లిక్కర్ స్కామ్​లో పిళ్లైని విచారించిన ఈడీ

లిక్కర్ స్కామ్​లో పిళ్లైని విచారించిన ఈడీ

హైదరాబాద్, వెలుగు:  ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. సీబీఐ నమోదు చేసిన కేసులో 14వ నిందితుడైన అరుణ్ రామచంద్ర పిళ్లైని మనీ ల్యాండరింగ్ కేసులో ఆదివారం విచారించింది. లిక్కర్ స్కామ్​లో మనీ ల్యాండరింగ్​కు సంబంధించి దర్యాప్తు చేస్తున్న ఈడీ.. ఈ నెల 7,16న రెండుసార్లు తనిఖీలు చేపట్టింది. 

మీడియేటర్లకు ఇచ్చిన 4 కోట్లు ఎక్కడివి ?

పిళ్లై ఇల్లు, ఆఫీసుల నుంచి డిజిటల్ డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకుంది. ఆ వివరాల ఆధారంగా ఆదివారం హైదరాబాద్ బషీర్ బాగ్ లోని ఆఫీసులో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పిళ్లైని ప్రశ్నించింది. రాబిన్ డిస్టిలరీ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలతో పాటు ఢిల్లీకి చెందిన ఇండో స్పిరిట్ కంపెనీపై వివరాలు రాబట్టింది. లంచం డబ్బు అధికారులకు చేరడంలో ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రు, ముంబైకి చెందిన ఓన్లీ మచ్ లౌడర్ సంస్థ సీఈఓ విజయ్ నాయర్ మీడియేటర్లుగా వ్యవహరించారు. వీళ్ల నుంచే దాదాపు రూ.4 కోట్ల వరకు అధికారులకు లంచం అందింది. ఆ డబ్బు ఎక్కడిదని పిళ్లైని ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయన చెప్పిన వివరాలను రికార్డు చేసినట్లు సమాచారం. కాగా, సోమవారం పిళ్లైతో పాటు రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్లుగా ఉన్న అభిషేక్ రావు, ప్రేమ్ సాగర్, సీఎ గోరంట్ల బుచ్చిబాబును ఈడీ విచారించే అవకాశం ఉంది.