రెండు దేశాల్లో 5 వేలు దాటిన మరణాల సంఖ్య

రెండు దేశాల్లో 5 వేలు దాటిన మరణాల సంఖ్య
  •     టర్కీలోనే 3,549 మంది మృతి.. 22 వేల మందికి గాయాలు
  •     సిరియాలో 1,602 మంది.. ఆ ప్రావిన్స్​లలో 3 నెలల ఎమర్జెన్సీ
  •    రూ.43వేల కోట్ల సహాయ ప్యాకేజీ: టర్కీ ప్రెసిడెంట్​ ఎర్డోగన్​ 
  •    సాయం ప్రకటించిన 70 దేశాలు

అదనా(టర్కీ): టర్కీ, సిరియాలలో చోటుచేసుకున్న భూకంపం భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. ఎంతోమందికి నిలువనీడ లేకుండా చేసింది. మరెంతో మందిని అయిన వారికి దూరం చేసింది. ఇంకెంతో మంది భవిష్యత్తును అంధకారం చేసింది. ఈ విలయం కారణంగా మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. మంగళవారం నాటికి టర్కీ, సిరియాలలో 5 వేల మందికిపైగా మృతిచెందారు. మృతుల్లో 3,549  మంది టర్కీవారు ఉండగా, 1,602 మంది సిరియా దేశస్తులు ఉన్నారు. టర్కీలోని  భూకంప ప్రభావిత 10 ప్రావిన్స్​ల పరిధిలో మరో 22,168 మంది గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. అయితే టర్కీలో మరణాల సంఖ్య 10వేలు దాటొచ్చని అమెరికా జియోలాజికల్​ సర్వే  సంస్థ అంచనా వేసింది. 

మంగళవారం మరో భూకంపం

మూడు భారీ భూకంపాలు కుదిపేసి 24 గంటలైనా గడవకముందే మంగళవారం ఉదయం సెంట్రల్​ టర్కీలోని ప్రావిన్స్​లలో మరో ఎర్త్​ క్వేక్​ వచ్చింది. దీని తీవ్రత 5.9 గా ఉన్నట్లు గుర్తించారు. సోమవారం రోజున ఆగ్నేయ టర్కీలోని ప్రావిన్స్​లలో మూడు భారీ భూకంపాల తర్వాత.. మరో 100 భూప్రకంపనలు కూడా చోటుచేసుకున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి తీవ్రత కూడా రిక్టర్​ స్కేల్​ పై 4 కంటే ఎక్కువే ఉందన్నారు. ఇంకొన్ని రోజులపాటు 5 నుంచి 6 తీవ్రతతో మరిన్ని భూకంపాలు సంభవించే ముప్పు ఉందని హెచ్చరించారు. టర్కీలోని ఇసికందరన్​నగరంలో ఉన్న లిమాక్​ పోర్టు భూకంపానికి దెబ్బతింది. అక్కడ కంటైనర్లు ఉంచిన ప్రదేశంలో భారీగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో పలు ప్రావిన్స్​లకు పైపు లైన్​లో గ్యాస్​ సరఫరాను ఆపేశారు. దాదాపు 6 వేలకుపైగా బిల్డింగ్​లు కూలిపోయినట్లు టర్కీ ప్రభుత్వం గుర్తించింది. వాటి శిథిలాల కింద చిక్కుకుపోయిన 8000 మందికిపైగా ప్రజలను రక్షించి షెల్టర్​ క్యాంప్​లకు తరలించామని తెలిపింది. ప్రస్తుతం టర్కీలోని భూకంప ప్రభావిత ప్రావిన్స్​లలో 24,400 ఎమర్జెన్సీ హెల్పింగ్ ​సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. అక్కడ తీవ్రమైన చలి వాతావరణం ఉంది. 3 డిగ్రీల సెల్సియస్​లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో సహాయక చర్యలను వేగవంతంగా  కొనసాగించడం కష్టతరమవుతోంది. 

11 స్పేస్​ ఏజెన్సీలు రెడీ..

టర్కీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు ‘స్పేస్​ అండ్​ మేజర్​ డిజాస్టర్స్​’ ఇంటర్నేషనల్​ చార్టర్ ను ఐక్యరాజ్యసమితి మంగళవారం ఉదయం యాక్టివేట్​ చేసింది. దీంతో ఈ చార్టర్​లో సభ్యత్వం కలిగిన 11 స్పేస్​ ఏజెన్సీలు టర్కీ, సిరియాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల మ్యాపింగ్​ చేసేందుకు లైన్​ క్లియర్​ అయింది. ఆ సమాచారాన్ని స్పేస్ ఏజెన్సీ టర్కీ, సిరియా ప్రభుత్వాలకు అందిస్తాయి. ఫలితంగా సహాయక చర్యలు మరింత ప్రభావవంతంగా చేపట్టేందుకు వీలు కలుగుతుంది. 

