
- యూఎస్ ఆంక్షలు, స్విఫ్ట్‌ను తనకు నచ్చినట్టు వాడుకోవడంతో ఆల్టర్నేటివ్ కరెన్సీ వైపు చూస్తున్న దేశాలు
- డాలర్ వాడకపోతే బ్రిక్స్ దేశాలపై 10 శాతం టారిఫ్ వేస్తామని ట్రంప్ హెచ్చరిక
- రష్యాతో ట్రేడ్ చేసే దేశాలపై 500 శాతం టారిఫ్ వేస్తామని వెల్లడి
- రూపాయిల్లో వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తున్న ఇండియా
న్యూఢిల్లీ: డాలర్ కాని కరెన్సీలలో వాణిజ్యం చేసే బ్రిక్స్ దేశాలపై 10శాతం టారిఫ్, రష్యన్ ఆయిల్ కొనే దేశాలపై 500శాతం పెనాల్టీ వేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూస్తున్నారు. బ్రిక్స్‌లో భారత్, బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఈజిప్ట్, యూఏఈ, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి. అమెరికా ఆంక్షలు, స్విఫ్ట్ బ్యాన్‌ల వల్ల రష్యా, ఇరాన్, వెనిజులా వంటి దేశాలు డాలర్ చెల్లింపులను ఉపయోగించలేకపోయాయని, దీంతో భారత్, చైనా వంటి దేశాలు రష్యాతో స్థానిక కరెన్సీలలో వాణిజ్యం చేయవలసి వచ్చిందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ అన్నారు. స్విఫ్ట్‌తో ప్రపంచవ్యాప్తంగా బ్యాంకుల మధ్య డబ్బు చెల్లించవచ్చు. “డాలర్ నుంచి మారడం తిరుగుబాటు కాదు, అది ఏకైక మార్గం” అని అభిప్రాయపడ్డారు.
రష్యా-, చైనా వాణిజ్యంలో 90శాతం కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్లు రూబుల్స్ (రష్యన్ కరెన్సీ), యువాన్ (చైనీస్ కరెన్సీ) లలో సెటిల్ అవుతున్నాయి. రష్యన్ ఆయిల్ కోసం రూపాయలు, యూఏఈ దిర్హామ్‌లలో ఇండియా చెల్లిస్తోంది. సౌదీ అరేబియా కూడా నాన్-డాలర్ ఆయిల్ ట్రేడ్‌కు ఓపెన్‌గా ఉంది. “అమెరికా చర్యల వలన దేశాలు డాలర్‌కు ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్నాయి” అని జీటీఆర్‌ఐ పేర్కొంది.
డాలర్‌కే ఇండియా మొగ్గు
ట్రంప్ టారిఫ్ బెదిరింపులతోనే అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం కష్టంగా మారుతోందని శ్రీవాస్తవ వివరించారు. స్విఫ్ట్ 200 దేశాల్లో 11 వేల బ్యాంకులను అనుసంధానిస్తోంది. కానీ అమెరికా ఇరాన్, వెనిజులా, రష్యాపై ఆంక్షలు విధించడంతో ఈ దేశాలు స్విఫ్ట్‌ను వాడలేకపోతున్నాయి. ఆర్‌బీఐ 2022లో రూపాయలలో ట్రేడ్ సెటిల్‌మెంట్‌కు అనుమతిచ్చింది. ఈ నిర్ణయంతో డాలర్ కొరత ఉన్న దేశాలు లాభపడ్డాయి. రష్యన్ బ్యాంకులు భారత్‌లో రూపాయి ఖాతాలు తెరిచాయి. ‘‘డాలర్‌కు ఇండియా దూరంగా ఉండాలని అనుకోవడం లేదు.
బ్రిక్స్ కామన్ కరెన్సీ తేవాలని చైనా ప్రతిపాదించినా, ఇండియా తిరస్కరించింది” అని శ్రీవాస్తవ అన్నారు. స్థానిక కరెన్సీలలో వాణిజ్యం దేశ హక్కు అని, దీనివల్ల డబుల్- డాలర్ కన్వర్షన్ (రెండు సార్లు డాలర్లలోకి మార్చడం) ను తప్పించి 4శాతం వరకు ట్రాన్సాక్షన్ ఖర్చులను ఆదా చేయొచ్చని పేర్కొన్నారు. “ఈ ఆదా గుర్తించిన దేశాలు స్థానిక కరెన్సీ ట్రేడ్‌ను పెంచుతాయి” అని అన్నారు.
అమెరికా ప్రొడక్ట్‌లపై ఇండియా ప్రతీకార సుంకాలు..
స్టీల్, అల్యూమినియం దిగుమతులపై అమెరికా విధించిన టారిఫ్‌లకు ప్రతీకారంగా భారత్ కూడా సుంకాలు విధించాలని చూస్తోంది. అమెరికా నుంచి చేసుకునే దిగుమతులపై అదనపు సుంకాలు వేసి సుమారు 3.82 బిలియన్ డాలర్ల (రూ.32,852 కోట్ల) ఆదాయాన్ని పొందాలని చూస్తున్నామని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీఓ) కి ఇచ్చిన నోటిఫికేషన్‌లో ఇండియా పేర్కొంది.
స్టీల్, అల్యూమినియంపై సుంకాలను 25 శాతం నుంచి 50శాతానికి జూన్ 3న అమెరికా పెంచిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సుంకాలతో 7.6 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులు ప్రభావితం అవుతాయి. ఈ నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల తర్వాత అమెరికా ప్రొడక్ట్‌లపై ఇస్తున్న రాయితీలను రద్దు చేసే హక్కు ఇండియాకు ఉంటుంది. అమెరికా స్టీల్, అల్యూమినియంపై వేసిన సుంకాల గురించి డబ్ల్యూటీఓకి నోటిఫై చేయలేదని, ఇవి జీఏటీటీ 1994, అగ్రిమెంట్ ఆన్ సేఫ్‌గార్డ్స్ (ఏఓఎస్)కు విరుద్ధమని, చర్చలు జరపలేదని భారత్ ఆరోపించింది.
మార్చి 12న అమెరికా 25శాతం సుంకాలు విధించగా, మే 9న భారత్ 1.91 బిలియన్ డాలర్లు వసూలు చేసేలా ప్రతీకార సుంకాలు విధిస్తామని డబ్ల్యూటీఓకి తెలిపింది. అమెరికా జులై 4న వాహనాలు, ఆటో పార్ట్స్‌పై విధించిన 25శాతం అదనపు సుంకాలకు ప్రతీకారంగా, 723.75 మిలియన్ డాలర్లు వసూలు చేసేలా సుంకాలు విధిస్తామని భారత్ తెలిపింది.