‘గుట్ట’లో పనులు పూర్తి కాలే!

‘గుట్ట’లో పనులు పూర్తి కాలే!
  • ఇంకా నిర్మాణంలోనే ఎంట్రీ ఘాట్ రోడ్డు బ్రిడ్జి
  • బస్​బేలు, కమాండ్​ కంట్రోల్ రూం, కమాన్​ పరిస్థితీ అంతే...
  • వ్రత మండపం, అన్నదాన సత్రం కూడా కంప్లీట్ ​చేయలే 
  • దుకాణాల సముదాయం సంగతి సరే సరి...

యాదాద్రి, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్​ పునః​ప్రారంభం నాటికి అన్ని పనులు పూర్తవుతాయని సీఎం కేసీఆర్​ చెప్పిన మాటలు నిజం కాలేదు.  పనులు ఎన్ని రోజులకు పూర్తవుతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. గతేడాది అక్టోబర్​19న యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం కేసీఆర్​ ఆలయం మార్చి 28న ​పునః​ప్రారంభమవుతుందని, అప్పటిలోగా పెడింగ్ ​పనులన్నీ పూర్తవుతాయని ప్రకటించారు. అయితే  ఆలయాన్ని ప్రారంభించి 50 రోజులవుతున్నా, ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. 
 

జూన్​ నాటికైనా పూర్తి చేస్తరా? 
కొండ చుట్టూ ఆరు లైన్ల రింగు రోడ్డు, ఎంట్రీ, ఎగ్జిట్ ఘాట్ రోడ్లకు మొత్తం రూ.143 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇందులో భాగంగా నిర్మిస్తున్న ఎంట్రీ ఘాట్​రోడ్డు బ్రిడ్జి పిల్లర్ల స్థాయిలోనే ఉంది. నిజానికి ఈ ఘాట్​రోడ్డుకు సంబంధించిన మెటీరియల్​ను చెన్నైకి సముద్రమార్గంలో తీసుకువచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తేవాలి. రోడ్డు కూడా టెంపుల్ ​ప్రారంభం నాటికే పూర్తి కావాలి. కానీ, ఇంతవరకూ కంప్లీట్ ​చేయలేదు. ఇప్పటికే నిర్మించిన ఎగ్జిట్ ​ఘాట్​ రోడ్డు ఇటీవల కురిసిన వానకు కుంగిపోయింది. కొండ మీద, కొండ కింద నిర్మిస్తున్న బస్​బేలు, కమాండ్​కంట్రోల్ సెంటర్,​ నార్త్​ రిటైనింగ్​ వాల్,​ మెయిన్​ఆర్చీ (కమాన్​)కి కలిపి మొత్తం రూ. 36 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయితే రెండు బస్​బేలు, కమాండ్​కంట్రోల్ రూం, కమాన్​ పనులు పెండింగ్​లోనే ఉన్నాయి. బస్​బేలు అందుబాటులోకి రాకపోవడంతో భక్తులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నారు. సత్యనారాయణ వ్రత మండపం కోసం కొండ మీద నిర్మించిన భవనాన్ని క్యూలైన్ల కోసం ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నారు.

దీనికి బదులుగా కొండ కింద రెండెకరాల స్థలంలో రూ. 17 కోట్లతో నిర్మిస్తున్న వ్రతమండపం పనులనూ పూర్తి  చేయలేదు. దీంతో కొండ కిందే గోశాలలో ఏర్పాటు చేసిన షెడ్​లో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నారు. చివరకు భక్తుల సాయంతో రూ.11 కోట్లతో నిర్మిస్తున్న అన్నదాన సత్రం పనులు కూడా స్లోగానే సాగుతున్నాయి. కొండ కింద పుష్కరిణి వద్ద నిర్మిస్తున్న దుకాణాల సముదాయం ఎప్పటిలోగా పూర్తవుతుందో తెలియకుండా ఉంది. మొత్తంగా టెంపుల్​ పునః ప్రారంభం వరకు స్పీడ్​గా సాగిన పనులు తర్వాత నెమ్మదించాయి. పనులను పర్యవేక్షిస్తున్న ఆఫీసర్లు జూన్​నాటికి అందుబాటులోకి తెస్తామని చెబుతున్నా, ప్రస్తుతం పనులు  జరుగుతున్న తీరు చూస్తే మూడు నెలలకు పైగానే పట్టే అవకాశం కనిపిస్తోంది. వానలు మొదలైతే ఇంకా లేటయినా ఆశ్చర్యపోనక్కరలేదు.