంద్. తెలంగాణలో మాత్రం మద్యం ఫుల్లుగా అమ్ముతున్నారు. రాష్ట్ర ఖజానాకు పెద్దమొత్తంలో ఆమ్దానీని సమకూర్చే వనరుల్లో మందే ముందు వరుస అన్న పరిస్థితి తయారైంది. ఇటీవల మద్యం రేట్లను కేసీఆర్​ సర్కార్​ 10 శాతం పెంచేసింది. పైగా రాత్రి 11 గంటల వరకు మద్యం అమ్మకాలు సాగుతున్నాయి.  మద్యం అమ్మకాలతోనే అఘాయిత్యాలు జరుగుతున్నాయని ‘దిశ’ సజీవ దహనం ఘటనపై జగన్‌‌  ఏపీ అసెంబ్లీలో అన్నారు. ఏపీలో మద్యం అమ్మకాల నియంత్రణ పాలసీ అమల్లో ఉండటంతో.. జగన్‌‌ మాటలు, చేతలన్నీ తెలంగాణలో కేసీఆర్‌‌ కు ఇరుకున పెడుతున్నాయనే అధికార పార్టీలోని ఓ నేత అభిప్రాయపడ్డారు.

ఇక్కడ నచ్చనోళ్లు.. ఏపీలో కీ రోల్​లో

కేసీఆర్​ పక్కనపెట్టిన పలువురు ఐపీఎస్, ఐఏఎస్‌‌ అధికారులను జగన్‌‌ దగ్గరికి తీశారు. వాళ్లకు ఏపీలో మంచి పోస్టింగ్​లు ఇవ్వడం అధికార వర్గాల్లో హాట్‌‌ టాపికైంది. భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌‌ గా పని చేసి మంచి పేరు తెచ్చుకున్న ఐఏఎస్‌‌ ఆఫీసర్‌‌ ఆకునూరి మురళిని తెలంగాణ ప్రభుత్వం స్టేట్‌‌ ఆర్కివ్స్‌‌ సెక్రెటరీగా అప్రాధాన్య పోస్టింగ్‌‌ ఇచ్చింది. ఆవేదనకు గురైన మురళి పది నెలల ముందే వీఆర్‌‌ఎస్‌‌ తీసుకున్నారు. ఆయనను జగన్‌‌ తన  ప్రభుత్వ సలహాదారుగా నియమించుకోవటం చర్చనీయాంశమైంది. ఐపీఎస్‌‌ అధికారి స్టీఫెన్‌‌ రవీంద్రను ఏపీ ఇంటెలిజెన్స్‌‌ చీఫ్‌‌గా నియమించుకునేందుకు జగన్‌‌ ఆసక్తి చూపారు. డీవోపీటీ అంగీకరించకపోవటంతో ఈ ప్రపోజల్‌‌ ఆగిపోయింది. మాజీ సీఎం వైఎస్సార్​ మరణానంతరం కేసుల్లో ఇరుక్కున్న సీనియర్‌‌ ఐఏఎస్‌‌ అధికారి శ్రీలక్ష్మి ఏపీ కేడర్‌‌ కు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. జనాభా లెక్కలను పట్టించుకోకుండా కేసీఆర్‌‌ సొంత లెక్కలతో పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్లు ఇచ్చారని మండిపడ్డ జస్టిస్‌‌ వంగాల ఈశ్వరయ్యను ఏపీ ప్రభుత్వం ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌‌ చైర్మన్‌‌గా నియమించింది.

వీడని విభజన పంచాయతీ!

మొదట్లో విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్​లో ఉన్న అంశాలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఇద్దరు సీఎంలు పరస్పరం చొరవ ప్రదర్శించారు. కానీ ఇప్పటికీ 9, 10 షెడ్యూలులోని సంస్థల ఆస్తుల పంపిణీ అంశాలేవీ కొలిక్కిరాలేదు. ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ప్రాంత నాలుగో తరగతి ఉద్యోగులను.. సొంత రాష్ట్రానికి కేటాయించే అంశంపై ఇటీవల ఏపీ అంగీకారం తెలిపినప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఏపీ అధీనంలో ఉన్న  హైదరాబాద్​లోని లేక్‌‌ వ్యూ గెస్ట్‌‌ హౌస్​​కు సంబంధించి  రూ. 2 కోట్ల కరెంటు బిల్లులు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఏపీకి నోటీసులు జారీ చేసింది. విద్యుత్‌‌ పంపిణీ ఒప్పందాలకు సంబంధించి దాదాపు రూ. 5 వేల కోట్లు తమకే రావాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం ఈ నోటీసును తోసిపుచ్చింది.