జార్ఖండ్ సీఎంను ఎమ్మెల్యేకు అనర్హుడిగా ప్రకటిస్తూ ఈసీ నిర్ణయం

జార్ఖండ్ సీఎంను ఎమ్మెల్యేకు అనర్హుడిగా ప్రకటిస్తూ ఈసీ నిర్ణయం

న్యూఢిల్లీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈసీ సిఫార్సు మేరకు సోరెన్ సభ్యత్వాన్ని గవర్నర్ రమేశ్ బాయిస్ రద్దు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలన్న ఎన్నికల సంఘం సిఫార్సుతో గవర్నర్ రమేశ్ బాయిస్ చర్యలు తీసుకున్నారు. గత సంవత్సరం స్టోన్ మైనింగ్ లీజు కేటాయింపులో తన పదవిని దుర్వినియోగం చేశారంటూ సోరెన్ ను దోషిగా తేల్చారు. రాంచీలోని అంగడాలో సోరెన్ తన పేరు మీద మైనింగ్ లీజు తీసుకున్నారని 2022 ఫిబ్రవరిలో బీజేపీ ప్రతినిధుల బృందం ఆరోపించింది. ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని గత కొద్దిరోజులుగా బీజేపీ డిమాండ్ చేస్తోంది. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో  విచారించిన ఎన్నికల సంఘం.. హేమంత్ సోరెన్ కు సంబంధించిన లీజులు, షెల్ కంపెనీల్లో ఆయన, ఆయన సన్నిహితుల వాటాలను తేల్చింది. ఆరోపణలు రుజువు కావడంతో ఆయన సభ్యత్వ రద్దుకు గవర్నర్ కు సిఫార్సు చేసింది. 

సీఎం హేమంత్ సోరెన్ ఎమ్మెల్యే పదవికి అనర్హుడంటూ ఎన్నికల సంఘం ప్రకటించడం వెనుక బీజేపీ కుట్ర ఉందని జేఎంఎంతోపాటు అధికార కూటమిలోని యూపీఏ నేతలు ఆరోపిస్తున్నారు. మోడీ ప్రభుత్వం ప్రతిపక్ష ముఖ్యమంత్రులను వేధిస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగ సంస్థలైన సీబీఐ, ఈడీ, ఈసీలను ప్రయోగిస్తూ ప్రతి పక్ష ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని ఫైర్ అయ్యారు. ఇక ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించిన నేపథ్యంలో సీఎంగా కొనసాగాలంటే వచ్చే 6 నెలల్లోగా హేమంత్ సోరెన్ తిరిగి ఎమ్మెల్యేగానైనా ఎన్నిక కావాలి లేదంటే ఎమ్మెల్సీ పదవినైనా చేపట్టాలి.