50వేల మంది రెస్క్యూ సిబ్బంది..

టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్​ భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 3 నెలల ఎమర్జెన్సీ ప్రకటించారు. అక్కడికి 50వేల మంది రెస్క్యూ సిబ్బందిని పంపుతామని తెలిపారు. బాధితులకు ఆర్థిక సాయానికి రూ.43వేల కోట్ల ప్యాకేజీ అనౌన్స్​ చేశారు. వారం పాటు జాతీయ సంతాప దినా లను ప్రకటించారు. ఈ నెల 12 వరకు దేశంతో పాటు విదేశాల్లోని తమ ఎంబసీలలో  జాతీయ పతాకాన్ని అవనతం చేస్తామన్నారు.  


టర్కీకి వెళ్లిన 2 ఎన్డీఆర్ఎఫ్​ టీమ్స్​

టర్కీ, సిరియాలకు సాయం చేయడానికి దాదాపు 70 దేశాలు ముందుకొచ్చాయి. రెస్క్యూ టీమ్స్, మెడికల్​ టీమ్స్​, ఇంజినీర్స్​ టీమ్స్​​ను పంపిన దేశాల్లో ఇండియా, రష్యా, అమెరికా, ఇటలీ, మెక్సికో, ఫ్రాన్స్, మాల్డోవా, మాంటెనిగ్రో, క్రొయేషియా, రొమేనియా, పోలెండ్, ఆస్ట్రియా, జపాన్, చెక్​ రిపబ్లిక్, స్విట్జర్లాండ్, తైవాన్, బ్రిటన్, పాకిస్తాన్, దక్షిణ కొరియా, జర్మనీ, స్పెయిన్, లిబియా, గ్రీస్, పాలస్తీనా, ఇజ్రాయెల్​ ఉన్నాయి. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు 101 మందితో కూడిన నేషనల్​ డిజాస్టర్​ రెస్పాన్స్​ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్​) కు చెందిన రెండు టీమ్స్​మంగళవారం ఇండియా నుంచి టర్కీకి బయలుదేరి వెళ్లాయి. ఇందులో ఐదుగురు మహిళా సిబ్బంది కూడా ఉన్నారు.

కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎమోషనల్ అయ్యారు. టర్కీ, సిరియా భూకంప మృతులకు సంతాపం తెలుపుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 2001లో గుజరాత్‌‌లో వేలాది మంది ప్రాణాలను బలిగొన్న భుజ్ భూకంపాన్ని గుర్తుచేసుకొని ఆయన కంటతడి పెట్టారు. మనం కూడా ఇలాంటి విపత్తులను ఎదుర్కొన్నామన్న మోడీ..  ఈ క్లిష్ట సమయంలో టర్కీకి ఇండియా అన్నివిధాలా సాయం అందిస్తుందని చెప్పారు.

జైలు ధ్వంసం.. ఖైదీలు పరార్

భూకంపం ధాటికి సిరియాలోని రాజో ప్రాంతంలో ఉన్న  మిలటరీ పోలీసు జైలు ధ్వంసమైంది. దీనిని అదనుగా భావించి 20 మంది ఖైదీలు పారిపోయారు. ఈ జైలులోని 2 వేల మంది ఖైదీల్లో 1300 మందికి ఇస్లామిక్​స్టేట్​ ఉగ్రవాద సంస్థకు చెందినవారే. 

ముందే పసిగట్టిన పక్షులు

టర్కీలో సంభవించిన భారీ భూకంపాన్ని పక్షులు ముందే పసిగట్టాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.  దీన్ని నిరూపించే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టర్కీలో భూకంపం రావడానికి ముందు పక్షులు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరాయి. సోమవారం తెల్లవారుజామున భవనాలపై అరుస్తూ చక్కర్లు కొట్టాయి. వింతగా ప్రవర్తించాయి. అయితే జనం మాత్రం పక్షుల సంకేతాన్ని పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర దాన్ని రీట్వీట్ చేశారు.

శిథిలాల కింద మహిళ ప్రసవం..

టర్కీలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడుతున్న క్రమంలో సహాయక సిబ్బందికి ఒక శిశువు ఏడుపు వినిపించింది. శిథిలాలను తొలగించి శిశువు దగ్గరకు వెళ్లిన సహాయక సిబ్బంది అక్కడి పరిస్థితిని చూసి కన్నీళ్లు ఆగలేదు. ఓ బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్న ఓ నిండు గర్భిణి అక్కడే ప్రసవించింది. బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి కన్నుమూసింది. దీంతో గుక్కపెట్టి ఏడుస్తున్న  శిశువును రక్షించిన రెస్క్యూ టీం వెంటనే హాస్పిటల్​కు తరలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.